ETV Bharat / entertainment

పాన్ ​ఇండియా పోరు తెలుగు సినిమా జోరు.. ఈ ఏడాది అదరగొట్టిన చిత్రాలివే!

author img

By

Published : Dec 19, 2022, 6:57 AM IST

ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ప్రతి భాషలోనూ పాన్‌ ఇండియా చిత్రాలు రెడీ అవుతున్నాయి. అందులో ఎక్కువగా తెలుగు చిత్రాల ఆధిపత్యమే బలంగా కనిపిస్తోంది. మరి ఈ ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో మెరిసిన ఆ తెలుగు చిత్రాలేవి? వాటి విశేషాలేంటి?

pan india telugu movies
పాన్‌ ఇండియా

ఇప్పుడంతా పాన్‌ ఇండియా ట్రెండ్‌ నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ప్రతి భాషలోనూ పదుల సంఖ్యలో పాన్‌ ఇండియా చిత్రాలు ముస్తాబవుతున్నాయి. పరిమిత వ్యయంతో రూపొందుతోన్న సినిమాలు సైతం.. పాన్‌ ఇండియా హంగులు అద్దుకొని దేశవ్యాప్తంగా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో అగ్ర కథానాయకుల జోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఈ ఏడాది ఇటు దక్షిణాది అటు ఉత్తరాది నుంచి దాదాపు పాతిక వరకు పాన్‌ ఇండియా చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అయితే ఈ రేసులో తెలుగు చిత్రాల ఆధిపత్యమే బలంగా కనిపించింది. 2022లో తెలుగు నుంచి అరడజను వరకు పాన్‌ ఇండియా సినిమాలు విడుదల కాగా.. వాటిలో ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ బాక్సాఫీస్‌ ముందు మెరిశాయి. భారీ వసూళ్లు రాబట్టి సత్తా చాటాయి. మరి ఈ ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో మెరిసిన ఆ తెలుగు చిత్రాలేవి? వాటి విశేషాలేంటి?

'బాహుబలి', 'పుష్ప' చిత్రాలు తెలుగు చిత్రసీమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందించాయి. ఆ స్ఫూర్తితోనే పాన్‌ ఇండియా స్థాయిలో పవర్‌ చూపించేందుకు పలువురు తెలుగు కథానాయకులంతా ప్రయత్నాలు ప్రారంభించేశారు. కొవిడ్‌ పరిస్థితుల వల్ల గత రెండేళ్ల కాలంలో పాన్‌ ఇండియా చిత్రాలు అంతగా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కానీ, ఈ ఏడాది ఆ భయాలు తొలగిపోవడంతో రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చిన పాన్‌ ఇండియా బొమ్మలన్నీ బాక్సాఫీస్‌ ముందుకు వరుస కట్టేశాయి. అలా ఈ ఏడాది తెలుగు నుంచి మొదటగా సినీ ప్రియుల్ని పలకరించింది 'రాధేశ్యామ్‌'. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ తెరకెక్కించారు. దాదాపు రూ.300కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ముందు చేదు ఫలితాన్నే అందుకుంది.

rrr
ఆర్​ఆర్​ఆర్​
radhesyam
రాధేశ్యామ్​

'బాహుబలి' సిరీస్‌ సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ ఏడాది 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో భారతీయ చిత్రసీమకు మరో సంచలన విజయాన్ని అందించారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటించిన చిత్రమిది. స్వాతంత్య్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కల్పిత కథాంశంతో రూపొందింది. దాదాపు రూ.550కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా రూ.1,200కోట్ల వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్‌ వర్గాలు లెక్కలు వేశాయి. ప్రస్తుతం ఇది అంతర్జాతీయ వేదికలపై ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను దక్కించుకుంటూ సత్తా చాటుతోంది.

mejor
మేజర్​

థ్రిల్లర్‌ కథలతో వరుస విజయాలు అందుకుంటూ తెలుగు సినీప్రియుల్లో ప్రత్యేక ఆదరణ దక్కించుకున్నారు కథానాయకుడు అడివి శేష్‌. 'మేజర్‌'తో జాతీయ స్థాయిలో రాణించారు. ఇది శేష్‌కు తొలి పాన్‌ ఇండియా చిత్రం. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీర మరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత కథతో రూపొందింది. శశికిరణ్‌ తిక్కా తెరకెక్కించారు. దాదాపు రూ.32కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ దేశభక్తి చిత్రం.. రూ.70కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి.

liger
లైగర్​

తెలుగు సినిమా 'అర్జున్‌ రెడ్డి'తోనే దేశవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకున్నారు కథానాయకుడు విజయ్‌ దేవరకొండ. ఆయన ఈసారి తొలి ప్రయత్నంగా 'లైగర్‌'తో పాన్‌ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకున్నారు. మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ఈ యాక్షన్‌ చిత్రానికి చేదు ఫలితమే దక్కింది.

yashoda
యశోద

'ది ఫ్యామిలీమ్యాన్‌2'తో దేశవ్యాప్తంగా ఆదరణ దక్కించుకున్న సమంత 'యశోద'తో వెండితెర వేదికగా పాన్‌ ఇండియా స్థాయిలో అదృష్టం పరీక్షించుకుంది. హరి-హరీష్‌ సంయుక్తంగా తెరకెక్కించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. నవంబరులో బాక్సాఫీస్‌ ముందుకొచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే వసూళ్లు దక్కాయి.

karthikeya2
కార్తికేయ

చిన్న చిత్రంగా విడుదలై.. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న తెలుగు సినిమా 'కార్తికేయ2'. ఈ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు యువ కథానాయకుడు నిఖిల్‌. 'కార్తికేయ'కు కొనసాగింపుగా చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా రూ.15కోట్లతో నిర్మితమై ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడీ మిస్టరీ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌కు కొనసాగింపుగా 'కార్తికేయ3' రానుంది.

seetharamam
సీతారామం

'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అంటూ 'సీతారామం'తో దేశవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు హను రాఘవపూడి. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రమిది. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఆగస్టులో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన ఈ సినిమా.. ఆ తర్వాత హిందీలోనూ విడుదలై అక్కడా మంచి ఆదరణ దక్కించుకుంది. రూ.30కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ మీడియం రేంజ్‌ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.104కోట్ల వసూళ్లు రాబట్టి సత్తా చాటింది.

ఇవీ చదవండి: ఫిఫా వరల్డ్​ కప్​లో మెరవనున్న దీపికా పదుకొణె ఏం చేయబోతోందో తెలుసా

కంగనా రనౌత్​కు ఝలక్.. పార్లమెంటులో 'ఎమర్జెన్సీ' షూటింగ్​కు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.