ETV Bharat / entertainment

F3 movie:  ''పాల బేబీ' పాత్రలో నటించా.. ఆ గన్​ మోయలేకపోయా'

author img

By

Published : May 19, 2022, 6:37 AM IST

Ali
ఆలీ

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన 'ఎఫ్‌3'లో ఓ కీలక పాత్ర పోషించారు హాస్య నటుడు అలీ. ఈ నెల 27న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు అలీ.

'కథ విని... పాత్ర బాగుందనిపిస్తేనే సినిమా చేస్తున్నా' అని చెప్పారు హాస్య నటుడు అలీ. హాస్య నటులకి పెట్టింది పేరైన తెలుగు చిత్రసీమలో అలీది ఓ ప్రత్యేకమైన అధ్యాయం. 43 ఏళ్లుగా ఆయన నట ప్రయాణం కొనసాగుతోంది. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా తెరకెక్కిన 'ఎఫ్‌3'లో ఓ కీలక పాత్ర పోషించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం అలీ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

''కుటుంబ కథలు అరుదుగా తెరకెక్కుతున్నాయి. అందులోనూ పదుల సంఖ్యలో నటులతో సినిమాలు తీసే దర్శకులు తక్కువైపోయారు. అనిల్‌ రావిపూడి మాత్రం కె.రాఘవేంద్రరావు, ఈవీవీ సత్యనారాయణ, దాసరి నారాయణరావుల్ని గుర్తు చేస్తున్నారు. 'ఎఫ్‌3' సినిమా పతాక సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో సెట్లో 30కిపైగా కార్‌వ్యాన్లు కనిపించాయి. ఒకప్పటిలా సందడి వాతావరణం కనిపించింది. అంత మంది నటులున్నా... ఏమాత్రం బెరుకు లేకుండా చిత్రీకరణ చేస్తుంటాడు అనిల్‌. ఇందులో ఒకరిని మించి ఒకరు నటించారు. మళ్లీ మళ్లీ థియేటర్‌కి వస్తారు ప్రేక్షకులు. అంతగా పాత్రలు వినోదం పంచుతాయి''.

''ఇందులో పాల బేబీ అనే పాత్రని నేను పోషించా. డబ్బుని వడ్డీకి తిప్పుతుంటాడు పాల బేబీ. ఆడవాళ్లంటే అపారమైన గౌరవం. సినిమా మొత్తం 45 నిమిషాలపాటు నా పాత్ర కనిపిస్తుంది. పాల బేబీ గన్‌ ఎందుకు పట్టుకున్నాడనేది తెరపైనే చూడాలి. ఆ గన్‌ మోయలేకపోయా. చిత్రీకరణ పూర్తయ్యాక కొన్ని రోజుల వరకూ చేతుల్లో నొప్పి తగ్గలేదు. అంత బరువైన పాత్ర చేశానన్నమాట (నవ్వుతూ)''.

''ఈమధ్య కాలంలో కొన్ని చిన్న సినిమాల్లో మాకు పాత్రలు ఇస్తున్నారు. కథేమిటో చెప్పరు. తీరా సినిమా చూస్తున్నప్పుడు 'అలీ ఇందులో ఎందుకు నటించాడు?' అనుకునేలా ఉంటాయి. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని చేయడం లేదు. కథ నచ్చితేనే చేస్తాను. ఎస్వీ కృష్ణారెడ్డి కోసం చేస్తున్నదే 'యమలీల' సీరియల్‌. స్టార్‌ దర్శకుడిగా ఉన్న సమయంలో ఆయన నన్ను హీరోగా చేశారు. ఆయన చెప్పారంటే వెనకా ముందూ ఆలోచించకుండా చేస్తాను. ఇప్పుడు తెలుగుతోపాటు ఎక్కడెక్కడి నుంచో అవకాశాలు వస్తున్నాయి. ఈమధ్య నేపాలీ సినిమాకి సంతకం చేశా. ఒకప్పుడు ఉత్తరాదికి వెళ్లి వాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి నటన, భాష నేర్పించి మరీ డబ్బు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఉత్తరాది పరిశ్రమకి మన సత్తా ఏమిటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. ఇప్పుడు మేం ఇండియన్‌ స్టార్స్‌గా మారాం''.

''నన్ను రాజకీయ నాయకుడిగా మార్చింది ఆంధ్రప్రదేశ్‌ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన నాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారంతే. ఏదో ఒక రోజు ఆయన్నుంచి కాల్‌ వస్తే వెళ్తా. ప్రస్తుతానికి తెలుగుతోపాటు, కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తున్నా. 'అంటే... సుందరానికి!', 'లైగర్‌', 'ఖుషీ', 'ఒకే ఒక జీవితం' తదితర చిత్రాలు చేశా. ఇవన్నీ వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి''.

ఇదీ చదవండి: Cannes Film festival: 'బ్రాండ్​ ఇమేజ్​తో కాదు.. ఇండియన్ బ్రాండ్​తో వచ్చా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.