ETV Bharat / international

అధ్యక్షుడిగా బైడెన్​ తొలి సంతకం దేనిపై?

author img

By

Published : Nov 8, 2020, 12:59 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్​ ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన పోరులో ట్రంప్​పై విజయదుందుబి మోగించారు. సర్వేల అంచనాలు నిజం చేస్తూ తొలిసారి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అయితే వైట్​హౌస్​లో అడుగుపెడుతున్న బైడెన్​.. తొలి సంతకం దేని మీద చేయనున్నారు? 100 రోజుల ప్రణాళిక ఎలా ఉంటుంది? కీలక నిర్ణయాలు ఏంటి? అనే అంశాలను ఓసారి పరిశీలిద్దాం.

biden news
అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్​ ఘనవిజయం.. 100 రోజుల ప్లాన్​ ఇదే

అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో ముందస్తు సర్వేలే నిజమయ్యాయి. డొనాల్డ్ ట్రంప్​పై జో బైడెన్ ఘన విజయం సాధించారు. ఫలితంగా రెండోసారి అధ్యక్ష పదవిని అలంకరించాలన్న ట్రంప్​ ఆశయానికి గండిపడింది.

బైడెన్​ అధికారంలోకి వస్తే కరోనాను కట్టడి చేస్తారని ప్రతి 10మందిలో నలుగురు ఓటర్లు విశ్వసించారు. ట్రంప్​ కంటే ఆయన మెరుగైన పాలన అందిస్తారని భావించారు. అగ్రరాజ్యంలో జాత్యహంకార ఘటనలు పెరగడం సహా జాతివివక్షను ప్రేరేపించేలా ట్రంప్​ వ్యాఖ్యలు.. రిపబ్లికన్​ అధ్యక్షుడి ఓటమికి కారణమయ్యాయి.

తొలి సంతకం-100 రోజుల ప్లాన్​...

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్​ ముందు కొన్ని లక్ష్యాలున్నాయి. కరోనా కట్టడికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికపై తొలి సంతకం చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులపైనా నూతన అధ్యక్షుడు ​దృష్టిపెట్టనున్నారు.

కరోనాపై పోరు..

లక్షలాది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు బైడెన్​. దేశవ్యాప్తంగా కరోనా కట్టడి కోసం నయా ప్రణాళికను అమలు చేయనున్నారు. ప్రజారోగ్య సంరక్షణ విషయంలోనూ మొదటి ప్రకటన చేయనున్నారు. మాస్కు తప్పనిసరి చేయడం, టెస్టింగ్​, కాంటాక్ట్​ ట్రేసింగ్​ను పెంచడం, కొవిడ్​-19 కారణంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేయడం వంటి చర్యలు చేపట్టనున్నారు బైడెన్​.

పట్టాలపైకి ఆర్థికం..

కరోనా వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు చర్యలు చేపట్టనున్నారు బైడెన్​. కొవిడ్​ ఉపశమన బిల్లు పేరిట దాదాపు 2 ట్రిలియన్​ డాలర్ల ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది.

పారిస్​ ఒప్పందం...

బైడెన్​ మళ్లీ పారిస్​ ఒప్పందంలో అమెరికాను భాగం చేయనున్నారు. నవంబర్​ 4నే ఈ ఒడంబడిక నుంచి వైదొలిగింది అగ్రరాజ్యం.

ఇరాన్​పై ఆంక్షలు..

ఇరాన్​పై ట్రంప్​ ప్రభుత్వం విధించిన ఆంక్షలను.. బైడెన్​ తొలగించే అవకాశం ఉంది. 2015లో ఇరాన్​తో చేసుకున్న అణు ఒప్పందాన్ని అగ్రరాజ్యం పునరుద్ధరించనుంది. ఇదే జరిగితే టెహ్రాన్​ చేస్తున్న అణుపరీక్షలకు తాత్కాలికంగా చెక్​ పడుతుంది.

ఒబామా కేర్​...

మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా పేరిట ఏర్పాటైన ఒబామా కేర్​ పథకాన్ని.. బైడెన్​ ముందుకు తీసుకెళ్లనున్నారు. ట్రంప్​ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసేందుకు చాలా ప్రయత్నాలు చేసింది.

పోలీస్​​ వ్యవస్థ...

నల్లజాతీయుల నిరసనలకు కారణమైన పోలీసింగ్​ వ్యవస్థను నియంత్రించేందుకు నూతన అధ్యక్షుడు చర్యలు తీసుకొనే అవకాశముంది. అయితే ఆయా బిల్లులకు సభల్లో ఆమోదం లభిస్తుందా అన్నది మాత్రం ప్రశ్నార్థకం.

రష్యాతో చర్చలు..

అమెరికా-రష్యా మధ్య నిరాయుధీకరణ విషయంలో చేసుకున్న 'న్యూ స్టార్ట్​' ఒప్పందం పొడిగించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ అంగీకరిస్తే.. మరో ఐదేళ్లపాటు దీన్ని కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. దీనితో ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ...

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)లో అమెరికా సభ్యత్వాన్ని బైడెన్​ పునరుద్ధరించవచ్చు. ఆ సంస్థకు నిధులు కేటాయించడంపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నిషేధం తొలగింపు..

ముస్లిం దేశాల నుంచి అగ్రరాజ్యానికి వచ్చే వారిపై ట్రంప్​ ప్రభుత్వం ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. వాటిని తొలగించే విషయాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు బైడెన్​.

సౌదీ అరేబియా, పశ్చిమాసియాలోని పలు దేశాలతో అంతర్జాతీయ సంబంధాలపై దృష్టిసారించనున్నారు బైడెన్​. యెమెన్​లో సౌదీ తలపెట్టిన యుద్ధానికి అగ్రరాజ్యం మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. 2016లో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.