ETV Bharat / crime

రీఛార్జి​, హోంవర్క్‌ చేస్తే డబ్బులంటూ.. లక్షలు స్వాహా ..

author img

By

Published : Jun 22, 2022, 10:03 AM IST

Cyber Fraud: టెక్నాలజీ మనిషి జీవితాన్ని చాలా సులభం చేసింది. దాదాపు అన్ని పనులు ఇంటినుంచే చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇదే అవకాశంగా కొంత మంది మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కొత్త పంథాలో.. రీఛార్జి చేయండి.. హోంవర్క్‌ చేయండి వేలల్లో డబ్బులు ఇస్తామంటూ లక్షలు దండుకున్నారు సైబర్‌ నేరస్థులు. ముఖ్యంగా సైబర్ నేరాల గురించి పెద్దగా అవగాహన లేని వారు ఇలాంటి మోసాల బారిన ఎక్కువగా పడుతున్నారు.

Cyber Fraud
Cyber Fraud

Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. నేరాలు పెరిగిపోవడంతో.. భద్రత కూడా పెరుగుతూ వస్తోంది. పాత తరహాలో మోసాలకు పాల్పడటం కష్టంగా మారడంతో నేరగాళ్లు కొత్త పంథా ఎంచుకుంటున్నారు. తాజాగా 'రీఛార్జి చేయండి.. హోంవర్క్‌ చేయండి' వేలల్లో డబ్బులు ఇస్తామంటూ లక్షలు దండుకున్నారు సైబర్‌ కేటుగాళ్లు. వేర్వేరు ఘటనల్లో రూ.18.15 లక్షలు దోచుకున్నారని సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ తెలిపారు.

బోరబండలో నివాసముంటున్న అబ్దుల్లా ప్రైవేటు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం పార్ట్‌టైం జాబ్‌ చేస్తారా? అంటూ అతడి చరవాణికి సంక్షిప్త సందేశం వచ్చింది. ఆ సందేశాన్ని క్లిక్‌ చేయగానే యాప్‌ డౌన్‌లోడ్‌ అయ్యింది. రూ.200 రీఛార్జి చేస్తే రూ.400 వస్తాయని యాప్‌ నిర్వాహకులు అబ్దుల్లాకు చెప్పారు. రూ.200 రీఛార్జి చేయగా అలాగే వచ్చాయి. ఇలా రోజుకు గరిష్ఠంగా రూ.50 వేలు ఇస్తామన్నారు. తొలిరోజు రూ.20 వేల వరకూ అబ్దుల్లా తీసుకున్నాడు. తర్వాతి రోజు నుంచి అబ్దుల్లా రూ.వేలల్లో రీఛార్జి చేస్తున్నా.. తిరిగి తీసుకోవడానికి వీల్లేకుండా నిర్వాహకులు పాస్‌వర్డ్‌ను ఉంచారు. ఇలా రూ.6.15 లక్షలు నగదు బదిలీ చేశాడు. తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించగా యాప్‌ మాయమైంది.

హోం వర్క్‌ చేస్తే..

బంజారాహిల్స్‌లో ఉంటున్న ఒక యువకుడికి ‘క్లాస్‌ హోంవర్క్‌.. ఎర్న్‌ రూ.20,000’ అంటూ సందేశం వచ్చింది. లింక్‌ క్లిక్‌ చేయగా యాప్‌డౌన్‌లోడ్‌ అయ్యింది. హోంవర్క్‌ ప్రస్తావన లేకుండా మేం చెప్పే పనులు చేసుకుంటూ వెళితే చాలు.. రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ సైబర్‌ నేరస్థులు తెలిపారు. ఆ యవకుడు సరేనంటూ వారు చెప్పినట్టు చేశాడు. రోజుకు రూ.20 వేల చొప్పున 5 రోజులు రూ.లక్ష ఇచ్చారు. తర్వాత తన స్నేహితులకు కూడా విషయం చెప్పి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాడు. తొలుత వారికి కూడా రూ.లక్ష చొప్పున ఇచ్చిన సైబర్‌ నేరస్థులు మాయమాటలతో వారితో రూ.12 లక్షలు నగదు బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత వారు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేయగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.