ETV Bharat / entertainment

'బింబిసార' టు 'విరూపాక్ష'.. అంతా పీరియాడికల్​ మయం!

author img

By

Published : Apr 27, 2023, 7:22 AM IST

Etv Bharat
Etv Bharat

కథలు వర్తమానంలో ఆగడం లేదు. సరికొత్త నేపథ్యాల్ని ఆవిష్కరించే క్రమంలో ముందుకూ... వెనక్కీ వెళుతున్నాయి. టైమ్‌ మిషన్‌లో ఎక్కి ఆ కాలం నుంచి ఈ కాలానికి ప్రయాణం చేస్తున్న అనుభూతిని ప్రేక్షకులకు పంచుతున్నాయి. భవిష్యత్తుని ఆవిష్కరించే కథలు అప్పుడప్పుడే వస్తున్నా... గతంలోకి తీసుకెళ్లే కథలు మాత్రం తరచూ వస్తున్నాయి. చరిత్ర, జీవిత కథ, జానపద, పురాణ, ఫాంటసీ... ఇలా పలు నేపథ్యాలతో ఆ కథలు తెరకెక్కుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఎప్పుడూ లేని రీతిలో రెండు మూడేళ్లుగా ఈ కథల జోరు ఎక్కువగా కనిపిస్తోంది.

టాప్​ హీరోల సినిమాలే కాదు .. చిన్న బడ్జెట్​తో తెరకెక్కుతున్న సినిమాలు కూడా ఇప్పుడు పీరియాడిక్​ మంత్రాన్ని జపిస్తున్నాయి. గతంలోని కథల్ని ప్రేక్షకుల కోసం తెరపైకి తీసుకొస్తున్నాయి. ఆడియన్స్​కు నాస్టాల్జియా అనే ఓ అనుభూతిని పంచుతున్నాయి. ఇంతకీ పీరియాడిక్‌ సినిమా అంటే.. ఆ కథ నడిచే కాలాన్ని ప్రతిబింబించేలా ఓ ప్రత్యేకమైన వాతావరణాన్ని సృష్టించడమే. ఇప్పటి వరకు దాన్ని ఓ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అంటూ చాలా మంది దర్శక నిర్మాతలు ఈ విషయానికి దూరంగా ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది.

టెక్నాలజీని ఆసరాగా తీసుకుని.. డబ్బు, సమయం కాస్త ఎక్కువే ఖర్చైనా కూడా అనుకున్న కథని తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులకూ ఓ కొత్త రకమైన కథల్ని అందించే అవకాశం దక్కుతోందటం వల్ల స్టార్స్​ కూడా ఇటువంటి సినిమాల్లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో పీరియాడిక్‌ కథల జోరు ఉధృతంగా సాగుతోంది. కొవిడ్​ తర్వాత ఇవి మరింతగా పెరిగాయి.

  • 'ఆర్‌.ఆర్‌.ఆర్‌', 'పుష్ప' నుంచి ఇటీవలే విడుదలైన 'విరూపాక్ష' వరకూ పదుల సంఖ్యలో పీరియాడిక్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో బాక్సాఫీస్​ వద్ద విజయాన్ని అందుకున్నవే ఎక్కువ. గడిచిన కాలంలోని కథలే అయినప్పటికీ.. ఒకొక్క సినిమా ఒక్కో నేపథ్యాన్ని ఆవిష్కరించింది. టాలీవుడ్​లోనే కాదు.. ఇతర భాషల నుంచి వచ్చిన పలు సినిమాలు కూడా ఇదే కోవకు చెందినవి . 'కేజీఎఫ్‌', 'కాంతార', 'పొన్నియిన్‌ సెల్వన్‌' తదితర సినిమాలన్నీ అందులో భాగమే.
  • ఇక తెలుగులో 'బింబిసార', 'శ్యామ్‌ సింగరాయ్‌', 'దసరా', 'ఒకే ఒక జీవితం', 'సీతారామం', 'సార్‌', 'మేజర్‌' అన్నీ పీరియాడికల్​ సినిమాలే. ఇలా రిలీజైన చిత్రాలు విజయవంతంగా ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఇవే కాదు.. ఇప్పుడు చిత్రీకరణ దశలో ఉన్నవీ.. త్వరలో సెట్స్‌పైకి వెళుతున్న వాటిలోనూ కొన్ని పీరియాడిక్‌ కథలు ఉండటం గమనార్హం.
  • పవర్​ స్టార్ పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతున్న కథ ఇది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా 'డెవిల్‌' తెరకెక్కుతోంది. ఇది కూడా బ్రిటిష్‌ కాలం నాటి కథ ఇది. పీరియాడిక్‌ సినిమాలంటే శతాబ్దాల కిందటి కథలే కాదు.. రెండు మూడు దశాబ్దాల వెనకటి కాలాన్ని ప్రతిబింబించేవీ కూడా ఈ కోవలోకే చేరతాయి. 'రంగస్థలం' తర్వాత రామ్‌చరణ్‌... మరోసారి అలాంటి పీరియాడిక్‌ కథలో నటించనున్నారు. బుచ్చిబాబు సానా ఆ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథతో ఆ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం.
  • పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ ఇప్పటికే 'ప్రాజెక్ట్‌ కె' సినిమా షూటింగ్​లో ఉన్నారు. వరుస ఆఫర్లలో బిజీగా ఉన్న ఈ స్టార్​ .. మరికొన్ని పీరియాడిక్‌ కథల్లో నటించనున్నట్టు సమాచారం.
  • బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా కొన్ని దశాబ్దాల కిందటి కథతోనే తెరకెక్కుతున్నట్టు సమాచారం.
  • ఇక కింగ్​ నాగార్జున కూడా ఈసారి పీరియాడిక్‌ కథతోనే అభిమానుల ముందుకు రానున్నారని టాక్​. బెజవాడ ప్రసన్నకుమార్‌ దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది.
  • విరించి వర్మ, కృష్ణచైతన్య లాంటి యువ దర్శకులు కూడా ప్రస్తుతం ఈ జానర్​లోనే సినిమాలు తీస్తున్నారట. దిల్‌రాజు సంస్థలో కొన్ని ఆ తరహా కథలు ముస్తాబవుతున్నట్టు సమాచారం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.