ETV Bharat / crime

Cars Scam: అద్దె కార్లను తాకట్టు పెట్టి.. కోట్లు కూడబెట్టి.. చివరకు..!

author img

By

Published : Jun 12, 2021, 8:27 AM IST

cars cheating
cars cheating

కార్లు అద్దెకిచ్చే సంస్థలో పనిచేశాడు. ఆ తర్వాత సొంతంగా అలాంటి వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం చక్కగా చేసుకుంటే రాణించేవాడేమో కానీ... తన అనుభవాన్ని తప్పుడు పనులకు ఉపయోగించాడు. అద్దె పేరుతో కార్లు తీసుకుని తనఖా పెట్టడం మొదలెట్టాడు. రెండు కార్లు ఉన్న యజమానులే లక్ష్యంగా... ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెచ్చిపోయిన ఘరానా మోసగాడు... చివరికి పోలీసులకు చిక్కాడు.

Cars Scam: అద్దె కార్లను తాకట్టు పెట్టి.. కోట్లు కూడబెట్టి.. చివరకు..!

ఏపీలోని విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం బందలుప్పికి చెందిన మర్రాపు చంద్రమౌళి... డిగ్రీ తర్వాత విశాఖలో కార్లు అద్దెకు ఇచ్చే ఓ సంస్థలో చేరాడు. జల్సారాయుడైన చంద్రమౌళితో వేగలేక భార్య వదిలేసింది. అనంతరం పార్వతీపురానికి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని, అక్కడే కార్ల వ్యాపారం ప్రారంభించాడు. రెండు కార్లు ఉన్న యజమానులను లక్ష్యంగా దొంగజిత్తులు వేశాడు. ఒక కారు అద్దెకిస్తే ఎక్కువ డబ్బులు ఇస్తానని నమ్మించాడు. అలా తీసుకున్న కార్లకు రెండు మూడు నెలలు క్రమం తప్పుకుండా అద్దె చెల్లించేవాడు. ఆ తర్వాత ముఖం చాటేసేవాడు. అద్దె సంగతి దేవుడెరుగు... కారు కూడా తిరిగిచ్చేవాడు కాదు. కొన్నాళ్లకు మరో ఇద్దరితో కలిసి ఇంకో ఎత్తు వేశాడు. అద్దె పేరుతో తీసుకున్న కార్లను తనఖా పెట్టడం ప్రారంభించాడు. అలా వచ్చిన డబ్బుతో జల్సాల్లో మునిగితేలాడు.

రాజేష్ ఫిర్యాదుతో వెలుగులోకి..

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం తురాయివలసకి చెందిన బాధితుడు పిన్నింటి రాజేష్ ఫిర్యాదుతో చంద్రమౌళి మోసం వెలుగుచూసింది. రాజేష్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పార్వతీపురం పోలీసులు.... నిందితుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడంతో అద్దె కార్ల దందా బయటపడింది. చంద్రమౌళికి సహకరించిన శ్రీకాకుళంజిల్లా సీతంపేటకు చెందిన శివరామకృష్ణను కూడా అరెస్టు చేసిన పోలీసులు.. విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన మరో నిందితుడు రవి కోసం వెదుకుతున్నారు. నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న 29 కార్ల విలువ 2 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. చంద్రమౌళి లాంటి మోసగాళ్ల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: బ్రహ్మంగారి ఆలయంలో పీఠం కోసం పోటీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.