రూ. 100 కోట్ల ఛాన్స్‌.. మోహన్‌లాల్‌, వెంకటేశ్‌ మిస్సయ్యారా?

author img

By

Published : Nov 22, 2022, 6:23 AM IST

Drishyam 2 Movie Collections

అగ్ర కథానాయకులు మోహన్‌లాల్‌, వెంకటేశ్‌లు కోల్పోయిన ఛాన్స్‌ను అజయ్‌ దేవగణ్‌ పట్టేశారు. ఇంతకీ ఏంటా ఛాన్స్‌ అనుకుంటున్నారా?

Drishyam 2 Movie Collections: అగ్ర కథానాయకులు మోహన్‌లాల్‌, వెంకటేశ్‌లు మంచి ఛాన్స్‌ మిస్సయ్యారు. బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తీసి కూడా పరిస్థితులు అనుకూలించక కాలానికి అనుగుణంగా నడుచుకోవాల్సి వచ్చింది. కానీ, అజయ్‌ దేవగణ్‌ను అదృష్టం వరించింది. లాల్‌, వెంకీలు కోల్పోయిన మంచి ఛాన్స్‌ను అజయ్‌ దేవగణ్‌ పట్టేశారు. ఇంతకీ ఏంటా ఛాన్స్‌ అనుకుంటున్నారా?

'దృశ్యం'.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని సినిమా. ఈ మలయాళ బ్లాక్‌బస్టర్‌ చిత్రం పలు భాషల్లో రీమేక్‌ అయింది. దానికి కొనసాగింపుగా గతేడాది 'దృశ్యం2' వచ్చింది. కరోనా కారణంగా మోహన్‌లాల్‌ నటించిన మలయాళ మూవీని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. అయితే, ఇతర భాషల్లో రీమేక్‌ హక్కులు విక్రయమవడంతో కేవలం మలయాళంలో మాత్రమే అందుబాటులో ఉంచారు. ఆ తర్వాత అదే సినిమాను తెలుగులో వెంకటేశ్‌ కీలక పాత్రలో రూపొందించారు మాతృకను తెరకెక్కించిన జీతూ జోసెఫ్‌.

ఈ మూవీని థియేటర్‌లో తీసుకొచ్చేందుకు శత విధాల ప్రయత్నించారు. కరోనా ఉద్ధృతి పూర్తిగా తగ్గని పరిస్థితుల్లో ఓటీటీ బాట పట్టించారు. ఇప్పుడు ఇదే చిత్రం అజయ్‌ దేవగణ్‌కీలక పాత్రలో హిందీలో రీమేక్‌ అయి, ఇటీవల థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేసి అభిషేక్‌ పాఠక్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అజయ్‌తో పాటు, అక్షయ్‌ ఖన్నా, టబు, శ్రియాలు కీలక పాత్రలు పోషించారు.

దృశ్యం 2

విడుదలైన రోజు నుంచే మంచి టాక్‌తో హిందీ 'దృశ్యం2' మంచి వసూళ్లు రాబడుతోంది. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకూ రూ.64 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తెలిపారు. ప్రస్తుతం హిందీలో అద్భుత చిత్రాలేమీ లేవు. 'కాంతార' ట్రెండ్‌ నెమ్మదిగా తగ్గుతోంది. దీంతో 'దృశ్యం2'ను హిందీ ప్రేక్షకులు ఆస్వాదిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో రూ.100కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయం.

ఇలా థియేటర్‌లో వసూళ్ల వర్షం కురిసే అవకాశాన్ని మోహన్‌లాల్‌, వెంకటేశ్‌లు కోల్పోయారు. వాళ్ల సినిమాలు కూడా థియేటర్‌లో విడుదలై ఉంటే, నిర్మాతలకు లాభాల పంట పండేది. అయితే, ఆ రెండు చిత్రాల నిర్మాణానికి అయిన వ్యయంతో పోలిస్తే, ఓటీటీలో మంచి ధరకే విక్రయిమైనట్లు అప్పట్లో ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. అయినా కూడా, ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూస్తే వచ్చే మజానే వేరు కదా! అన్నట్లు 'దృశ్యం3' ఉంటుందని జీతూ జెసెఫ్‌ గతంలోనే చెప్పారు. మరి తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం రాంబాబు ఏం చేస్తాడో చూద్దాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.