Cheating in petrol bunks: 'చిప్​' మాయాజాలం.. పెట్రోల్​ బంకుల్లో ఈ మోసం మీకు తెలుసా?

author img

By

Published : Oct 7, 2021, 5:15 PM IST

Updated : Oct 8, 2021, 9:55 AM IST

Cheating in petrol bunks
Cheating in petrol bunks ()

పెట్రోల్‌ పోసే యంత్రాల్లో చిప్‌లు అమరుస్తూ వాహనదారులను బురిడీ కొట్టిస్తున్న ఘరానా మోసగాళ్ల ముఠా సైబరాబాద్‌ పోలీసులకు చిక్కింది. పెట్రోల్‌ బంక్​లలో (petrol bunk) పనిచేసే వారితో కలిసి ముఠా మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటకలో ముఠా పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడింది. ముఠా సభ్యులంతా గతంలో పెట్రోల్‌ బంకుల్లో పనిచేసి ఈ తరహా మోసాల్లో ఆరితేరినట్టు దర్యాప్తులో బయటపడింది.

మీరేదైనా పెట్రోల్‌ బంక్‌కు (petrol bunk) వెళ్లారా...? వాహనంలో పెట్రోల్‌ పోయించారా...? తస్మాత్‌ జాగ్రత్త! మీరు పోయించుకున్నంత పెట్రోల్‌ ఉండకపోవచ్చు. కానీ పెట్రోల్‌ యంత్రంలో మాత్రం లీటరు పోయిస్తే లీటర్‌... ఎంత పోయిస్తే అంత పోయించినట్టు చూపుతుంది. కానీ పోయించినంత పెట్రోల్‌ మీ వాహనంలో ఉండకపోవచ్చు. ఎలా సాధ్యం అనుకుంటున్నారా... పెట్రోల్‌ పోసే యంత్రంలో మార్చిన సాఫ్ట్‌వేర్‌ సంబంధిత చిప్‌ను అమర్చడం ద్వారా వాహనదారులను మోసం చేస్తోంది ఓ ముఠా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాల్లోని వివిధ పెట్రోల్‌ బంక్‌ యాజమానులతో కుమ్మక్కై ముఠాకు చెందిన నలుగురు సభ్యులు యధేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. కొందరు వాహనదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులతో అప్రమత్తమైన సైబరాబాద్‌ ఎస్వోటీ, మేడ్చెల్‌, జీడిమెట్ల పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఘరానా మోసగాళ్ల ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు నాలుగు పెట్రోల్‌ బంక్‌లలో పనిచేసే మేనజర్లను కూడా అరెస్టు చేశారు.

పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశాం. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో పెట్రోల్ బంకుల్లో ముఠా మోసాలకు పాల్పడుతోంది. సాఫ్ట్‌వేర్ రూపొందించి తక్కువ పెట్రోల్ వచ్చేలా మోసాలు చేస్తున్నారు. 34 పెట్రోల్ బంకుల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం.

- పద్మజ, బాలానగర్ డీసీపీ

నిందితులంతా గతంలో పెట్రోల్‌ బంక్‌ల్లో పనిచేసినట్టు పోలీసులు దర్యాప్తులో బయటపడింది. జగద్గిరిగుట్టకు చెందిన ఫైజల్ బారీ, సందీప్‌, అస్లం, నర్సింగ్‌రావు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. గతంలో బంకుల్లో పనిచేయడంతో వీరికి చిప్‌లు అమర్చి ఎలా మోసం చేయాలో అవగాహన ఉంది. జీడిమెట్ల, మైలార్‌దేవ్‌పల్లి, జవహర్‌నగర్‌, మేడిపల్లి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్‌నగర్‌, నెల్లూరు, సూర్యపేట, సిద్దిపేట, తదితర ప్రాంతాల్లోని పెట్రోల్‌ బంకుల్లో మోసాలకు పాల్పడినట్టు బాలనగర్‌ డీసీపీ పద్మజ తెలిపారు. ఈ ముఠాతో పాటు పెట్రోల్‌ బంకుల్లో పనిచేసే వంశీధర్‌రెడ్డి, రమేష్‌, మహేశ్వర్‌రావు, వెంకటేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఆరు ద్విచక్ర వాహనాలు, రెండు కార్లు, ఎలక్‌ట్రానిక్‌ చిప్‌లు, మథర్‌ బోర్డులు పెద్దె ఎత్తున ఎలక్‌ట్రానిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.

గతంలో నిందితులు పెట్రోల్ బంకుల్లో పనిచేశారు. బంకుల యజమానులు, నిందితులు కుమ్మక్కయ్యారు. నలుగురు నిందితులు బంకుల్లో చిప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రూపొందించి బంకుల్లో ఇన్‌స్టాల్ చేస్తున్నారు. చిప్ ఏర్పాటుతో లీటర్‌కు 30-50 మిల్లీలీటర్లు తక్కువగా వస్తోంది. తెలంగాణలో 6 పెట్రోల్ బంకుల్లో మోసాలు చేశారు. ఏపీ, కర్ణాటకలో 28 బంకుల్లో మోసాలకు పాల్పడ్డారు.

- పద్మజ, బాలానగర్ డీసీపీ

పెట్రోల్‌ బంకుల్లో మోసాలు జరుగుతున్నట్టు వాహనదారులకు అనుమానం వస్తే వెంటనే పోలీసులను, తూనికలు కొలతల శాఖ అధికారులను సంప్రదించాలని ఉన్నతాధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులను కస్టడీలోకి తీసుకొని విచారించాలని పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated :Oct 8, 2021, 9:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.