ETV Bharat / crime

'అసలు అమ్మాయికి ఏమైంది?'

author img

By

Published : Oct 22, 2022, 10:25 AM IST

Inappropriate children behavior: బాగా తెలిసిన డ్రైవర్‌ ‘అంకులే’, రోజూ ముద్దుచేసే ‘బాబాయే’! సుద్ధులు నేర్పే ‘గురువే’ అంతా తెలిసినవాళ్లు, అయినవాళ్లు కాబట్టే ‘పాపాయి చెప్పిన కష్టాన్ని’ పట్టించుకోం. పైపెచ్చు ‘ఇలాగని ఎవ్వరితోనూ చెప్పకు’ అంటూ నోరూ నొక్కేస్తాం. పెద్దల తీరు పసిహృదయాల భవిష్యత్తుని గాయపరచకుండా ఉండాలంటే, మన బాధ్యత ఏంటో తెలుసుకుందాం..

Inappropriate behavior towards children
Inappropriate behavior towards children

Inappropriate children behavior: భోపాల్‌లోని ఓ స్కూల్‌ బస్సు డ్రైవరు మూడున్నరేళ్ల నర్సరీ చిన్నారిపై కర్కశంగా, అనుచితంగా ప్రవర్తించాడు. మధ్యప్రదేశ్‌, హరియాణా, నోయిడా, తాజాగా హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనల గురించే విన్నాం. డ్రైవర్‌ స్థానంలో క్లీనర్‌, టీచర్‌, బాబాయి, తాతయ్య ఎవరైనా ఉండొచ్చు. ఇలాంటివి విన్నప్పుడు అమ్మగా మన గుండె ఝల్లుమంటుంది. ఆ స్థానంలో ఒక్క నిమిషం మన బిడ్డని ఊహించుకున్నా ప్రాణం విలవిల్లాడుతుంది.

కానీ ఇలాంటి ఘటనలే మన ఇంట్లో, మనకి కావాల్సిన వాళ్లకి జరగవని కచ్చితంగా చెప్పగలమా? ఎందుకంటే, దేశవ్యాప్తంగా ఏటా వేలమంది పసికందులు ఇలాంటి పైశాచికాలకే బలైపోతున్నారని నేషనల్‌ క్రైం రికార్డ్సు బ్యూరో సమాచారం చెబుతోంది. 2020లో నమోదైన పోస్కో కేసులే 47,221 కాగా, కోర్టుల్లో ఇప్పటివరకూ ట్రయల్‌ కోసం ఎదురు చూస్తున్నవి 1,70,271.

మొదటి పని అదే: ఇలాంటి వేధింపులు తెలిసినవారు, దగ్గరివాళ్ల నుంచే ఎదురవుతాయి. పిల్లలు చెబితే, ‘ఛ ఊరుకో’ అని కొట్టిపారేస్తాం. ‘ఇంకెవరికీ చెప్పొద్దు.. పరువు పోతుందంటాం’. ఇవి రెండూ తప్పే. చిన్నపిల్లలు నాకిలా జరుగుతోందన్నారంటే నమ్మాలి. నీకు మేమున్నాం అన్న భరోసానివ్వాలి. ఆ వాతావరణం నుంచి వాళ్లని దూరం చేసే మార్గాలు వెతకాలి. ఇది అమ్మానాన్నల మొదటి బాధ్యత. పసిపిల్లలు నోరుతెరిచి తమపై జరుగుతున్న అఘాయిత్యం గురించి చెప్పలేరు.

ఆ బాధ్యతని తల్లిదండ్రులుగా మనమే తీసుకోవాలి. చిన్నారుల హావభావాలు, ప్రవర్తనలో చిన్న తేడా కనిపించినా వెంటనే ఆరా తీయాలి. ఒంటరిగా మసలుతున్నా, ముభావంగా ఉంటున్నా మామూలే అని సరిపెట్టుకోవద్దు. రోజూ స్కూల్‌ నుంచి వచ్చిన వెంటనే ఆడుకోవడం, హుషారుగా ఇల్లంతా తిరగడం, టీవీ చూడటం వంటి దినచర్యలని వాళ్లు చేయడం లేదేంటే వాళ్లకేదో కష్టం వచ్చిందని గుర్తించాలి. తమ కష్టాన్ని ఎవరితో చెప్పాలో తెలియక, అసలు చెప్పొచ్చో లేదో అనే సంశయంతో తల్లడిల్లుతూ ఉంటారు.

