Cyber Crimes in Telangana : అప్పు ఇస్తామంటూ.. నిండా ముంచేస్తున్నారు

author img

By

Published : Nov 2, 2021, 9:55 AM IST

Cyber Crimes in Telangana

చిరు వ్యాపారులు, నిరుద్యోగులు, గృహిణులను కేటుగాళ్లు లక్ష్యంగా చేసుకుని నిండా ముంచేస్తున్నారు. జన్‌ధన్‌ యోజన, ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ ప్రోగ్రాం(పీఎంఈజీపీ) తదితర పథకాల కింద రాయితీపై మేం రుణాలిస్తాం.. మీరు వ్యాపారాలు చేసుకోండంటూ తెలివిగా వల విసిరి జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ తరహా ఫిర్యాదుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిందని సైబరాబాద్‌ పోలీసులు పేర్కొంటున్నారు.

జన్‌ధన్‌యోజన(Jan Dan Yojana Loans) కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారికి ఫోన్‌ చేసి అధికారుల మాదిరిగా ముఖాముఖి చేసి.. ధ్రువపత్రాలు పంపించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత మీకు రుణం మంజూరైంది. కాకపోతే.. దరఖాస్తు, బ్యాంక్‌, లీగల్‌ తదితర ఛార్జీలను భరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇలా పలు దఫాలుగా డబ్బులు వసూలు చేసి మంజూరైనట్లు నకిలీ లేఖలను వాట్సాప్‌లో పంపిస్తున్నారు. నాలుగైదు రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు జమవుతాయంటూ నమ్మబలుకుతున్నారు. తిరిగి కాల్‌ చేస్తే స్విచ్ఛాఫ్‌ వస్తోంది. ఈ తరహాలోనే జగద్గిరిగుట్ట ఠాణా పరిధిలోని ఓ గృహిణి నుంచి రూ.22,800 కొల్లగొట్టారు(Cyber Crimes in Telangana). పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అతి తక్కువ వడ్డీ.. 30 శాతం రాయితీ

మీకు పీఎంఈజీపీ(PMEGP loans) కింద రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు రుణం మంజూరైంది. అతి తక్కువ వడ్డీ.. అందులోనూ 30 శాతం రాయితీ ఉంటుంది. 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు కట్టుకోవచ్చంటూ కాల్‌ సెంటర్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. మేం దరఖాస్తు చేసుకోలేదు..? కదా అంటే మేమే ఎంపిక చేశామంటూ సమాధానమిస్తున్నారు. రూ.4200 నుంచి రూ.5వేల వరకు వసూలు చేసి ‘లోన్‌ అగ్రిమెంట్‌’ వాట్సాప్‌లో పంపుతున్నారు. వాటిపై సంతకం పెట్టి స్కాన్‌ చేసి తిరిగి మెయిల్‌ ద్వారా పంపించాలని సూచిస్తున్నారు. ఇక్కడి నుంచే అసలు కథ నడిపిస్తున్నారు. ముగ్గురు, నలుగురు అధికారులు సంతకం పెట్టాలి. ఒకరే పెట్టారు. మిగిలిన వారు మీకే నేరుగా కాల్‌ చేస్తారని చెబుతున్నారు. అలా కాకుండా కొన్ని డబ్బులు కడితే పని అయిపోతుందంటూ నమ్మించి జేబులు ఖాళీ(Cyber Crimes in Telangana) చేస్తున్నారు. ఈ తరహాలోనే అల్వాల్‌ ఠాణా పరిధిలోని ఓ బాధితుడు ఏకంగా రూ.1.17 లక్షలు మోసపోయాడు.

‘ముద్ర లోన్‌ సర్వీస్‌’ నుంచి మాట్లాడుతున్నామంటూ..

ఎవరైనా గూగుల్‌లో పీఎంఈజీపీ రుణాల కోసం వెతికితే.. కొన్ని వెబ్‌సైట్లు కనిపిస్తాయి. అక్కడ మన వివరాలు నమోదు చేసుకుంటే ‘ముద్ర లోన్‌ సర్వీస్‌(Mudra Loan Services)’ నుంచి కాల్‌ వస్తుంది. ధ్రువపత్రాలను వాట్సాప్‌లో పంపించాలని చెబుతారు. ఒకటి, రెండ్రోజుల తర్వాత వివిధ ఛార్జీలను కట్టాలని సూచిస్తారు. ఆ ప్రక్రియ పూర్తి కాగానే ‘ముద్ర లోన్‌’ మంజూరైనట్లు మెయిల్‌ పంపుతున్నారు. ఈ తరహాలోనే అల్వాల్‌ ఠాణా పరిధిలోని ఓ నిరుద్యోగి నుంచి రూ.35490 వసూలు చేసి పత్తా లేకుండా పోయాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.