Saidabad incident: ఇంకా దొరకని కామాంధుడు.. కారణం అదే.. ఇవిగో సీసీటీవీ దృశ్యాలు..!

author img

By

Published : Sep 14, 2021, 4:28 PM IST

Updated : Sep 14, 2021, 10:24 PM IST

reasons-for-saidabad-incident-culprit-not-yet-caught-by-police
reasons-for-saidabad-incident-culprit-not-yet-caught-by-police ()

ఆరేళ్ల చిన్నారిపై హత్యచారం చేసిన నిందితుడు పోలీసులకు ఇంకా చిక్కలేదు. పది బృందాలుగా జల్లెడ పడుతున్నా... ఎక్కడా పోలీసులకు దొరకకపోవటంపై ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్న స్థానికులు.. నిందితున్ని పట్టుకోకపోవటంపై తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. పోలీసులు మాత్రం సీసీటీవీల దృశ్యాల ఆధారంగానే కాకుండా.. నిందితుని స్నేహితుడు చెబుతున్న విషయాల ఆధారంగా ముమ్మర ధర్యాప్తు సాగిస్తున్నారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ.. కేసు పురోగతిని తెలుసుకుంటున్నారు.

సైదాబాద్​లో జరిగిన​ పాశవిక హత్యాచార ఘటనపై అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. నిందితుడిని ఇంకా పట్టుకోకపోవటంపై కుటుంబసభ్యులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారానికి పాల్పడింది పల్లంకొండ రాజు మాత్రమే అయినా.. అతడిని తప్పించేందుకు బస్తీవాసి ఒకరు సహకరించారని తెలిసింది... ఆ వ్యక్తే రాజును తప్పించాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు నిందితుడు రాజు కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. టాస్క్​ఫోర్స్​తో పాటు మొత్తం పది బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

ఇవిగో సీసీటీవీ దృశ్యాలు

వైన్సుల ముందు...

నిందితుడు రాజు చరవాణి ఉపయోగించకపోవడం పోలీసుల గాలింపునకు ఆటంకంగా మారింది. ఒకవేళ రాజు సెల్​ఫోన్ వినియోగిస్తూ.. ఉంటే సాంకేతికత ఆధారంగా పోలీసులు ఆచూకీని వెంటనే గుర్తించేవారు. ఘటన అనంతరం పని చేసిన కాంట్రాక్టర్ వద్దకు వెళ్లిన రాజు.. గతంలో పని చేసినందుకు రావాల్సిన రూ.1800 తీసుకుని వెళ్లిపోయాడు. ఊరికి వెళుతున్నానని కాంట్రాక్టర్​కి చెప్పి వెళ్లాడు. తన వద్ద ఉన్న ఫోన్​ ఆఫ్ చేసి పడేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్యాంక్ బండ్ సహా ప్రతి పార్కును గాలిస్తున్న బృందాలు... రైల్వేస్టేషన్, బస్​స్టేషన్లు, మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్​లలో జల్లెడపడుతున్నారు. నిందితుడు గుండు చేయించుకుని మాస్క్ పెట్టుకుని ఉన్నాడేమో అనే కోణంలో కూడా పోలీసులు గాలిస్తున్నారు. సైదాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రతి లేబర్ అడ్డాను కూడా ప్రత్యేక బృందాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

మద్యం దుకాణాల వద్ద..

రాజు గంజాయితో పాటు మద్యానికి బానిస అని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు పోలీసులు సైదాబాద్, దిల్​సుఖ్​​నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలతో పాటు రహదారులపై ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. రాజు స్వగ్రామం అయిన జనగామ జిల్లా కొడకంట్లతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో పోలీసులు ఇప్పటికే గాలించారు. రాజు సమీప బంధువులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే నిందితుడు రాజు స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు... అతడు చెప్పిన ఆధారాల ప్రకారం గాలిస్తున్నారు.

పారిపోవాలంటూ..

తల్లిదండ్రులతో ఉంటున్న చిన్నారిపై కన్నేసిన రాజు... నాలుగు రోజుల క్రితం చాక్లెట్‌ ఆశ చూపించి బాలికను తీసుకెళ్లాడు. పాశవికంగా చిన్నారిని హత్యచేసి శవాన్ని తన గదిలో ఉంచి తాళం వేసి బయటకు వచ్చాడు. బాలిక తల్లిదండ్రులు అతడిపై అనుమానం వ్యక్తం చేసినా... పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నారి కోసం పోలీసులు, తల్లిదండ్రులు, స్థానికులు అన్నిచోట్లా గాలిస్తున్నప్పుడు రాజు స్నేహితుడు అతడిని పక్కకు తీసుకెళ్లి.. ఇక్కడి నుంచి పారిపోవాలంటూ చెప్పినట్లు తెలిసింది. అక్కడున్నవారు గుర్తుపట్టకుండా ఉండేందుకు టోపీ, మాస్కు, తువ్వాలు, ఒక జత దుస్తులతో కూడిన సంచిని ఇచ్చాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. వీరి ఆరోపణలకు బలం చేకూర్చుతూ అక్కడున్న సీసీ కెమెరాలో రాజు, అతడి స్నేహితుడు వెళ్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

నాకేం తెల్వదు...

రాజు చేసిన ఘటనపై తనకు ఎలాంటి సంబంధం లేదని... ఆ విషయం కూడా తనకు తెలియదని పోలీసులు ఎదుట రాజు స్నేహితుడు చెప్పినట్లు సమాచారం. పోలీసులు మాత్రం వీరిద్దరు తిరిగిన ప్రదేశాలలోని సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రాజు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నట్లు వస్తున్న వార్తలను మాత్రం పోలీసు అధికారులు ఖండిస్తున్నారు.

ఉన్నతాధికారుల సమీక్ష..

చిన్నారి హత్యాచారం కేసులో పోలీస్​ ఉన్నతాధికారుల సమీక్ష నిర్వహించారు. అదనపు డీజీ శిఖాగోయల్, సంయుక్త సీపీ రమేశ్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తితో సీపీ అంజనీ కుమార్ సమీక్షించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా.. ఎలాంటి ఆధారాలు లభించాయి..? కేసు ఎంత పురోగతి సాధించింది..? అన్న అంశాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు తెలుసుకుంటున్నారు.

సంబంధిత కథనాలు...

Last Updated :Sep 14, 2021, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.