Cyber Crime: వీడియో చూడండి.. ‘డబ్బు పొందండి’

author img

By

Published : Oct 15, 2021, 12:17 PM IST

Updated : Oct 15, 2021, 7:16 PM IST

Cyber Crime
సైబర్​ క్రైమ్ ()

ఇళ్లు, వాహనాలు, ఇతర వస్తువులు అమ్మడం చూశాం. ఇప్పుడు కొందరు వందలాది వెబ్‌సైట్లను విక్రయానికి పెట్టారు. అదీ కూడా ప్రత్యేక స్కీంలో అంటూ ఊదరగొట్టారు. వీటిల్లో అప్‌లోడ్‌ చేసే వీడియోలు చూస్తే చాలు.. డబ్బులే డబ్బులంటూ ‘సినిమా’ చూపించారు. హమ్మయ్యా.. అప్పులు తీరే మార్గం కనిపించిదంటూ ఓ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఎగిరి గంతేశాడు. తీరా చూస్తే.. సదరు కేటుగాళ్లు రూ.6.31 లక్షలకు టోకరా వేయడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.

ముంబయికి చెందిన బాధితుడు(35) ప్రస్తుతం గచ్చిబౌలీలో నివాసముంటున్నాడు. హైటెక్‌ సిటీలోని ఓ ప్రముఖ కంపెనీలో ఆపరేషన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న మిత్రుడి ద్వారా యాప్‌(ఎజోయిక్‌ యాడ్స్‌) గురించి తెలిసింది. దండిగా ఆదాయం వస్తుందని మిత్రుడు చెప్పడంతో రూ.వేయి చెల్లించి సభ్యత్వం తీసుకున్నాడు. సదరు కంపెనీ నిర్వాహకులు ఓ వెబ్‌సైట్‌ లింక్‌ పంపించారు. అందులో తరచూ వీడియోలు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఆ వీడియోలను ఒక్కోదాన్ని కనీసం 3 నిమిషాలు చూడాలి. అప్పుడు కంపెనీ నుంచి రూ.40 వినియోగదారుడి ఖాతాలో జమవుతాయి. కొన్ని రోజులు చెప్పినట్లుగానే డబ్బులొచ్చాయి. ఓ రోజు కంపెనీ నుంచి విల్సన్‌ అనే వ్యక్తి కాల్‌ చేశాడు. మీ ప్రదర్శన చాలా బాగుందంటూ మెచ్చుకున్నాడు. మీలాంటి వారి కోసం ప్రత్యేక స్కీంను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించాడు. మీరు ప్రస్తుతం చూస్తున్న వెబ్‌సైట్‌ మాదిరిగానే మరో 200 వెబ్‌సైట్లను రూ.2 లక్షలకు విక్రయిస్తున్నాం. అంటే.. ఒక్కోదానికి రూ.1,000 అంటూ వివరించాడు. రూ.1.9 లక్షలు రీఫండ్‌ కూడా ఇస్తామని చెప్పాడు.

అప్పులు తీర్చేందుకు 600 వెబ్‌సైట్లు...

దీంతో అప్పు చేసి రూ.6 లక్షలతో.. 600 వెబ్‌సైట్లు కొనుగోలు చేశాడు. రిఫండ్‌ కోసం అడిగితే వీఐపీ సభ్యత్వం తీసుకోవాలన్నారు. బాధితుడు రూ.20వేలు వెచ్చించి అదీ తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డబ్బులు జమ కాలేదు. అడిగితే.. మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూడటం లేదని చెప్పారు. ఆ తర్వాత మీ బ్యాంక్‌ ఖాతాపై ఆర్బీఐ నిఘా ఉందని, ఒకేసారి డబ్బులు జమ చేస్తే మీకే ఇబ్బందంటూ హెచ్చరించారు. మీ డెబిట్‌ కార్డు రిస్క్‌లో ఉందని..ఈ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు లీగల్‌, ఇతరత్రా ఖర్చులంటూ పలు దఫాలుగా మరో రూ.10వేలు జమ చేయించుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని అడుగుతుండటంతో బాధితుడికి అనుమానం వచ్చి వెబ్‌సైట్లను పరిశీలించాడు. నకిలీవని తేలడంతో మోసపోయినట్లు గ్రహించి ఫిర్యాదు చేశాడు.

ఇదీ చూడండి: Cyber crimes Types: ఫెస్టివల్ ఆఫరా.. స్పెషల్ గిఫ్ట్ వచ్చిందా? కాస్త ఆలోచించండి!

NUDE VIDEO CALLS: యువకుడిని బెదిరిస్తున్న యువతి.. డబ్బులివ్వకుంటే ఆ వీడియోలు బయటపెడతానని..

Cyber crime: సైబర్‌ మోసాలకూ స్పెషల్ కోచింగ్‌ సెంటర్లు.. పట్టణాల్లో బహిరంగంగానే...

OLX Cheating News:ఓఎల్​ఎక్స్​లో వస్తువులు కొంటామంటూ.. అమాయకులకు టోకరా

Last Updated :Oct 15, 2021, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.