ETV Bharat / crime

CV Anand on drugs: 'డ్రగ్స్​ బాధితుల కోసం రిహాబిలిటేషన్​ సెంటర్స్​తో ఎంవోయూ'

author img

By

Published : May 6, 2022, 4:38 PM IST

Updated : May 6, 2022, 6:58 PM IST

cv anand: 'డ్రగ్స్​ బాధితుల కోసం రిహాబిలిటేషన్​ సెంటర్స్​తో ఎంవోయూ'
cv anand: 'డ్రగ్స్​ బాధితుల కోసం రిహాబిలిటేషన్​ సెంటర్స్​తో ఎంవోయూ'

CV Anand on drugs: డ్రగ్స్​ బాధితులకు సహాయం చేసేందుకు రిహాబిలిటేషన్​ సెంటర్స్​తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు హైదరాబాద్​ సీపీ సీవీ ఆనంద్​ వెల్లడించారు. డ్రగ్స్​ బాధితులు మంచి పౌరులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు గంజాయి సరఫరా చేస్తున్న ఓ నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్​ చేసినట్లు సీపీ వెల్లడించారు.

CV Anand on drugs: మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి సహాయం చేసేందుకు హైదరాబాద్​ పోలీసులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 4 రిహాబిలిటేషన్‌ సెంటర్స్‌తో హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్​కు బానిసైన వారిని రిహాబిలిటేషన్​ సెంటర్స్​కు తరలిస్తామని సీపీ వెల్లడించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు డ్రగ్స్​ తీసుకునే 377 మందిని అరెస్ట్​ చేశామన్నారు. డ్రగ్స్​ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన వారిపైనా నిఘా పెట్టినట్లు వివరించిన ఆయన.. డ్రగ్స్​ బాధితులు జైలు నుంచి వచ్చాక మంచి పౌరులుగా ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'రిహాబిలిటేషన్​ సెంటర్స్​తో ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఈ రిహాబిలిటేషన్​ ప్రాసెస్​ నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ సెంటర్స్​లో వారానికి రెండుసార్లు డ్రగ్స్​ బాధితులకు కౌన్సెలింగ్​ నిర్వహిస్తారు. ఎవరికైతే అడ్మిట్​ అవసరమో.. అలాంటి వారిని అడ్మిట్​ చేసుకుని కౌన్సెలింగ్​ ఇస్తారు.' -సీవీ ఆనంద్​, హైదరాబాద్​ సీపీ

గంజాయి ముఠా అరెస్ట్​..: మరోవైపు మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్​ చేసినట్లు సీపీ వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 225 గ్రాముల బ్రౌన్‌ షుగర్‌, 28 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్​కు గంజాయి తరలిస్తున్న ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టయిట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షహ్జదా ఇప్పటికే ముంబయిలో పోలీసులకు పట్టుబడినట్లు సీపీ పేర్కొన్నారు.

ముంబయికి చెందిన షహ్జదా.. బహదూర్​పురాకు చెందిన షేక్‌ అబ్దుల్‌ ఆలం ఖాద్రి, ఉప్పల్​ వాసి షేక్‌ ఖాసిం, చాంద్రాయణగుట్టకు చెందిన షాహీద్‌ కమల్‌ కలిసి ఓ ముఠాగా ఏర్పడి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. 'బిస్కెట్లు విక్రయించే వ్యాపారం చేసుకునే అబ్దుల్‌ ఆలం ఖాద్రి.. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో ముంబయి వాసి షహ్జదాతో పరిచయం ఏర్పడింది.

షహ్జదా తనకు గంజాయి కావాలని.. ముంబయిలో విక్రయిస్తానని ఖాద్రికి తెలిపాడు. దాంతో మరికొంతమంది అనుచరులతో కలిసి ఖాద్రి.. విశాఖ పట్నానికి చెందిన రమేశ్​ అనే వ్యక్తి సహాయంతో కిలో గంజాయి రూ.8 వేల చొప్పున కొనుగోలు చేసి ఇచ్చేవాడు. ఈ గంజాయితో షహ్జదా ముంబయిలో మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే షహ్జదా.. ఖాద్రి ఇరువురి మధ్య గంజాయి, మాదక ద్రవ్యాల బదిలీ ఒప్పందం కుదిరింది. షహ్జదాకు అవసరమైన గంజాయిని ఖాద్రి ఇస్తే.. ఖాద్రికి అవసరమైన మాదక ద్రవ్యాలు షహ్జదా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు' అని సీపీ తెలిపారు.

వారితో కలిసి పని చేస్తాం..: ఈ మేరకు ముఠా గురించి సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బహదూర్‌పురాలో వలపన్ని పట్టుకున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల కట్టడికి నార్కోటిక్‌ బ్యూరో, డీఆర్‌ఐ, ఎన్‌సీబీ అధికారులను సమన్వయం చేసుకుని పని చేయనున్నట్టు తెలిపారు. మాదక ద్రవ్యాల మూలాలపైనా నిఘా పెడుతున్నట్టు ఆయన స్పష్టం చేశారు.

ఇవీ చూడండి..

Prisoner Escapes from Court: పోలీసుల కళ్లుగప్పి కోర్టు నుంచి జీవిత ఖైదీ పరారీ

కథ అడ్డం తిరిగింది.. కటకటాల పాలయ్యారు

Last Updated :May 6, 2022, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.