ETV Bharat / entertainment

అధికార లాంఛనాలతో విజయ్​కాంత్​​ అంత్యక్రియలు- అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 29, 2023, 6:40 PM IST

Vijayakanth Funeral Rites : కోలీవుడ్ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయ్​కాంత్​ ప్రస్థానం ముగిసింది. గురువారం సాయంత్రం ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు, సినీ అభిమానులు అశ్రునయనాల మధ్య కన్నీటి వీడ్కోలు పలికారు.

Vijayakanth Funeral Rites
Vijayakanth Funeral Rites

Vijayakanth Funeral Rites : తమిళనాడు డీఎండీకే వ్యవస్థాపకులు, కోలీవుడ్​ సీనియర్​ నటుడు విజయ్​కాంత్​ (71) అంత్యక్రియలు అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. కోయంబేడులోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆయన పార్థివదేహానికి కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సినీ ప్రముఖులు, బంధువులు, సన్నిహితులు, అభిమానులు ఆశ్రనయనాల మధ్య దిగ్గజ నటుడికి అంతిమ వీడ్కోలు పలికారు.

అంతకుముందు, డీఎండీకే కార్యాలయంలో ఉంచిన విజయకాంత్‌ పార్థివదేహాన్ని చెన్నైలోని తీవు తిడల్‌కు తరలించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆ సమయంలో సినీనటులు కమల్​ హాసన్​, రజనీకాంత్​ వచ్చి విజయ్​కాంత్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. విజయకాంత్‌ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు సామాన్య ప్రజలతోపాటు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తమ అభిమాన నాయకుడు ఇక లేరన్న సమాచారంతో బోరున విలపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత తీవు తిడల్​ నుంచి మళ్లీ డీఎండీకే ప్రధాన కార్యాలయానికి విజయ్​కాంత్​ పార్థివదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

  • #WATCH | Chennai, Tamil Nadu: A large number of people gathered to pay tribute to DMDK President and Actor Vijayakanth. His mortal remains are being taken from Island ground, Anna Salai to Koyambedu DMDK office for the last rites. pic.twitter.com/cbSweIhY7z

    — ANI (@ANI) December 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇష్టమైన ప్రదేశంలోనే శాశ్వత నిద్రలోకి!
కోయంబేడులోని తన కల్యాణ మండపం అంటే విజయకాంత్‌కు ఎంతో ఇష్టం. పార్టీ ఆవిర్భావంతో దీనిని డీఎండీకే ప్రధాన కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచి అన్ని రకాల కార్యక్రమాలు, వ్యవహారాలు జరిగేవి. ఇక్కడకు వచ్చే కార్యకర్తలకు ఎల్లవేళలా కడుపు నిండా అన్నం పెట్టి పంపించేవారు. తనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇక్కడే నిర్వహించేవారు. గతంలో రాజకీయ కారణాలతో ఈ కల్యాణ మండపం కొంత భాగం వంతెన కోసం కేటాయించాల్సిన పరిస్థితి వచ్చినా, దీనిని ఆయన వదులుకోలేదు. ప్రస్తుతం ఆయన ఇక్కడే శాశ్వత నిద్రలోకి చేరుకున్నారు. ఈ కార్యాలయం ఆవరణలోనే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి.

కుటుంబ నేపథ్యం
విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మధురై (తమిళనాడు)లో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. తల్లిదండ్రులు కె.ఎన్‌. అళగర్‌స్వామి, ఆండాళ్‌ అజగర్‌స్వామి. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరైన షణ్ముఖ పాండియన్‌ సగప్తం, మధుర వీరన్‌ చిత్రాల్లో నటించారు.

విజయ్​కాంత్​ అనారోగ్య సమస్యలతో గురువారం ఉదయం చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్‌ ఇంటర్నేషనల్‌ హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలే తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న విజయకాంత్‌.. కొన్ని రోజుల క్రితమే డిశ్చార్జి అయ్యారు. అంతలోనే మరోసారి ఆస్పత్రి పాలై ఈలోకాన్ని విడిచారు.

విజయ్​కు చేదు అనుభవం: విజయ్​కాంత్ కుటుంబ సభ్యలను పరామర్శించేందుకు వెళ్లిన స్టార్ హీరో విజయ్ దళపతికి గురువారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. అక్కడ్నుంచి తిరిగి వెళ్తున్న సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు విజయ్​పైకి చెప్పు విసిరారు. వెంటనే భద్రత సిబ్బంది అప్రమత్తమైయ్యారు.

అక్కడ 'రమణ' ఇక్కడ 'ఠాగూర్​' - విజయకాంత్​ మూవీస్​తో టాలీవుడ్​ బ్లాక్​ బస్టర్స్​ ఇవే!

ఒకే ఏడాదిలో 18చిత్రాలు రిలీజ్- 20సినిమాల్లో పోలీస్​గా విజయ్​కాంత్​- అది తెలిస్తే నో రెమ్యునరేషన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.