ఆ సినిమా బడ్జెట్​ రూ.6 కోట్లు.. వసూళ్లు రూ.40 కోట్లు.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

author img

By

Published : Nov 20, 2022, 6:35 AM IST

Jaya Jaya Jaya Jaya Hey

బసిల్‌ జోసెఫ్‌, దర్శన రాజేంద్రన్‌ జంటగా నటించిన 'జయ జయ జయ జయహే' రూ.6కోట్లతో తీస్తే, రూ.40 కోట్లు వసూలు చేసింది. మరి ఈ చిత్రం ఏ ఓటీటీలో వస్తోందో తెలుసా?

Jaya Jaya Jaya Jaya Hey: ఇటీవల కాలంలో కంటెంట్‌ ఉన్న సినిమాలకే థియేటర్‌లో ప్రేక్షకులు పట్టం గడుతున్నారు. స్టార్లు లేకపోయినా, మంచి కథ, కథనాలతో, రెండున్నర గంటల పాటు వినోదాన్ని పంచితే ఉంటే చాలు. ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ ఏడాది అలా విడుదలైన 'కార్తికేయ2', 'కాంతార' వంటి చిత్రాలు కలెక్షన్లతో అదరగొట్టాయి. వాటి బడ్జెట్‌తో పోలిస్తే, ఎన్నో రెట్లు వసూళ్లతో బాక్సాఫీస్‌ దుమ్ము దులిపాయి. ఈ కోవలోకే వస్తుంది మలయాళ చిత్రం 'జయ జయ జయ జయహే'.

కేవలం రూ.6కోట్లతో సినిమా తీస్తే, ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడా సినిమా రూ.40కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. సినిమా బడ్జెట్‌కు దాదాపు పదిరెట్లు నిర్మాతకు లాభాల పంట పండించింది. కంటెంట్‌ ఉన్న చిత్రాలను ఏ భాషా ప్రేక్షకుడైనా ఆదరిస్తాడని చెప్పటానికి ఇది మరో నిదర్శనం. బసిల్‌ జోసెఫ్‌, దర్శన రాజేంద్రన్‌ జంటగా నటించిన ఈ మూవీ అక్టోబరు 28న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ఐదారు కోట్లతోనే బడ్జెట్‌ దర్శకుడు విపిన్‌ దాస్‌ ఈ సినిమాను తెరకెక్కించారు.

జయ జయ జయహే

ఇంతకీ ఈ సినిమా కథేంటి?
జయభారతి(దర్శన రాజేంద్రన్‌) స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. తనని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని షరతులు పెడుతుంది. పెళ్లయిన తర్వాత కూడా చదువుతూ ఉద్యోగం చేయాలన్నది ఆమె ఆశయం. అందుకు రాజేశ్‌ (బసిల్‌ జోసెఫ్‌) కూడా అంగీకరిస్తాడు. కానీ, పెళ్లయిన తర్వాత అతడిలోని పురుషాహంకారం మేల్కొంటుంది. పైగా చిన్న చిన్నవాటికి కోపం వచ్చేస్తుంది. ప్రతి విషయంలోనూ అతడిదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. చీటిమాటికి జయపై చేయి చేసుకుంటాడు. ఇదే విషయాన్ని జయ తన తల్లిదండ్రులతో చెబితే 'సర్దుకుపో అమ్మా' అని సముదాయించే ప్రయత్నం చేస్తారు. కానీ, అతడి నుంచి విడిపోవాలని జయ భారతి నిర్ణయం తీసుకుంటుంది.

ఆ నిర్ణయం ఇరువురి బంధంపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? తదితర సన్నివేశాలతో సినిమా సాగుతుంది. ఇలాంటి కథతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా, విపిన్‌ దాస్‌ దీన్నొక న్యూఏజ్‌ డ్రామాగా తీర్చిదిద్దారు.జయ, రాజేశ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి. అవే సినిమాను విజయ పథంలో నడిపాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీశారు.

ఏ ఓటీటీలో వస్తోంది?
'జయ జయ జయ జయహే' డిజిటల్ రైట్స్‌ను డిస్నీ+హాట్‌స్టార్‌ సొంతం చేసుకుంది. త్వరలోనే స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే, ఈ మూవీ తెలుగు భాషలోనూ అందుబాటులో ఉంటుందా? లేదా? అన్నది మాత్రం నిర్మాతలు చెప్పడం లేదు. మలయాళంలో ప్రేక్షకులు ఆదరించిన నేపథ్యంలో ఈసినిమా రైట్స్‌ ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. ఓటీటీలో కన్నా ముందే తెలుగులో డబ్బింగ్‌ చేసి, మూవీని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.