ETV Bharat / crime

Police Investigation on Boyaguda: ప్రమాదం ఎలా జరిగింది.. పోలీసుల దర్యాప్తులో కీలక ఆధారాలు

author img

By

Published : Mar 24, 2022, 5:07 AM IST

సికింద్రాబాద్‌ బోయిగూడ తుక్కుగోదాంలో 11మందిని బలితీసుకున్న అగ్నిప్రమాదం.... ఎలా జరిగిందన్న విషయంపై అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదు. గ్యాస్‌ లీకేజీ కారణంగా ప్రమాదం జరిగిందా...? విద్యుదాఘాతం వల్ల మంటలు వ్యాపించాయా...? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణతోనే మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు.

Police Investigation on Boyiguda
బోయిగూడ ఘటన.. ఎలా జరిగింది

పదకొండు మంది వలసజీవులను బలి తీసుకున్న సికింద్రాబాద్‌ బోయిగూడ తుక్కుగోదాం అగ్నిప్రమాద ఘటనపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి కారణాలపై పోలీసులు వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. విద్యుదాఘాతమైతే... కరెంట్‌ సరఫరా అయ్యే రెండు తీగల మధ్య మెరుపు వచ్చే అవకాశముంది. స్పార్క్‌ వచ్చి మంటలు చెలరేగుతాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. మెరుపు తక్కువగా వచ్చిన సందర్భంలో.... తొందరగా అంటుకునే స్వభావం ఉన్న వస్తువులపై స్పార్క్‌ పడి మంటలు చెలరేగుతాయి. కరెంటు సరఫరాపై ఎలాంటి ప్రభావముండదు. గ్యాస్‌లీక్‌ ఐతే వాసన వస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో వాసన లేకుండానే గదులు, గోదాముల్లో గ్యాస్‌లీక్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బోయిగూడ ఘటన... విద్యుదాఘాతం వల్ల జరిగిందా...? గ్యాస్‌ లీక్‌ వల్ల సంభవించిందా...?అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

గ్యాస్‌స్టవ్‌ సరిగ్గా ఆర్పకపోయినా, సిలిండర్‌ నాబ్‌ను మధ్యలో వదిలివేసినా... గ్యాస్ లీకయ్యే అవకాశాలున్నాయని పోలీసులు చెబుతున్నారు. పెద్ద పేలుడు సంభవించిందని స్థానికులు చెప్పిన విషయాన్ని పరిగణలోకి తీసుకుని పరిశీలిస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌ ఓ పక్క, స్టవ్‌ మరో పక్క చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సిలిండర్ ఎగిరి మూలకు పడిందా అనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు.

గోదాములో మంటలు అంటుకున్నప్పుడు.... నిద్రిస్తున్నవారికి వేడి తగిలి ఉండాలి. ఎండాకాలం కావడంతో కొద్దిగా వేడి తగిలినా... మెళకువ వస్తుంది. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రేమ్‌కుమార్‌ విషయంలో ఇదే జరిగింది. మంటలు పెరగ్గానే వేడికి మెళకువ వచ్చిన ప్రేమ్‌కుమార్‌.... కిందకు వెళ్లే దారి లేకపోవడంతో... కిటికీలోంచి దూకాడు. ఇతనికి దగ్గర్లోనే మిగతావారు పడుకున్నారు. వారు దూకేందుకు ఎందుకు ప్రయత్నించలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. 11 మందిలో కనీసం ఒక్కరు కూడా ప్రయత్నించలేదు. మృతదేహాలన్నీ ఒకే చోట పడి ఉన్నాయి. మంటలు వ్యాపిస్తున్నప్పుడు ఇందులో కనీసం ఒకరిద్దరైనా కిందికి వచ్చేందుకు ప్రయత్నించి ఉండాలి. అయితే బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వీలుపడకపోవడంతో.... భయానికి మళ్లీ అందరూ ఒక దగ్గరకు వచ్చి ఉంటారని.... అక్కడే కాలిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు.

బోయగూడ వంటి అగ్ని ప్రమాదాలు హైదరాబాద్‌లో తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మెజార్టీ దుర్ఘటనలు అనుమతి లేని నిర్మాణాలు, అనధికార గోదాముల్లోనే చోటు చేసుకుంటున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్, కోఠి, కాచిగూడ, అమీర్‌పేట వంటి రద్దీ ప్రాంతాల్లో అక్రమ గోదాములు ఎక్కువగా ఉన్నాయి. రాణిగంజ్, బోయిగూడ, బన్సీలాల్‌పేట ప్రాంతాల్లో రంగు డబ్బాలు, వస్త్రాలు, ఎలక్ట్రిక్‌ వస్తువులు, ఆట బొమ్మలకు సంబంధించి గోదాములున్నాయి. బోయిగూడలోని డిపోలు, గోదాములను తొలగించాలని స్థానికులు చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. చాలా చోట్ల గోదాములు ఇరుకైన ప్రాంతాల్లో ఉంటున్నాయి. దీని వల్ల ప్రమాదం జరిగిన సమయంలో సహాయచర్యలకూ ఇబ్బందిగా మారుతోంది.

బోయిగూడా అగ్నిప్రమాదంలో చనిపోయినవారంతా బిహార్‌ చాప్ర జిల్లాకు చెందినవారిగా గుర్తించిన అధికారులు... 11మంది మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ శంషాబాద్ విమానాశ్రయం నుంచి పట్నాకు తరలించి.... అక్కడ కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు, బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల పరిహారాన్ని ప్రకటించాయి.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.