ETV Bharat / crime

Playing cards: కొత్త అడ్డాల కోసం అన్వేషణ.. ఎల్లలు దాటుతున్న జూదం..

author img

By

Published : Sep 12, 2021, 7:40 PM IST

పేకాట రాయుళ్లు ప్రతిభ ఎల్లలు దాటుతోంది. రాష్ట్రంలో పేకాట క్లబ్‌లపై ప్రభుత్వం నిషేధం విధించటంతో... కరోనా వల్ల ఖాళీగా మారిన ఇళ్లు, అతిథి గృహాలు, గేటెడ్‌ కమ్యూనిటీలోని నివాసాలనే అనధికార క్లబ్​ నిర్వాహకులు పేకాట కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. ఇక్కడ చేయి తిరిగిన పేకాట రాయుళ్లకు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఆడే అవకాశాలు కల్పిస్తూ.. కోట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. ఇందులో సామాన్యులే కాకుండా.. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.

Playing cards champions moving other states to play
Playing cards champions moving other states to play

పేకాట రాయుళ్లకు జంటనగరాల పోలీసులు ఊపిరిసలపనీయక పోవటంతో.. జూదమాడేందుకు స్థావరాలు దొరక్క ఇబ్బందిపడుతున్నారు. ఎక్కడ ఆడినా ఇట్టే పట్టేసుకోవటం వల్ల సురక్షితమైన ప్రదేశాలు లేవని బాధపడుతున్నారు. ఇక్కడ చేయి తిరిగిన ఆటగాళ్లనే నమ్ముకుని ఉన్న అనాధికార క్లబ్​ల నిర్వాహకులు.. లక్షల్లో జరిగే వ్యాపారాన్ని వదులుకోవటం ఇష్టంలేక ఎన్ని కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. సీనియర్​మోస్ట్​ పేకాట రాయుళ్లకు జూదం అలవాటైపోయి.. ఇక్కడ ఆడలేకపోవటం వల్ల.. మిగితా రాష్ట్రాలు, దేశాలకు పంపించే పనిలో పడ్డారు.

ఎక్కడున్నా పట్టేస్తున్నారు...

జంటనగరాల్లో తిరిగి వేళ్లూనుకుంటోన్న పేకాటపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసులకు దొరకకుండా.. హైదరాబాద్ శివారు ప్రాంతాలను ఎంచుకుంటూ పేకాట రాయుళ్లను నిర్వాహకులు పోగుచేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఖాళీ అయిన అపార్ట్​మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలోని నివాసాలు, అతిథి గృహాలను సురక్షితంగా భావించి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు క్లబ్​ నిర్వాహకులు. అయితే వాటిని కూడా పోలీసులు పసిగట్టి.. ఆటకట్టిస్తున్నారు. ఇటీవల మాదాపూర్‌, మియాపూర్‌తో పాటు ఇతర శివారు ప్రాంతాలపై ఎస్వోటీ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వరుస దాడులతో... పెద్ద సంఖ్యలో పేకాట రాయుళ్లు, లక్షల రూపాయల్లో డబ్బులు పట్టుబడ్డాయి. వారం రోజుల క్రితం సినీ నటుడు కృష్ణుడుతో పాటు 8 మందిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. మరో స్థావరంపై దాడి చేసి సుమారు 18 లక్షల 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. బ్యూటీ పార్లర్ పేరుతో మసాజ్ సెంటర్లు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అనేక మందిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

దారి ఖర్చులిచ్చి మరీ...

నగరంలో పోలీసుల నిఘా తీవ్రతరం కావడం వల్ల పేకాట రాయుళ్లు కొత్త స్థావరాల కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌, రాయచూర్‌ లాంటి పట్టణాలకు జూదం కోసం వెళ్తున్నారు. పేకాటరాయుళ్లకు అక్కడి క్లబ్‌ల నిర్వాహకులు వచ్చిపోయేందుకు కార్లను సైతం సమకూర్చుతున్నారు. వీరికి మద్యం, బిర్యానీలు కూడా ఉచితంగా సమకూర్చడం వల్ల నగరం నుంచి పేకాటరాయుళ్లు రాయచూర్ దారి పడుతున్నారు. మరికొందరు గోవా, శ్రీలంక తదితర ప్రాంతాలకు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. శ్రీలంకకు జూదం కోసం వెళ్లేవాళ్లు కేవలం 5 లక్షలు చెల్లిస్తే క్లబ్‌ నిర్వాహకులు వచ్చిపోయే విమాన ప్రయాణ ఖర్చులతో పాటు ప్రత్యేక కార్లను కూడా సమకూర్చుతున్నారట.

పోలీసుల నిఘా..

పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు చిన్నాబిన్నమవుతున్నా.. నిర్వాహకులు మాత్రం వారి స్వార్థంతో ఈ దుశ్చర్యను ప్రోత్సహిస్తున్నారు. పేకాటకు అలవాటు పడిన వారు ఆస్తులను కూడా తెగనమ్మి జూదం ఆడుతోంటే.. వారిని దేశాలు దాటిస్తూ లక్షల వ్యాపారం సాగిస్తున్నారు. ఇలా నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అనుమానితులపై పోలీసులు ఇప్పటికే నిఘా పెట్టారు. నిర్వాహకులు ఎన్ని ఎత్తుగడలు వేసినా.. పేకమేడల్లా కూల్చేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.