ETV Bharat / entertainment

తొలిసారి గిరిజన మహిళకు జాతీయ అవార్డు.. ఒక్క పాటతోనే రికార్డు.. ఎవరామె?

author img

By

Published : Jul 23, 2022, 6:05 PM IST

గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది! వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన 62ఏళ్ల నాంజియమ్మ ఈ భావన తప్పని నిరూపించింది. తాజాగా ప్రకటించిన 68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో పురస్కారాన్ని దక్కించుకుని.. దేశమంతటా తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ప్లే బ్యాక్​ సింగింగ్​లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా నిలిచింది. ఆమె గురించే ఈ కథనం..

Nanjiyamma జాతీయ అవార్డు
నాంజియమ్మ జాతీయ అవార్డు

అప్పటివరకు ఆమె ఓ సాధరణ గిరిజన మహిళ. ఎక్కడో ఓ మాలుమూల గిరిజన గ్రామంలో పుట్టింది. ఎవరికీ అంతగా పరిచయం లేని ఓ జానపద కళాకారిని. పశువులు, గొర్రెలను మేపడమే ఆమె ప్రపంచం. కానీ... సినిమా ప్రపంచం అంటే అంతగా అవగాహన లేని ఆమెకు.. ఒకే ఒక్క పాట తన జీవితాన్నే మార్చేసింది. స్టార్​డమ్​ను తీసుకొచ్చింది. అందరూ ఆమెను మెచ్చుకునేలా చేసింది. తనే నాంజియమ్మ. తన గురించే ఈ కథనం...

2020లో మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్​ కోషియుమ్​​' సినిమా సూపర్​హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్​, బీజుమేనన్​ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో నాంజియమ్మ స్వయంగా రాసి పాడిన పాట 'కలకాత్తా'కు జాతీయ అవార్డు దక్కింది. తాజాగా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఆమెకు కూడా పురస్కారం వరించింది. ప్లే బ్యాక్​ సింగింగ్​లో జాతీయ అవార్డు అందుకున్న తొలి గిరిజన మహిళగా పేరు గాంచింది.

నాంజియమ్మది కేరళ పాలక్కడ్‌ జిల్లాలోని అట్టప్పడి అనే గిరిజన ప్రాంతం. 15ఏళ్లకే పెళ్లి చేసుకుంది. ఆమె భర్త తనను ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. గిరిజన తెగకు చెందిన ఈమె.. జానపద కళాకారిని. చెట్టు, గట్టు, పుట్ట, పశువులను చూస్తూనే అలవోకగా జానపద పాటలు పాడుతుంది. పలు ప్రోగ్రామ్​లో పాడుతుంటుంది. గిరిజన కళాకారుల సంఘం ఆట కళాసంఘం, ఆజాద్‌ కళా సమితిలో ఆమె సభ్యురాలు కూడా. పళని స్వామి ఆజాద్‌ కళా సమితి వ్యవస్థాపకుడు. ఈయన ద్వారానే నాంజియమ్మ గురించి తెలుసుకున్న అయ్యప్పనుమ్​ కోషియుమ్​​ దర్శకుడు సచీ.. గీతం పాడేందుకు ఆమెకు ఒక అవకాశం ఇచ్చాడు. అయ్యప్పనుమ్​ కోషియుమ్​ సినిమా చిత్రీకరణ కూడా అక్కడే జరిగింది. 2020లో విడుదలై ఈ మూవీ మాలీవుడ్​లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి దర్శకుడు, రచయిత సచీ. దురదృష్టవశాత్తు.. ఇది ఆయనకు రెండోది, చివరిది కూడా. ప్రస్తుతం ఆయన లేరు.

అవార్డును ఆయనకు అంకితమిస్తూ.. "నా కొడుకు ఫోన్​ చేశాడు. ఓ సారి టీవీ చూడు అన్నాడు. అవార్డు వచ్చిందని చెప్పాడు. అదేంటో, దాని గొప్పతనం కూడా సరిగ్గా తెలియదు. కానీ అతడి మాటలు సంతోషాన్ని ఇచ్చాయి. ఈ పురస్కారాన్ని నేను సచీ సార్​కు అంకితం చేస్తున్నాను. నేను కొండలపై గొర్రెల, ఆవులను మేపుతుంటాను. ఆయన నా గురించి తెలుసుకుని, నా చేత పాట పాడించారు. నేను, నా పాటను అందరికీ తెలిసేలా చేశారు. ఆయనకు ధన్యవాదాలు." అని చెప్పింది.

ఇదీ చూడండి: నటితో రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయిన హీరో.. రోడ్డుపైనే భార్య రచ్చ రంబోలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.