ETV Bharat / crime

Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్

author img

By

Published : Jan 31, 2022, 2:05 PM IST

Updated : Jan 31, 2022, 4:37 PM IST

Hyderabad Drug Case : డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీ కోరుతూ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున... వ్యాపారులను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. కాగా హైకోర్టు రేపు తీర్పు వెలువరించనుంది.

Police petition in High Court, police petition for traders custody
డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోసం హైకోర్టులో పోలీసుల పిటిషన్

Hyderabad Drug Case : డ్రగ్స్ కేసులో వ్యాపారుల కస్టడీకి కోరుతూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాపారులను కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు ఇటీవల నిరాకరించగా... పోలీసులు రాష్ట్ర ఉన్నతన్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డ్రగ్స్ కొనుగోళ్లపై కీలక సమాచారం సేకరించాల్సి ఉందని... నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై వాదనలు పూర్తవగా.. తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

టోనీ విచారణ @ మూడోరోజు

మరోవైపు డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీని పోలీసులు టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో మూడో రోజు విచారిస్తున్నారు. టోనీని మత్తుపదార్థాల స్మగ్లింగ్‌లో అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు.. అతని కాల్‌డేటా సేకరించి పలువురితో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్‌లో వ్యాపారవేత్తలతో సంబంధాలు, నగరంలో అతని ఏజెంట్లతో జరిపిన పైనా దర్యాప్తులో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా, లావాదేవీలపైనా దృష్టిసారించారు. టోనీకి డబ్బు బదిలీ చేసిన బ్యాంకు లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ సీఐ నాగేశ్వర్‌రావు... టోనీ బ్యాంకు లావాదేవీల వివరాలను పంజాగుట్ట పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. వాటిని అతని ముందుంచి ప్రశ్నిస్తున్నారు. టోనీని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు.. ఫిబ్రవరి 2 వరకు విచారించనున్నారు.

డ్రగ్స్ కేసులో బడా వ్యాపారులు..!

హైదరాబాద్​ పంజాగుట్ట మాదక ద్రవ్యాల కేసులో మరో 10 మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వీరిలో నలుగురు వ్యాపారులుండగా.. మరో ఆరుగురు వ్యక్తులు.. ప్రధాన నిందితుడు టోనీకి ఏజెంట్లుగా పనిచేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించిన వాళ్లలో ఏడుగురు బడా వ్యాపారవేత్తలున్నారు. మరో నలుగురు వ్యాపారులు కూడా టోనీ దగ్గర మాదక ద్రవ్యాలు కొనుగోలు చేసి, విక్రయిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అలోక్ జైన్ అనే వ్యాపారులు గత కొన్నినెలలుగా టోనీ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎవరీ టోనీ..?

నైజీరియాకు చెందిన టోనీ 2006లో వివాహం చేసుకున్నాడు. అనంతరం భార్యతో మనస్పర్ధలు తలెత్తి వేరుగా ఉంటున్నాడు. కుమార్తెను తన తల్లి వద్ద ఉంచి.. 2013లో పర్యటక వీసాపై భారత్​కు వచ్చాడు. వస్త్రాలు, విగ్గులను నైజీరియాకు ఎగుమతి చేసేవాడు. డబ్బులు సరిపోకపోవడం వల్ల తోటి నైజీరియన్లు కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పటి నుంచి టోనీ సైతం అదే బాట పడ్డాడు. నైజీరియాకు చెందిన స్టార్​బాయ్.. ఓడ రేవుల మీదుగా ముంబయికి మాదక ద్రవ్యాలు చేరవేసేవాడు. 2019లో అతనితో పరిచయం పెంచుకున్న టోనీ.. అప్పటి నుంచి అతని వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలుచేసి.. అవసరమైన వాళ్లకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. దీనికోసం ముంబయిలో 8 మంది ఏజెంట్లను నియమించుకున్నాడు. వాళ్ల సాయంతో మాదక ద్రవ్యాలను వినియోగదారుల వద్దకు చేరుస్తున్నాడు.

వ్యాపారుల విచారణ కోసం పిటిషన్

డగ్ర్​ విక్రయించగా వచ్చే డబ్బును వెస్టర్న్​ మనీ యూనియన్​ ట్రాన్స్​ఫర్​ ద్వారా తన అనుచరుల ఖాతాలో జమచేయించుకొనే వాడు. డ్రగ్స్​ క్రయ, విక్రయాల సమయాల్లో వినియోగదారులతో మాట్లాడేందుకు కేవలం వాట్సాప్​ కాల్స్​ను మాత్రమే చేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈనెల 20న టోనీని పోలీసులు అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. టోనీ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్​లో 11 మంది బడా వ్యాపారులు, మరో ఇద్దరు డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించారు. టోనీతో పాటు వ్యాపారులను కస్టడీలోకి తీసుకొనేందుకు కోర్టు అనుమతి కోసం పోలీసులు పిటిషన్​ దాఖలు చేశారు. వ్యాపారులను కస్టడీకి ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం వాదనలు విన్నధర్మాసనం.. మంగళవారం తీర్పు వెలువరించనుంది.

ఇదీ చదవండి: వ్యాపారవేత్తలతో టోనీకి నేరుగా కాంటాక్టులు.. విచారణలో కీలక విషయాలు

Last Updated :Jan 31, 2022, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.