పాలమూరు లిఫ్ట్ పనుల్లో‌ అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం

author img

By

Published : Jul 29, 2022, 7:42 AM IST

Updated : Jul 30, 2022, 3:17 AM IST

పాలమూరు లిఫ్ట్ పనుల్లో‌ అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం

07:40 July 29

పాలమూరు లిఫ్ట్ పనుల్లో‌ అపశ్రుతి.. ఐదుగురు కూలీలు దుర్మరణం

  • పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రమాదం జరిగి ఐదుగురు దుర్మరణంపాలుకావడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మృతులకుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

    — Revanth Reddy (@revanth_anumula) July 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Accident in Palamuru Lift Works : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంపుహౌస్‌లో పని చేస్తున్న ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం ఎల్లూరు శివారులోని రేగుమాన్‌గడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-1 పనులు నడుస్తున్నాయి. పంపుహౌస్‌ పనుల్లో భాగంగా భూఉపరితలానికి దాదాపు 100 మీటర్ల లోతులో టన్నెల్‌ లైనింగ్‌, కేబుల్‌ కనెక్షన్లు, ఎర్తింగ్‌ పనులు చేపడుతున్నారు.దీనికి సంబంధించిన నిర్మాణ సామగ్రిని ఇనుప బకెట్‌ ద్వారా క్రేన్‌ సాయంతో కిందకు దింపుతుండగా గురువారం రాత్రి 10- 10.30 గంటల మధ్య తీగ తెగి కార్మికులపై బకెట్‌ (సుమారు 50 మీటర్ల ఎత్తు నుంచి) పడటంతో అయిదుగురు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని నిడదవోలుకు చెందిన శ్రీను (42), ఝార్ఖండ్‌కు చెందిన బోనేనాథ్‌ (42), ప్రవీణ్‌ (38), కమలేష్‌ (36), బిహార్‌కు చెందిన సెక్యూరిటీ గార్డు సోనుకుమార్‌ (36) మృతుల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లాల్‌ బల్వీందర్‌సింగ్‌ గాయాలతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరు కూలీలు దూరంగా ఉండటంతో వారికి ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు, గుత్తేదారు ఏజెన్సీ సంస్థ ప్రతినిధులు గోప్యంగా ఉంచారు. మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఈ విషయాలు ఎక్కడా బయటకు చెప్పవద్దని, దీని గురించి మాట్లాడితే పని నుంచి తొలగిస్తామని గుత్తేదారు ఏజెన్సీ ప్రతినిధులు హెచ్చరించినట్లు కొందరు కార్మికులు చెబుతున్నారు. కొందరు కూలీల ద్వారా శుక్రవారం వివరాలు తెలిశాయి.

తుప్పు పట్టినా పట్టించుకోలేదు?: ఈ ప్రమాదానికి అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఏజెన్సీ సంస్థ నిర్లక్ష్యం కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. పంపుహౌస్‌కు నిర్మాణ సామగ్రిని పంపించే క్రేన్‌కు సంబంధించిన తీగలు తుప్పు పట్టినట్లు కూలీలు ఆరోపిస్తున్నారు. ఈ క్రేన్‌ పాతబడిందని..ఈ ప్రమాదకర పరిస్థితిలో తాము పని చేయలేమని కొందరు కార్మికులు గతంలో అధికారులు, ఏజెన్సీ ఇంజినీర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయినా బలవంతంగా పనులు చేయిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్యాకేజీ-1వద్ద బిహార్‌, ఝార్ఖండ్‌, అస్సాం, ఏపీకి చెందిన సుమారు 2వేల మంది పనిచేస్తున్నారు.

జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే ఉన్నా..: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను ఆపివేయాలని గతంలో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా పనులు చేయడం లేదంటూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ ప్రమాద ఘటనతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు.. రాత్రి 8 నుంచి ఉదయం 8 వరకు మరొకటి చొప్పున రెండు షిప్టుల వారీగా పనులు చేస్తున్నామని కార్మికులు చెబుతున్నారు.

ఇంత ఘోర ప్రమాదం జరిగినా శుక్రవారం ఉదయం నుంచి సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు సంఘటన స్థలంలో లేకపోవడం గమనార్హం. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1.5 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసి సంఘటన స్థలానికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వడానికి సాగునీటి అధికారులు ముందుకు రాలేదు. కొల్లాపూర్‌ ఆర్డీవో హనుమానాయక్‌ను అడగ్గా గురువారం రాత్రి ప్రమాదం జరిగిందని..అయిదుగురు మృతి చెందారని చెప్పారు.

ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలి: ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు డిమాండ్‌ చేశారు. ఆయన ఉస్మానియా మార్చురీలో ఉన్న కూలీల మృతదేహాలను పరిశీలించారు.కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.

విచారణ జరపాలి: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ రాష్ట్ర ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ సంబంధిత గుత్తేదారుపై క్రిమినల్‌ కేసులు పెట్టాలన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని.. కాంట్రాక్టు ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో కోరారు.

Last Updated :Jul 30, 2022, 3:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.