VIVEKA MURDER CASE: 'పెద్ద తలలు తప్పించుకునేందుకే పన్నాగం!'

author img

By

Published : Aug 10, 2021, 1:51 PM IST

VIVEKA MURDER CASE, sunil family allegations on viveka murder case
ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసు, వివేకా హత్యకేసుపై సునీల్ కుటుంబసభ్యుల ఆరోపణలు ()

ఏపీ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు కొందరు పెద్దనాయకులు తన అన్నని ఇరికిస్తున్నారని ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ తమ్ముడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. ఆ పెద్దవాళ్లు, సీబీఐ అధికారుల నుంచి తమ కుటుంబానికి ప్రాణహాని ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చిన్నాన్న, ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసిందోవరో జగన్‌మోహన్‌రెడ్డికి, ప్రజలందరికీ తెలుసని సీబీఐ కస్టడీలో ఉన్న సునీల్‌కుమార్‌ యాదవ్‌ తమ్ముడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌ ఆరోపించారు. సీబీఐ అధికారులు లేనిపోనివి సృష్టిస్తున్నారని, అందులో భాగంగానే కాలువలో మారణాయుధాలు ఉన్నాయని వెతికిస్తూ.. సునీల్‌ని నిందితుడిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

రెండేళ్ల తర్వాత రంగన్న సాక్ష్యం?

ఈ కేసులో అసలు నిందితులు బయటపడతారనే భయంతోనే కడప మేయర్‌, వైకాపా నాయకుడు సురేష్‌బాబు ఎస్పీని కలిసి ప్రతిపక్ష నేతలు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు సమర్పించారన్నారు. ఇంతకుముందు మాట్లాడని వాచ్‌మన్‌ రంగన్న.. హత్య జరిగి రెండేళ్లు గడిచాక ఇప్పుడెందుకని సునీల్‌ పేరును వాంగ్మూలంలో చెప్పారని ప్రశ్నించారు. దర్యాప్తులో తమ కుటుంబానికి అన్యాయం జరుగుతోందని ఏపీ సీఎంను కలిసి చెప్పాలనుకుంటే సీబీఐ అధికారులు అడ్డుకుంటున్నారన్నారు.

'ఒత్తిడి చేస్తున్నారు'

వివేకా, సునీల్‌ల మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయా అని విలేకరులు ప్రశ్నించగా.. అలాంటివేం లేవన్నారు. వివేకా రెండు, మూడుసార్లు తమ ఇంటికి కూడా వచ్చారన్నారు. ఇదేవిషయమై వివేకా కూతురు సునీతను కలిసి ఎందుకు చెప్పలేదని విలేకరులు అడగ్గా... అలా చేస్తే కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తారన్నారు. సునీల్‌ భార్య లక్ష్మీ మాట్లాడుతూ.. ఈ కేసులో వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టుకు ఇచ్చిన జాబితాలోని 11 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ఎందుకు విచారించట్లేదని ప్రశ్నించారు. సునీల్‌ని రెండు నెలల 25 రోజులపాటు దిల్లీలో దారుణంగా కొడుతూ హత్యలో ప్రమేయం ఉన్నట్లు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరోచోటా మారణాయుధాల అన్వేషణ..

వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల వెలికితీతకు సీబీఐ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. వరుసగా మూడో రోజూ పులివెందులలోని రోటరీపురం వీధి సమీపంలోని కాలువలో అన్వేషణ కొనసాగింది. కొత్తగా గరండాలవంకలో శుక్రవారం ఆయుధాల కోసం మట్టి తవ్వకాలు చేపట్టారు. వివేకా కుమార్తె సునీత సోమవారం ఉదయం సీబీఐ అధికారులను కలిశారు. తర్వాత రోటరీపురంలో ఆయుధాల వెలికితీతను పరిశీలించారు. సీబీఐ అధికారులు సోమవారం సాయంత్రం సునీల్‌ను వెంటబెట్టుకొని వివేకా ఇంటి పరిసరాల్లో తిరిగి కొన్ని వివరాలు సేకరించారు.

మరోవైపు ఒక సీబీఐ అధికారుల బృందం పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో 13 మందిని విచారించింది. వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సన్నిహితుడు, యూసీఐఎల్‌ ఉద్యోగి ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఆయన తండ్రి ప్రకాష్‌రెడ్డి, పులివెందుల పురపాలక ఛైర్మన్‌ వరప్రసాద్‌, ఏపీ సీఎం జగన్‌ మామ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బంది రామకృష్ణారెడ్డి, ఓబులేషు, స్థానిక వైకాపా నాయకుడు జగదీశ్వర్‌రెడ్డి, స్థానిక సీఎస్‌ఐ చర్చి సభ్యులు, స్థానిక వైద్యసిబ్బంది ఉన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.