దివ్యాంగ యువకుడి ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమా..?

author img

By

Published : Jul 29, 2022, 11:18 AM IST

దివ్యాంగ యువకుడి ఆత్మహత్య.. పోలీసుల వేధింపులే కారణమా..?

Suicide: ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పురుగుల మందు తాగి దివ్యాంగ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే..?

Suicide: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో దివ్యాంగ యువకుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపులే అందుకు కారణమని అతడి తల్లిదండ్రులు ఆరోపించారు. అనంతసాగరం మండలం గుడిగుంట్లకు చెందిన పొట్టపల్లి శ్రీనివాసులు, లక్ష్మమ్మ ఉపాధి నిమిత్తం చుంచులూరుకు తమ కుమారుడు తిరుపతితో కలసి వచ్చారు. కృష్ణమూర్తి అనే వ్యక్తి పొలానికి కాపలా ఉంటూ అక్కడే నివాసం ఉంటున్నారు. సరిగా నడవలేని తిరుపతి.. ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆంజనేయరెడ్డి అనే వ్యక్తి పొలానికి వేసిన రక్షణ కంచె చోరీ అయింది. దీనిపై వారం రోజులుగా విచారణ కోసం తిరుపతిని స్టేషన్‌కు పిలిచి, ఎస్సై రెండుసార్లు కొట్టి పంపారని తల్లిదండ్రులు ఆరోపించారు.

గురువారం కూడా స్టేషన్‌కు పిలవడంతో భయంతో తిరుపతి పురుగుల మందు తాగాడని ఆవేదన చెందారు. పోలీసుల వేధింపులతోనే ఇలా చేసుకున్నాడని విలపించారు. తిరుపతి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ పోలీసులు అడ్డుకుని ఎంత డబ్బు అయినా పెట్టుకుంటామని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు.

‘దివ్యాంగుడి మృతిపై విచారణకు ఆదేశించాం. విచారణ అధికారిగా అదనపు ఎస్పీ చౌడేశ్వరిని నియమించాం. పోలీసులు తరఫున ఏమైనా ఇబ్బందులు జరిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఎస్పీ విజయరావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.