అలనాటి అందాల తార ఆశాపరేఖ్‌కు 'దాదాసాహెబ్‌ ఫాల్కే'

author img

By

Published : Sep 28, 2022, 6:59 AM IST

Updated : Sep 28, 2022, 7:19 AM IST

asha parekh dadasaheb phalke award

Asha Parekh Dadasaheb Phalke Award : ఆమె యువతరాన్ని ఉర్రూతలూగించిన నిలువెత్తు అందం. ఆమె నటించడమే సినిమా అదృష్టం. ఆమె కాల్షీట్లు దొరికితే ఉప్పొంగిపోయేది దర్శకనిర్మాతల మది. ఆమె ఒప్పుకున్నాకే హీరో ఎవరో తేలేది. ఆమె బ్రాండ్‌ మీదే అప్పట్లో సినిమా అమ్ముడయ్యేది. ఆమె సిల్వర్‌జూబ్లీ సినిమాలకు చిరునామా. ఆమె బాక్సాఫీసుకు కాసులు కురిపించే ఓ ధీమా. ఆమే ఆశాపరేఖ్‌. ఆమె పేరు చెప్పగానే 1960-70ల్లో ఈ స్థాయి పొగడ్తలు, ప్రశంసలే.. ఆమె ఇంటి నిండా ఎటు చూసినా అవార్డులు.. రివార్డులే. తాజాగా ఆమె కీర్తికిరీటంలో 'దాదాసాహెబ్‌ ఫాల్కే' రూపంలో మరో విలువైన రత్నం వచ్చి చేరింది. సినీ ప్రేమికులకు.. ఆమె అభిమానులకు ఆనందాన్ని పంచింది..

Asha Parekh Dadasaheb Phalke Award : హిందీ చిత్రసీమలో అగ్రతారగా ఎదిగి భారతీయ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆశాపరేఖ్‌.. 1942 అక్టోబరు 2న జన్మించారు. తండ్రి బచ్చూభాయ్‌ పరేఖ్‌ గుజరాతీ జైన్‌ వ్యాపారి. తల్లి సల్మా ముస్లిం. పెళ్లయ్యాక ఆమె మతం మార్చుకొని సుధగా మారారు. ఆశ తల్లికి తన కూతురు సినిమాల్లో రాణించాలని కోరిక. చిన్నప్పుడే సంప్రదాయ నృత్యం నేర్పించారు. ప్రఖ్యాత గురువు బన్సీలాల్‌ భారతీ వద్ద శిక్షణ ఇప్పించారు. పదేళ్ల ప్రాయంలో ఆశ బాలనటిగా సినిమాల్లోకి వచ్చారు.

పదహారేళ్లప్పుడు హీరోయిన్‌గా ప్రయత్నాలు మొదలు పెట్టారు. 'గూంజ్‌ ఉఠీ శహ్‌నాయీ'లో ఎంపిక చేసినట్టే చేసి.. చివరి నిమిషంలో దర్శకుడు విజయ్‌భట్‌ ఆమెను తొలగించారు. అందుకు ఆయన చెప్పిన కారణం.. అందంగా లేదనీ, నటి లక్షణాలు ఏమాత్రం లేవని. అలా తిరస్కారానికి గురైన ఎనిమిదో రోజునే దర్శకుడు నాసిర్‌ హుస్సేన్‌ నుంచి ఆమెకు పిలుపొచ్చింది. 'దిల్‌ దేకే దేఖో'తో ఏకంగా అగ్ర నటుడు షమ్మీ కపూర్‌ సరసన అవకాశం చేజిక్కించుకుంది. హీరోయిన్‌గా తను నటించిన మొదటి చిత్రమే పెద్ద హిట్‌.

