బైక్ లిఫ్ట్‌ ఘటన..: అంతా పక్కా ప్రణాళికతోనే.. విచారణలో విస్తుపోయే నిజాలు..

author img

By

Published : Sep 22, 2022, 7:47 AM IST

injection murder case end

Khammam bike lift incident: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంజక్షన్‌ హత్య కేసును 48 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం కారణంగా భర్తను చంపేందుకు భార్యనే కుట్ర పన్నిందని నిర్ధారించారు. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్‌ వేసి హతమార్చినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు.

ఇంజిక్షన్​ హత్య కేసును చేధించిన పోలీసులు

Khammam bike lift incident: ఖమ్మం జిల్లాలో జరిగిన ఇంజక్షన్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్‌ను అతడి భార్య ప్రియుడితో కలిసి హతమార్చిందని పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని నిర్ధారించారు. జమాల్‌ సాహెబ్‌ తాపీ పని చేసేవాడు. అతడి భార్య షేక్‌ ఇమామ్​బీ వ్యవసాయ కూలీలను తీసుకెళ్లే ముఠామేస్త్రీ పనులు నిర్వర్తిస్తుంది. నిత్యం కూలీలను తరలించే క్రమంలో నామవరానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్ రావుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఓ రోజు ఇంట్లో ఇద్దరిని చూసిన జమాల్ సాహెబ్.. భార్యను మందలించారు. దీంతో అడ్డుగా ఉన్న భర్తను అంతమొందించేందుకు ఇమామ్​బీ పథకం వేసిందని పోలీసులు పేర్కొన్నారు.

మొదట ప్రయత్నం విఫలం: హత్య చేసినా దొరక్కుండా ఉండేందుకు ఇరువురు ప్రణాళికలు రచించారు. ఈ క్రమంలో మోహన్ రావు, ఆర్​ఎంపీ బండి వెంకన్నను కలిసి మనిషిని చంపే ఇంజక్షన్ కావాలని అడిగాడు. ఈ విషయాన్ని ఆర్​ఎంపీ తన స్నేహితుడు యశ్వంత్‌కు చెప్పి ఇంజక్షన్ తీసుకురావాలని కోరాడు. యశ్వంత్​ సాంబశివరావు అనే వ్యక్తి ద్వారా ఓ ప్రైవేటు ఆస్పత్రి నుంచి రెండు నియోవెక్ అనే ఇంజక్షన్​లు తెప్పించాడు. వీటిని ఇమామ్​బీకి చేరవేశారు. జమాల్‌కు తొలుత నిద్ర మాత్రలు ఇచ్చి తర్వాత ఇంజక్షన్ వేయాలని సూచించారు. ఇంజక్షన్‌ ఇచ్చేందుకు కుదరకపోవటంతో మళ్లీ మోహన్‌రావుకు తిరిగి పంపించింది. ఈ నెల 19న సాహెబ్‌ ఊరు వెళ్తున్నాడని సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. వాహనం నెంబర్‌, చొక్కా రంగు, సమయం వివరాలు చెప్పిందని వెల్లడించారు. పథకం ప్రకారం లిఫ్ట్‌ అడిగిన నిందితులు.. ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేశారని పేర్కొన్నారు.

హత్య కేసులో భాగమైన అందరిపై కేసులు..: ఈ కేసులో ఏ-1 గా గోదా మోహన్ రావు, ఏ-2 బండి వెంకన్న, ఏ-3 నర్సింశెట్టి వెంకటేశ్, ఏ4 షేక్ ఇమామ్​బీ, ఏ5 బందెల యశ్వంత్, ఏ6 పోరళ్ల సాంబశివరావులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 ద్విచక్రవాహనాలు, 6 సెల్ ఫోన్లతో పాటు ఉపయోగించిన సిరంజి స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ తెలిపారు. వాడకుండా ఉంచిన మరో ఇంజక్షన్‌, సిరంజ్‌, స్టెరైల్‌ వాటర్‌ బాటిల్‌ను గుర్తించామని పేర్కొన్నారు. నిందితుల విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ హత్య కేసును 48 గంటల్లోనే చేధించిన సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.