ETV Bharat / crime

foreign drugs: చిక్కేది చిటికెడు దొరకనిది దోసెడు.. విదేశీ డ్రగ్స్​ కట్టడిపై ఆందోళన​..

author img

By

Published : Feb 23, 2022, 4:39 AM IST

foreign drugs: విదేశాల నుంచి భారీగా మత్తుపదార్థాలు దిగుమతి అవుతున్న సంఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రాన్ని మత్తు విముక్తం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి రూపంలో పెనుసవాలు ఎదురవుతోంది. పైగా ఇప్పటి వరకూ కొకైన్‌ లాంటి ఖరీదైన మత్తుమందులు మాత్రమే దిగుమతి అయ్యేవని భావించేవారు. కాని మొట్టమొదటిసారి అమెరికా నుంచి గంజాయి దిగుమతి అయినట్లు నార్కొటిక్స్‌ కంట్రోల్‌బ్యూరో (ఎన్సీబీ) గుర్తించడంతో మత్తుమందుల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.

hyderabad police alert on foreign drug import
hyderabad police alert on foreign drug import

foreign drugs: మత్తు పదార్థాలకు రాష్ట్రంలో చోటుండకూడదన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసు, ఆబ్కారీశాఖలు స్థానికంగా ఉత్పత్తి, రవాణా, వినియోగంపైనే దృష్టి సారిస్తున్నాయి. గంజాయి సాగయ్యే ప్రాంతంలో ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం, అనుమానాస్పదంగా ఉన్న వాహనాలను తనిఖీ చేయడం వంటి వాటి ద్వారా చాలా వరకూ గంజాయిని పట్టుకోగలుగుతున్నారు. అలాగే హైదరాబాద్‌ చుట్టుపక్కల మూతపడ్డ ఔషధ కంపెనీలన్నింటిపైనా పోలీసులు కన్నేశారు. తద్వారా రసాయన మత్తుమందుల ఉత్పత్తి అదుపులోకి వస్తుందని భావిస్తున్నారు. కానీ విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మాదకద్రవ్యాల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.

గత కొంతకాలంగా విదేశాల నుంచి హైదరాబాద్‌కు భారీ స్థాయిలో మత్తుమందులు దిగుమతి అవుతున్నాయని అధికారులు గుర్తించారు. గత ఏడాది కేవలం నెల రోజుల వ్యవధిలోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.వంద కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న మత్తుమందులకు సంబంధించిన సమాచారం కస్టమ్స్‌, డీఆర్‌ఐ, ఎన్సీబీ సంస్థలకు మాత్రమే ఉంటుంది. కేవలం మత్తుమందుల నియంత్రణ విధులు నిర్వర్తించే ఎన్సీబీకి హైదరాబాద్‌లో కేవలం ఇద్దరు మాత్రమే అధికారులు ఉన్నారంటే ఈ సంస్థ పనితీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ మూడు సంస్థలు కూడా వివిధ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల నుంచి సమాచారం అందినప్పుడు మాత్రమే అనుమానితులను తనిఖీ చేస్తున్నాయి.

శనివారం(ఫిబ్రవరి 19న) ఎన్సీబీ అధికారులు లక్డీకపూల్‌లోని ఓ కొరియర్‌ కార్యాలయంలో అమెరికా నుంచి దిగుమతి అయిన గంజాయిని పట్టుకున్నారు. హైదరాబాద్‌ విమానాశ్రయంలోని కస్టమ్స్‌ అధికారులు మాత్రం దీన్ని గుర్తించలేకపోయారు. ఇలా పెద్దమొత్తంలో మత్తుమందు కళ్లుగప్పి వినియోగదారులకు చేరుతోందని, కిలో దొరికితే పది కిలోలు తనిఖీలు తప్పించుకుంటోందని అధికారులే అంగీకరిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.