ETV Bharat / entertainment

ఆయన లేకుంటే నా లైఫ్​ ఇలా ఉండేది కాదు: అల్లుఅర్జున్​

author img

By

Published : Dec 20, 2022, 9:46 AM IST

Alluarjun about sukumar 18 pages movie
ఆయన లేకుంటే నా లైఫ్​ ఇలా ఉండేది కాదు: అల్లుఅర్జున్​

ఓ ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో పాల్గొన్న హీరో అల్లుఅర్జున్​.. ఆయన లేకుంటే తన లైఫ్​, సినీ జర్నీ ఇలా ఉండేది కాదని అన్నారు. ఆయనెవరంటే..

"ఇది వరకు దక్షిణాది చిత్రాలు.. ఇక్కడి వరకే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పుడు మన చిత్రాల్ని ప్రపంచమంతా చూస్తోంది. దక్షిణాది సినిమాలు ఉత్తరాదికి వెళ్లేందుకు 'బాహుబలి'తో బాటలు వేసిన రాజమౌళిగారికి థ్యాంక్స్‌. పుష్ప, కేజీఎఫ్, కార్తికేయ 2, కాంతార సినిమాలు పాన్‌ ఇండియా వెళ్లడం సంతోషంగా ఉంది. ఇది మనం గర్వపడాల్సిన విషయం" అని అన్నారు హీరో అల్లుఅర్జున్.

ఆయన హైదరాబాద్‌లో జరిగిన '18పేజెస్‌' విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రమిది. పల్నాటి సూర్యప్రతాప్‌ తెరకెక్కించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు నిర్మించాయి. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ.. "నా మనసుకు చాలా దగ్గరైన చిత్రమిది. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన సుకుమార్‌ చేసిన సినిమా ఇది. ఈ చిత్రం చూశాక సుక్కు నాతోనూ నిర్మాతగా ఓ సినిమా చేస్తే బాగుంటుందనిపించింది. ఆయన లేకుంటే నా ఈ జీవితం, ఈ ప్రయాణం ఇలా ఉండేది కాదని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అందుకే ఆయనంటే అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నాయి. ఇక '18 పేజెస్‌'కి గోపీ సుందర్‌ మంచి సంగీతం ఇచ్చారు. ఇలాంటి వంటి మంచి సినిమా తీసినందుకు సూర్యప్రతాప్‌కి థ్యాంక్స్‌. అతడు ఓ మంచి చిత్రం ఇవ్వాలన్న తపనతో తను నాలుగేళ్లు కష్టపడి ఈ సినిమా చేశాడు. నిఖిల్‌ను హ్యాపీడేస్‌ నుంచి చూస్తున్నా. మంచి కథలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. తను ఈ సినిమాతోనూ విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నా. ఈ చిత్రానికి గోపీ సుందర్‌ అద్భుతమైన సంగీతమందించారు. తనతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఇక 'పుష్ప2' గురించి ఒక్కటే మాట చెబుతా. ఈసారి అస్సలు తగ్గేదేలే. అది మీ మనసుకు నచ్చాలని.. నచ్చుతుందని ఆశిస్తున్నా" అన్నారు.

దర్శకుడు సుకుమార్‌ మాట్లాడుతూ "ఈ 18పేజెస్‌ కథ ఒప్పుకున్నందుకు నిఖిల్‌కు థ్యాంక్స్‌" అన్నారు. హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. "సుకుమార్‌ రాసిన కథలో.. సిద్ధు అనే మంచి పాత్ర చేయడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. నా కెరీర్‌లో బెస్ట్‌ పాత్ర అవుతుంది" అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్‌; బన్నీవాస్‌, జెమిని కిరణ్‌, గోపీ సుందర్‌, రవికుమార్‌, సరయు, దినేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ముద్దుగుమ్మల అందాల విందు.. అలరించిన ఐటెమ్​ సాంగ్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.