ETV Bharat / crime

రుణాల పేరిట మోసం.. 50 మంది రైతులకు కుచ్చుటోపీ

author img

By

Published : Aug 6, 2021, 6:23 PM IST

రుణాల పేరిట మోసం.. 50 మంది రైతులకు కుచ్చుటోపీ
రుణాల పేరిట మోసం.. 50 మంది రైతులకు కుచ్చుటోపీ

దగా చేసేవాడు మారినా.. మోసపోయేవాడు మాత్రం మారటం లేదు. ఒకడేమో లక్కీ డ్రా అంటాడు. మరొకడేమో ఇంకేదో వలేస్తాడు. ఎలాగైతేనేం వారిని దోచేస్తాడు. అంతా అయిపోయాక గానీ మోసాన్ని గ్రహించని ఆ బాధితుడు మాత్రం.. ప్రతిసారీ మోసపోతూనే ఉంటారు. తాజాగా లోన్​ల పేరిట ఓ ఘరానా మోసగాడు సుమారు 50 మంది రైతులకు కుచ్చుటోపీ పెట్టాడు. ఎంతకూ రుణాలు ఇవ్వకపోవడంతో నిలదీస్తే.. అసలు మోసం బయటపడింది.

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కురవి మండలం కందికొండ గ్రామానికి చెందిన మద్దూరి వీరన్నగా తెలిపారు.

రుణాల పేరిట మోసం.. 50 మంది రైతులకు కుచ్చుటోపీ

కందికొండకు చెందిన మద్దూరి వీరన్న మహబూబాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్​లో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఓ లోకల్​ యాప్​ రూపొందించుకుని.. మండలాల వారీగా ఏజెంట్లను నియమించుకున్నాడు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా చిన్న, సన్నకారు రైతులకు రుణాలు ఇస్తామని, ఎకరాకు రూ.6 వేల చొప్పున కడితే.. 45 రోజుల్లో రూ.40 వేల రుణాన్ని ఇస్తామని తెలిపాడు. ఎస్సీ, ఎస్టీ రైతులకు రుణం పూర్తిగా మాఫీ అవుతుందని.. బీసీలకు 50 శాతం రుణం మాఫీ అవుతుందని ఏజెంట్లకు చెప్పాడు. ఒక అప్లికేషన్​పై ఏజెంట్​కు రూ.700 కమీషన్ ఇస్తానని నమ్మబలికాడు. ఈ మేరకు 100 నుంచి 150 మంది ఏజెంట్లను నియమించుకుని.. ఐడీ కార్డుల పేరిట ఒక్కొక్కరి నుంచి రూ.1,000 వసూలు చేశాడు.

వీరన్న మాటలు నమ్మిన నిరుద్యోగులు ఏజెంట్​లుగా చేరి.. కమీషన్​ల ఆశతో చనిపోయిన రైతుల పేర్లపైనా డబ్బులు వసూలు చేశారు. 45 రోజుల గడువు పూర్తయినా వీరన్న డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు ఏజెంట్లను నిలదీశారు. వీరన్న ఎంతకూ డబ్బులు ఇవ్వకపోవడంతో ఓ ఏజెంట్​కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్యాలయంలో సోదాలు చేయగా.. అసలు నిజం బయటపడింది. ఆఫీసులో కొన్ని ఐడీ కార్డులు, అప్లికేషన్ ఫామ్స్ లభించాయి. దీంతో పోలీసులు వీరన్నను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఒక్క మహబూబాబాద్​లోనే బ్రాంచ్ ఉందా.. మరికొన్ని చోట్ల బ్రాంచీలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ఏజెంట్లు
ఏజెంట్లు

ఈ ఘటనపై మాకు సమాచారం రావడంతో కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశాం. కొన్ని ఐడెంటిటీ కార్డులు, అప్లికేషన్​ ఫామ్స్​ లభించాయి. సుమారు 50 మంది రైతుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం అన్ని విషయాలు వెల్లడిస్తాం. -వెంకటరత్నం, పట్టణ పోలీస్​స్టేషన్​ సీఐ

'నా పేరు కల్యాణ్. నేను జాబ్​ కోసం లోకల్ యాప్​లో వెతికితే.. వేకెన్సీ ఉందని చెప్పి నా దగ్గర రూ.1000 తీసుకున్నాడు. ఒక ఐడీ కార్డు ఇచ్చి.. రైతుల దగ్గర నుంచి ఎకరానికి రూ.6 వేల చొప్పున డీడీ తీపిస్తే.. ఎకరానికి రూ.40 వేల చొప్పున పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి ద్వారా రుణాలిస్తామని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీ రైతులకు రుణాలు పూర్తిగా మాఫీ అవుతాయని, బీసీలకు 50 శాతం రుణాలు మాఫీ అవుతాయన్నాడు. ఆయన మాటలు నమ్మి నేను రైతుల వద్ద నుంచి సుమారు రూ.50 వేల వరకు కట్టించాను. రుణాలు ఇవ్వకపోవడంతో నిలదీస్తే.. అసలు విషయం తెలిసింది.- కల్యాణ్, ఏజెంట్

Crime: తక్కువ ధరకే కిలో బంగారమన్నాడు.. 32 లక్షలతో ఉడాయించాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.