"మా అమ్మే నాకు అన్నీ. ప్రతి విషయంలోనూ తనే నాకు వెన్నుదన్నుగా ఉండేది. ఏ రోజు నేను ఓ స్టార్‌ అనే దృష్టితో నన్ను చూడలేదు. ప్రేక్షకుల నుంచి ఎంత గొప్ప ప్రశంసలు వచ్చిన పాత్రకైనా సరే తను మాత్రం 'ఓకే' అనేది అంతే. ఆ కారణంతోనే ఏనాడు నేను సూపర్‌ స్టార్‌గా ప్రవర్తించ లేదు"

-- ఆశాపరేఖ్‌

ఆ తర్వాత 'జబ్‌ ప్యార్‌ కిసీ సే హోతా హై', 'ఘరానా', 'ఫిర్‌ వహీ దిల్‌ లాయా హూ', 'బహారోంకే సప్నే', 'ప్యార్‌ కా మౌసమ్‌', 'చిరాగ్‌', 'మై తుల్సీ తేరే ఆంగన్‌ కీ'.. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో క్లాసిక్‌ చిత్రాల్లో మరపురాని నటన ప్రదర్శించారు. 'దో బదన్‌', 'ఉపకార్‌', 'కారవాన్‌', 'తీస్రీ మంజిల్‌'లాంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించారు. 'సాజన్‌ రజ్‌నీ', 'కటీ పతంగ్‌', 'లవ్‌ ఇన్‌ టోక్యో'లలో కవ్వించే నటనతో కుర్రకారుకి నిద్ర లేకుండా చేశారు.

"నాకు విహార యాత్రలంటే చాలా ఇష్టం. స్నేహితులతో కలిసి సరదాగా చుట్టివచ్చేస్తుంటాను. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాను. మళ్లీ జన్మంటూ ఉంటే ‘ఆశా పరేఖ్‌’గా పుట్టి ఈ జీవితంలో చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల్ని సరిచేసుకుంటాను"

-- ఆశాపరేఖ్‌

'హిట్‌ గర్ల్‌'గా పాపులర్‌ అయిన ఆమె ఆటోబయోగ్రఫీ పుస్తకం అదే పేరుతో రూపుదిద్దుకుంది. ఆరోజుల్లో ఆమె హవా ఎలా ఉండేదంటే.. అగ్ర హీరోలకన్నా అత్యధిక పారితోషికం తీసుకునేవారు. హిందీతోపాటు కొన్ని గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ పని చేశారు. తెరపై ఆకట్టుకునేలా అభినయించడమే కాదు.. మెగా ఫోన్‌ పట్టుకొని దర్శకురాలిగానూ మెప్పించారు. కథక్‌, భరతనాట్యం డ్యాన్సర్‌ అయిన ఆమె ప్రపంచ వ్యాప్తంగా వందలాది ప్రదర్శనలు ఇచ్చారు.

"నా దృష్టిలో సౌందర్యం మానసికమైంది. అది మనిషిలో అంతర్లీనంగా ఉంటుంది. మనం సంతోషంగా ఉంటే ఆ మెరుపు, ప్రభావం బయటికి కనిపిస్తుంది. మనసులో బాధ గూడు కట్టుకొని ఉంటే.. అది ముఖంలో ప్రతిఫలిస్తుంది"

-- ఆశాపరేఖ్‌

'ఆకృతి' పేరుతో ఓ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి 'బాజే పాయల్‌', 'పలాష్‌ కే ఫూల్‌', 'కోరా కాగజ్‌', 'దాల్‌ మే కాలా' లాంటి టీవీ ధారావాహికలను నిర్మించారు. ఆమె చివరిసారిగా 'ఆంఖోం పర్‌' అనే చిత్రంలో కనిపించారు. వయసు మళ్లాకా కొన్ని వదిన, తల్లి పాత్రలు పోషించినా.. వాటిని కొనసాగించడం ఇష్టంలేక 1999లో గౌరవంగా సినిమాలకి వీడ్కోలు పలికారు. ఈ 47ఏళ్ల కెరీర్‌లో దాదాపు నలభైకి పైనే అవార్డులు అందుకున్నారు.

