మత్తులో కత్తితో దాడి.. వృద్ధురాలు మృతి.. నిందితున్ని ఉరితీయాలంటూ ఆందోళన..

author img

By

Published : Jan 17, 2022, 5:20 PM IST

Protest to hang accused who attacked with knife and murder in kondapuram

Protest to hang accused: పండగకు ఇంటికి వచ్చిన భార్య కుటుంబీకులపై మద్యం మత్తులో కత్తితో దాడి చేసి ఓ వృద్ధురాలి మృతికి కారణమైన నిందితున్ని ఉరితీయాలని బంధువులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురంలో జరిగిన ఈ ఘటనకు నిరసనగా.. జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

Protest to hang accused: ములుగు జిల్లా వెంకటాపురం మండలం కొండాపురంలో నిన్న రాత్రి(జనవరి 16న) జరిగిన కత్తి దాడి కలకలం సృష్టించింది. తాగినమైకంలో భార్య కుటుంబీకులపై కత్తితో దాడి చేసిన భర్త చంటిబాబుపై గ్రామస్థులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో ఓ వృద్ధురాలు మరణించటంతో కోపోద్రిక్తులైన బంధువులు, గ్రామస్థులు నిందితుడు చంటిబాబును వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలంటూ.. బంధువులు, గ్రామస్థులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని నిరసన విరమింపజేశారు.

అసలు ఏం జరిగిందంటే..

చంటిబాబు, లోకేశ్వరికి ఆరేళ్ల క్రితం పెళ్లి కాగా.. కొండాపురంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో లోకేశ్వరి చెల్లెలికి వివాహం చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేయగా.. తానే వివాహం చేసుకుంటానని చంటిబాబు గొడవలు చేశాడు. ఎంత చెప్పినా వినకపోయే సరికి లోకేశ్వరి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంటిబాబుకు పోలీసులు కౌన్సిలింగ్​ ఇచ్చి పంపించేశారు. మళ్లీ ఇప్పుడు లోకేశ్వరి చెల్లికి వేరే వాళ్లతో వివాహం కుదిరింది. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగ సందర్భంగా.. లోకేశ్వరి తల్లి సమ్మక్క, నానమ్మ ఆదిలక్ష్మి కొండాపురానికి కూతురిని చూసివెళ్లేందుకు వచ్చారు.

ఇదే సమయంలో మరదలికి వేరే వాళ్లతో పెళ్లి నిశ్చయం చేశారన్న కోపంతో తప్పతాగి వచ్చిన చంటిబాబు.. లోకేశ్వరితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడికి దిగాడు. చంటిబాబును అడ్డుకునే క్రమంలో వృద్ధురాలు ఆదిలక్ష్మికి తీవ్రగాయాలు కాగా.. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనలో లోకేశ్వరి, సమ్మక్కకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని వెంకటాపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మత్తులో చేసిన పనికి ఓ వృద్ధురాలు బలికావటం వల్ల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడు చంటిబాబును చెట్టుకు కట్టేసి చితకబాదారు. చంటిబాబును అరెస్ట్​ చేసి ఉరితీయాలని డిమాండ్​ చేస్తూ.. ఆందోళన చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.