ETV Bharat / entertainment

'RRRకు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు.. ఆమే తన లైఫ్​ డిజైనర్​ అంటున్న జక్కన్న

author img

By

Published : Jan 16, 2023, 9:19 AM IST

Updated : Jan 16, 2023, 11:56 AM IST

RRR award
RRR award: 'ఆర్​ఆర్​ఆర్​' మరో ప్రతిష్టాత్మక అవార్డు..

ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌'కు మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. అవేంటంటే..

దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా హవా హాలీవుడ్‌లో కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవలే ఈ సినిమాలోని 'నాటు నాటు' పాటకు గోల్డెన్​ గ్లోబ్ పురస్కారం​ దక్కగా.. ఇప్పుడీ చిత్రానికి మరో రెండు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డ్స్​లో బెస్ట్​ ఫారెన్​ లాంగ్వేజ్​ చిత్రంగా పురస్కారాన్ని అందుకుంది. అలానే ఈ చిత్రంలోని నాటు నాటు పాట .. బెస్ట్ సాంగ్​ అవార్డును దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీటీమ్​ తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి అవార్డును అందుకుంటున్నట్లు కనిపించారు. ఇక ఈ పురస్కారాలు దక్కడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూవీటీమ్​కు అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఆస్కార్‌ సాధించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమా 'ఆస్కార్‌' బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో ఇది ఆస్కార్‌ కోసం పోటీ పడుతుంది. ఈ నెలాఖరులో నామినేషన్స్ ఫైనల్‌ అవుతాయి.

వాళ్లే నా విజయ రహస్యం.. ప్రతి మగాడి విజయం వెనక ఆడది ఉంటుందంటారు. అలాగే తన విజయం వెనక కూడా తన తల్లి, భార్య ఉందని అన్నారు రాజమౌళి. ఆర్​ఆర్​ఆర్​కు క్రిటిక్స్​ ఛాయిస్​ అవార్డ్స్​లో రెండు అవార్డులు రావడంపై ఆయన హర్షం చేస్తూ.. ఈ మాటల్ని అన్నారు. "నా జీవితంలో, మా ఇంట్లో మహిళలకు(తల్లి, వదిన, భార్య, కూతుళ్లు) ప్రత్యేక స్థానం. సాధారణ విద్యకు అతి ప్రాధాన్యత ఇస్తున్నారని మా అమ్మ రాజా నందిని నాకు చెప్పేవారు. అందుకే నేను కామిక్స్​, కథల పుస్తకాలు చదివేలా ప్రోత్సహించారు. ఆమె మంచి కథలు చెప్పి నన్ను కథకుడిగా తీర్చిదిద్దింది. ఇక మా వదిన శ్రీవల్లి నాకు తల్లిలాంటి వ్యక్తి. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేలా ఆమె ప్రోత్సాహం అందించింది. ఆ తర్వాత నా భార్య రమా, నా సినిమాలకు కాస్ట్యూమ్​ డిజైనర్ వ్యవహరిస్తోంది. అంతకన్నా ఎక్కువగా ఆమె నా లైఫ్​ డిజైనర్​. ఆమె లేకపోతే నేను లేను. ఇక నా కూతుర్లు విషయానికొస్తే వారు ఏమి చేయనక్కర్లేదు. వాళ్ల చిరునవ్వు చాలు నా జీవితంలో వెలుగులు నింపడానికి. చివరిగా నా మాతృభూమికి, మేరా భారత్​ మహాన్​." అని అన్నారు.

కాగా, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. అలియాభట్‌, అజయ్‌ దేవగన్‌, శ్రియా, ఒలివియా మోర్రీస్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా రూ.1200కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఇతర దేశాల్లోనూ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఇదీ చూడండి: ఎన్టీఆర్ హీరోయిన్​కు అరుదైన వ్యాధి.. అయ్యో ఇలా అయిపోయిందేంటి

Last Updated :Jan 16, 2023, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.