పెళ్లే వద్దంటూ..
అందం, అభినయంతో ఎందరో కుర్రాళ్ల మనసు దోచుకున్న ఆశ.. నిజ జీవితంలో తన జీవితంలో ఎవరికీ చోటివ్వలేదు. ఆనాటి అగ్ర దర్శకుడు నాసిర్‌ హుస్సేన్‌తో ఆమె పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. కానీ అప్పటికే ఆయనకు పెళ్లి కావడంతో వాళ్ల ప్రేమ పెళ్లిపీటలెక్కలేదు. తర్వాత కొన్నాళ్లకు అమెరికాకు చెందిన ఒక ప్రొఫెసర్‌తో పెళ్లి నిశ్చయమైంది. ముహూర్తాలూ పెట్టుకున్నారు. ఆయన అంతకుముందే ఒకమ్మాయితో సహజీవనం చేసేవారు. పెళ్లయ్యాక అది కొనసాగుతుందని ఖరాఖండిగా చెప్పడంతో ఆ సంబంధం వదులుకున్నారామె.

ఈ రెండు సంఘటనలతో తీవ్రంగా కలత చెందిన ఆశ ఇక జీవితంలో పెళ్లి అనే మాటకే చోటు ఇవ్వొద్దని నిర్ణయించుకున్నారు. 'పెళ్లి చేసుకొని.. గంపెడు పిల్లలు కని.. ఒక అందమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలని కలలు కనేదాన్ని. కొన్ని పరిస్థితుల కారణంగా అసలు పెళ్లే చేసుకోవద్దనుకున్నా. ఒక్కసారి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎప్పుడూ పశ్చాత్తాపం చెందలేదు. ఆ మాటకొస్తే నేను తీసుకున్నది అత్యుత్తమ నిర్ణయం అని ఇప్పటికీ నమ్ముతున్నా' అంటూ ఇటీవలే ఓ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రముఖులు, వ్యాపారవేత్తలు, నటులు.. ఎంతోమంది వరుసలో ఉన్నా.. అందర్నీ కాదని జీవితాంతం అవివాహితగానే మిగిలిపోయారు. కెరీర్‌ ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు ముంబయిలో 'కారా భవన్‌' అనే నృత్య పాఠశాల ప్రారంభించారు. తన పేరు మీదే ఓ ఆసుపత్రి నిర్మించారు. ఇప్పుడు వాటి కార్యకలాపాల్లోనే కాలం గడుపుతున్నారు.

క్రమశిక్షణకు మారుపేరు
ఎన్నో చిత్రాల్లో నటించినా ఏ ఒక్క నిర్మాత, దర్శకుడూ ఆమెపై ఫిర్యాదు చేయలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండేవారు. చెప్పిన సమయానికి వచ్చేవారు. షాట్‌ చెప్పడానికి ముందే రిహార్సల్స్‌ చేసుకొని సిద్ధంగా ఉండేవారు. బాలీవుడ్‌లో యువ, ఔత్సాహిక నటులు చాలామంది ఆమెను రోల్‌మోడల్‌గా, స్ఫూర్తిప్రదాతగా చెబుతుంటారు.

'దో బదన్‌' తర్వాత గ్లామర్‌ గర్ల్‌ కాస్తా..!
కొన్నేళ్ల పాటు గ్లామర్‌ గర్ల్‌గా చిత్రసీమలో పాపులర్‌ అయిన ఆశా పరేఖ్‌ని విలక్షణ నటిని చేసింది 'దో బదన్‌' చిత్రం. ఇందులో ధనవంతుల అమ్మాయిగా ఆశ అనే పాత్రలో నటించి మెప్పించారు ఆశా పరేఖ్‌. 'కటీ పతంగ్‌' సినిమాలో వితంతువు పాత్రలో ఆశ నటనకు ఎన్నో ప్రశంసలు దక్కాయి. "రాజ్‌ కోస్లా, విజయ్‌ ఆనంద్‌, ప్రమోద్‌ చక్రవర్తి, ఎస్‌.ఎస్‌.వాసన్‌ లాంటి దర్శకులు నాలోని విలక్షణమైన నటిని గుర్తించి ఎన్నో గొప్ప పాత్రల్ని నాకు అందించారు" అని చెబుతుంటారు ఆశ.

ఇవీ చదవండి: జక్కన్నతో సినిమా చేయాలని ఉంది.. అతడే ట్రోలింగ్​ చేయిస్తున్నాడట!: మంచు విష్ణు

Ponniyan selvan: ఈ స్టార్స్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Last Updated :Sep 28, 2022, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.