మరోసారి 'నో ఎంట్రీ' అంటున్న సల్మాన్​.. వెబ్​సిరీస్​గా గాంధీ పోరాటం

author img

By

Published : May 21, 2022, 9:30 AM IST

d

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. బాలీవుడ్​ సూపర్​స్టార్​ సల్మాన్​ ఖాన్​ 'నో ఎంట్రీ' సీక్వెల్​తో మరోసారి కడుపుబ్బా నవ్వించనున్నారు. మరోవైపు బాలీవుడ్​ క్లాసిక్​గా నిలిచిన 'ఆనంద్​'ను రీమేక్​ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు. ఇంకా బాలీవుడ్​ కబుర్లు ఏమున్నాయంటే..

సల్మాన్‌ఖాన్‌, దర్శకుడు అనీస్‌ బాజ్మీ కలయికలో 2005లో వచ్చిన చిత్రం 'నో ఎంట్రీ'. హాస్య ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీనికి సీక్వెల్‌ ఉంటుందని చాలా రోజులుగా ప్రచారమవుతోంది. తాజాగా దర్శకుడు అనీస్‌ ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించాడు. 'నో ఎంట్రీ మై ఎంట్రీ' టైటిల్‌తో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. మొదటి భాగం కంటే ఇందులో రెట్టింపు హాస్యముంటుందని వెల్లడించాడు. సల్మాన్‌ఖాన్‌ ఫిల్మ్స్‌, జీ స్టూడియోస్‌తో కలిసి బోనీకపూర్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'నో ఎంట్రీ'లో భాగమైన అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్‌ సీక్వెల్‌లోనూ కనిపిస్తారు. అనీస్‌ తెరకెక్కించిన తాజా చిత్రం 'భూల్‌ భులైయా 2' ప్రేక్షకులను అలరిస్తోంది.

సిద్ధమవుతున్న 'ఆనంద్‌' రీమేక్‌.. రాజేశ్‌ ఖన్నా, అమితాబ్‌ బచ్చన్‌ నటించిన క్లాసిక్‌ ఎమోషనల్‌ డ్రామా 'ఆనంద్‌'. 1971లో విడుదలైన ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. 'ఆనంద్‌' నిర్మాత ఎన్‌.సి సిప్పీ మనవడు సమీర్‌ రాజ్‌ సిప్పీ, విక్రమ్‌ ఖాఖర్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. "కొత్త కథల కోసం ఎదురుచూడడం కన్నా ఇప్పటికే వచ్చిన క్లాసిక్స్‌ నుంచి కథలు ఎంపిక చేసుకోవాలనుకున్నాం. అందులో భాగంగానే 'ఆనంద్‌'ను ఎంచుకున్నాం. ఈ తరానికి ఇలాంటి కథ గురించి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నామని" అన్నారు. మాతృకలో క్యాన్సర్‌తో బాధపడుతూ జీవిత చివరి అంచుల్లో ఉన్న 'ఆనంద్‌' అనే వ్యక్తిగా రాజేశ్‌ ఖన్నా నటించారు. అతడికి వైద్యునిగా అమితాబ్‌ కనిపిస్తారు. ఈ నేపథ్యంలో తన చివరి రోజుల్లో ఆనంద్‌ ఎలా గడిపాడు. తను జీవితానికి ఇచ్చిన నిర్వచనం ఏమిటన్నది కథ. ఈ రీమేక్‌కు దర్శకుడు, ఇతర నటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు.

.

వెబ్‌సిరీస్‌గా గాంధీ పోరాటం.. భారత స్వాతంత్య్ర సంగ్రామ సారధి, జాతిపిత మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ జీవిత చరిత్ర వెబ్‌ సిరీస్‌ రూపంలో తెరకెక్కనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ మేరకు ప్రకటన చేసింది. 'స్కామ్‌ 1992' ఫేం ప్రతీక్‌ గాంధీ ఇందులో టైటిల్‌ పాత్రలో కనిపిస్తాడు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గాంధీ కోణం నుంచి తెరకెక్కించడమే ఈ సిరీస్‌ ప్రధాన ఉద్దేశమని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రఖ్యాత చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన 'గాంధీ బిఫోర్‌ ఇండియా', 'గాంధీ - ద ఇయర్స్‌ దట్‌ ఛేంజ్‌డ్‌ ది వరల్డ్‌' పుస్తకాలను ఆధారం చేసుకుని సిరీస్‌ ఉంటుందని వివరించింది. గాంధీ దక్షిణాఫ్రికాకు వెళ్లడం దగ్గర నుంచి మహాత్ముడిగా మారడం తదనంతర పరిణామాలను చూపించనున్నారని తెలుస్తోంది. దేశ విదేశాల్లోని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అత్యున్నత నిర్మాణ విలువలతో సిరీస్‌ను రూపొందిస్తామని అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వెల్లడించింది.

.

ఇదీ చూడండి : కేన్స్​లో దేవకన్య.. మతిపోగొట్టేస్తున్న బ్రెజిల్ మోడల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.