ETV Bharat / crime

heroin case updates : హెరాయిన్ కేసులో సుధాకర్‌ పాత్రధారి.. దిల్లీ వ్యక్తే కీలక సూత్రధారి

author img

By

Published : Sep 21, 2021, 10:04 AM IST

గుజరాత్ హెరాయిన్ కేసు
గుజరాత్ హెరాయిన్ కేసు

ఏపీలోని విజయవాడలో అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ లింక్‌లు ప్రకంపనలు రేపుతున్నాయి. అఫ్గానిస్తాన్ నుంచి తీసుకొస్తుండగా గుజరాత్‌లోనే పట్టుబడిన హెరాయిన్ డొంక మెల్లగా కదులుతోంది. కీలక సూత్రధారి దిల్లీ వాసేనని కేంద్ర సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అధికారులు అరెస్ట్ చేశారు. సాధారణ హోల్‌సేల్‌ వ్యాపారం పేరుతో విజయవాడలో కంపెనీ ప్రారంభించిన సుధాకర్ సహా అతడి భార్యనూ ప్రశ్నిస్తున్నారు. ఇక హెరాయిన్‌ వ్యవహారంతో విజయవాడకు సంబంధం లేదని పోలీసులు ప్రకటన ఇచ్చారు.

గుజరాత్ హెరాయిన్ కేసు

గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో పట్టుబడ్డ రూ.9 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ అయితే.. సూత్రధారి మాత్రం మాదకద్రవ్యాల మాఫియాలో కింగ్‌పిన్‌ అయిన దిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని దిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహమని గుర్తించాయి. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధారణకొచ్చాయి. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ ఇందులో పాత్రధారి అయ్యాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని తేల్చాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి. ఈ నెల 15న ముంద్రాలో హెరాయిన్‌ పట్టుబడిన వెంటనే డీఆర్‌ఐ అధికారులు సత్యనారాయణపురంలోని సుధాకర్‌ అత్తవారింట్లో సోదాలు జరిపారు. అయిదు రోజుల కిందట సుధాకర్‌, అతని భార్య వైశాలిని అదుపులోకి తీసుకుని, వివిధ అంశాలపై ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా అహ్మదాబాద్‌, దిల్లీ, చెన్నై నగరాల్లో సోదాలు నిర్వహించారు. భార్యాభర్తలిద్దరితో పాటు మరికొందర్ని సోమవారం అరెస్టు చేశారు.

పోర్టులో అక్రమ వ్యవహారాల్లో ఆరితేరి..

తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ కొన్నాళ్లు విశాఖపట్నంలో ఉద్యోగం చేశారు. తర్వాత చెన్నైకు వెళ్లి, ఎనిమిదేళ్లుగా అక్కడే ఉన్నారు. ఓ సిమెంట్‌ కంపెనీలో లాజిస్టిక్‌ మేనేజర్‌గా, కస్టమ్స్‌ హ్యాండ్లింగ్‌, ట్రక్కింగ్‌, స్టీమర్‌ ఏజెన్సీ బిజినెస్‌, కంటెయినర్‌ ఫ్రైట్‌ స్టేషన్స్‌ తదితర కార్యకలాపాలు నిర్వహించే ఓ ప్రఖ్యాత సంస్థలో మేనేజర్‌గా పనిచేశారు. పోర్టుల్లో ఎగుమతి దిగుమతులు, కస్టమ్స్‌ అనుమతులతోపాటు అక్కడ సాగే అక్రమ వ్యవహారాలపైనా పట్టు సాధించారు. ఈ క్రమంలో మాదకద్రవ్యాల ముఠాలతో పరిచయం ఏర్పడిందని, వారి సూచన మేరకే సుధాకర్‌ ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని ప్రారంభించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ కంపెనీ ఎగుమతి- దిగుమతి కోడ్‌ (ఐఈసీ)ని తమకు ఇస్తే భారీ మొత్తంలో కమీషన్‌ చెల్లిస్తామనడంతో సుధాకర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ నుంచి ఐఈసీని పొంది దాన్ని మత్తు ముఠాల సభ్యులకు అందజేసినట్లు భావిస్తున్నాయి. వారు ఆ పేరు ఉపయోగించుకుని భారత్‌లోకి హెరాయిన్‌ దిగుమతి చేస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. ఈ వ్యవహారంలో టెర్రర్‌ ఫండింగ్‌ (ఉగ్రవాదులకు నిధుల కోణం) ఏదైనా ఉందా అనీ ఆరా తీస్తున్నాయి.

ఆషీ ట్రేడింగ్ కంపెనీ

బియ్యం, పండ్ల హోల్‌సేల్‌ వ్యాపారమంటూ..

సుధాకర్‌ భార్య గోవిందరాజు దుర్గా పూర్ణ వైశాలి. విజయవాడ సత్యనారాయణపురంలోని గడియారం వారి వీధిలో ఉన్న వైశాలి పుట్టింటి చిరునామాతోనే ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని సుధాకర్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. తన అత్తవారింటిని అద్దెకు తీసుకున్నట్లు ఒప్పందం చేసుకుని లైసెన్సు పొందారు. బియ్యం, పండ్లు తదితరాల హోల్‌సేల్‌ వ్యాపారం చేసేందుకు కంపెనీ పెడుతున్నట్లు రిజిస్ట్రేషన్‌ సమయంలో పేర్కొన్నారు. ఆ ఇంటిపై ‘ఆషీ ట్రేడింగ్‌ కంపెనీ’ అని రాసి, జీఎస్టీఎన్‌ నంబర్‌ వేసి ఉన్న చిన్న కాగితం మాత్రమే అంటించి ఉంది. అక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించలేదు. వ్యాపారం చేయడానికి డీఅండ్‌ఓ ట్రేడ్‌ లైసెన్సును కూడా విజయవాడ కార్పొరేషన్‌ నుంచి తీసుకోలేదు. చెన్నై కేంద్రంగానే సుధాకర్‌ కార్యకలాపాలన్నీ నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు.

హెరాయిన్‌తో విజయవాడకు సంబంధం లేదు

"ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌ దిల్లీ వెళ్లాల్సి ఉంది. మాచవరం సుధాకర్‌.. ఆయన భార్య వైశాలి పేరిట గతేడాది ఆగస్టులో ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్ట్రేషన్‌ చేయించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని అత్తవారింటి చిరునామాను లైసెన్సు కోసం వాడుకున్నారు. అంతకు మించి ఈ కేసుకు విజయవాడతో సంబంధం లేదు. సుధాకర్‌, వైశాలి కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటున్నారు. వారికి ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు లేవు."

- బత్తిన శ్రీనివాసులు, నగర పోలీసు కమిషనర్‌, విజయవాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.