అమ్మతో చెబితే తిడుతుందేమో, ‘టీచర్‌కి చెబితే అందరి ఎదురుగా ఏమైనా అంటారేమో’ వంటి అనుమానాలు, భయాలతో పిల్లలు నోరు విప్పరు. మనసులోని బాధని ఎవరితోనూ పంచుకోలేక లోలోపల కుమిలి పోతుంటారు. దీనికి పరిష్కారం ఒక్కటే! ఇంట్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు పిల్లల్లో ధైర్యం నింపాలి. నీకు మేమున్నాం అనే భరోసా ఇవ్వాలి.

వాళ్లూ కావొచ్చు: పిల్లలపై వేధింపులకు పాల్పడేవాళ్లు మన చుట్టూ ఎందుకు ఉంటారులే అనుకోవద్దు. ఎందుకంటే మనకు బాగా తెలిసిన ఆటో, స్కూల్‌బస్‌ డ్రైవర్లు, వాళ్లతో ఉండే సిబ్బంది, తెలిసిన వాళ్లు, బంధువుల ముసుగులో కూడా వీళ్లు ఉండొచ్చు. తల్లిదండ్రుల అప్రమత్తతే దీనికి పరిష్కారం. అలాగే పిల్లలకు కూడా ఈ విషయంలో చెడుని గుర్తించే శిక్షణ అవసరం. తమకి నచ్చని విషయాన్ని గుర్తించి, ఎదిరించే ధైర్యాన్ని చిన్నారుల్లో నింపాలి.

పిల్లలు ఇలా చేస్తుంటే: లైంగిక వేధింపులు ఎదుర్కొన్న చిన్నపిల్లల్లో, బాధను వివరించగల సామర్థ్యం ఉండకపోవచ్చు. అందుకే కడుపులో నొప్పనో, ఫలానా చోట ఇబ్బందనో చెబుతుంటారు. కారణం లేకుండానే ఏడ్చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని మనమూ ఊహించం. అందుకే మనవద్ద ఉన్న మందుల్ని వేయడమో, చికిత్సలు చేయడమో చేస్తుంటాం. అయినా ఫలితం ఉండట్లేదంటే మాత్రం వేధింపుల దిశగా ఆలోచించాలి.

కొత్తవాళ్లను చూసి భయపడటం, ఎవరితోనూ కలవలేకపోవడం, మౌనంగా ఉండిపోవడం వంటివి చేస్తుంటారు. కొందరిలో వణుకు వస్తుంది. ఫిట్స్‌ వస్తాయి. కొన్ని అవయవాలు పనిచేయవు. అందరిలోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయని కాదు. డిప్రెషన్‌, ఆందోళన, ఫోబియా, తిన్నదేదీ సహించకపోవడం వంటివీ జరగొచ్చు. కాస్త పెద్దపిల్లలయితే ఒంటిని గాయపరచుకోవడం వంటివి చేస్తుంటారు. మనసులోని వేదనని ఇలా వ్యక్తపరుస్తుంటారు. అమ్మానాన్న ఎంత ధైర్యమిచ్చినా చిన్నారులకి ఇదో పెద్ద సంక్షోభం.

త్వరగా బయటపడలేరు. కాబట్టి, నిపుణుల సాయం తప్పనిసరి. వయసు, తీవ్రత బట్టి వాళ్లు చికిత్సను సూచిస్తారు. దీని నుంచి వెంటనే బయటపడతారని చెప్పలేం. సమయం పడుతుంది. పిల్లలకు ఇలా జరిగినప్పుడు తల్లిదండ్రుల్లోనూ బాధ ఉంటుంది. అయితే దాన్ని వాళ్ల ముందు ప్రదర్శించకూడదు. తమ వల్లే ఇలా జరిగిందంటూ కుంగిపోయే అవకాశముంది. అందుకే పిల్లల ముందు ధైర్యంగానే ఉండాలి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.