Cyber Crime in Hyderabad : రూపాయితో రీఛార్జి అన్నారు.. రూ.11 లక్షలు కొట్టేశారు!

author img

By

Published : Oct 26, 2021, 8:23 AM IST

Cyber Crime in Hyderabad

రాష్ట్రంలో రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి లక్షలు కాజేస్తున్నారు. వీరి ఆగడాలకు ముఖ్యంగా యువత, వృద్ధులే బలవుతున్నారు. తాజాగా రూపాయితో రీఛార్జి చేసుకోవాలని చెప్పి.. ఓ వృద్ధుడు ఖాతా నుంచి ఏకంగా రూ.11 లక్షలు దోచేసిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది.

సైబర్ నేరగాళ్ల ఆగడాలకు పోలీసులు కూడా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కేటుగాళ్ల అరాచకాలకు అమాయకులు బలవ్వక తప్పడం లేదు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు.. కూతురి పెళ్లి కోసమో, కుమారుడి చదువు కోసమో, వ్యాపారం చేయాలనో కూడబెట్టుకున్న డబ్బంతా మోసం చేసి మాయం చేస్తున్నారు. ఈ సైబర్ నేరాలు రోజుకో రూపు మార్చుకుంటున్నాయి. కేవైసీ అప్​డేట్ చేయకపోతే ఖాతా రద్దవుతుందని భయపెడుతూ వివిధ బ్యాంకుల కస్టమర్లకు బ్యాంకులే మెసేజ్ చేస్తున్నట్లు చేసి వారి డబ్బు దోచుకుంటున్న వారు కొందరు. రీఛార్జి చేసుకోకపోతే ఫోన్ పనిచేయదంటూ భయపెట్టి అమాయకుల కష్టాన్ని కాజేసేవారు మరికొందరు.

రోజుకో పంథాలో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. వారి మాయమాటలను కనిపెట్టలేక అమాయకులు మోసపోతున్నారు. వారి కష్టార్జితమంతా దోచుకున్నాక గానీ.. మోసపోయామని తెలుసుకోలేకపోతున్నారు. గ్రహించాక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. రోజు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని మోసపోతున్నవారు ఎందరో ఉన్నారు. వీరు పోలీసులను ఆశ్రయించి కేసులు నమోదు చేసినా... రికవరీ మాత్రం చాలా స్వల్పంగా ఉంటోంది.

తాజాగా హైదరాబాద్​లో ఓ వృద్ధుడు రూ.11 లక్షలు మోసపోయిన ఘటన చోటుచేసుకుంది. రూపాయితో రీఛార్జి చేసుకోవాలని.. లేకపోతే చరవాణి పని చేయదని చెప్పి రూ.11 లక్షలు కాజేశారంటూ ఓ వయోధికుడు సోమవారం హైదరాబాద్‌ సైబర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎస్సై లచ్చిరెడ్డి కథనం ప్రకారం.. నగరానికి చెందిన ఓ వృద్ధుడు(70)కి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి.. ఓ నెట్‌వర్క్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. కొన్ని గంటల్లో మీ సిమ్‌కార్డు సేవలు రద్దవుతాయని.. వెంటనే రూపాయితో రీఛార్జి చేసుకోవాలని సూచించాడు. ఓ లింక్‌ పంపి వివరాలు పొందుపర్చాలన్నాడు. లింక్‌పై క్లిక్‌ చేసి, వివరాలన్నీ పొందుపరచగానే నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వృద్ధుడి ఖాతాలోంచి విడతల వారీగా రూ.11 లక్షలు విత్‌డ్రా అయ్యాయి. నిస్సహాయ స్థితిలో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.