ETV Bharat / crime

Woman tried to commit suicide : 'నన్ను క్షమించండి.. ఎలా బతకాలో అర్థం కావటం లేదు'

author img

By

Published : Oct 18, 2021, 11:47 AM IST

పుట్టుకతో మూగవాడైన తన కుమారుడిని చూసి ప్రతిరోజు ఆ తల్లిమనస్సు బాధపడేది. అందరి పిల్లల్లా తన కొడుకు లేడన్న బాధ ఆమెను ప్రతిక్షణం వెంటాడేది. తన చిన్నారి పరిస్థితి చూసి అనుక్షణం ఆవేదన చెందేది. ఏం చేసైనా తన కన్నపేగును బాగుచేయించాలని ఆరాటపడేది. కానీ.. దానికి తమ స్తోమత సరిపోక నిరాశ చెందింది. కొడుకు బాధ చూడలేక.. తీవ్ర మనస్తాపానికి గురై చివరకు ఆ చిన్నారితో సహా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించింది(Woman tried to commit suicide). చివరకు ఏమైందంటే..?

Woman tried to commit suicide
Woman tried to commit suicide

‘నన్ను క్షమించండి.. ఎలా బతకాలో అర్థం కావడం లేదం’టూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ తల్లి తన ఐదేళ్ల మూగ కుమారుడిని కొంగుతో నడుముకు కట్టుకుని కాల్వలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఘటనలో బాలుడు తుదిశ్వాస విడవగా.. ఆమె అపస్మారక స్థితిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది(Woman tried to commit suicide). ఈ ఘటన నల్గొండ జిల్లా హాలియాలో ఆదివారం చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బంకాపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి చిన్న వెంకట లింగయ్యకు అనుముల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన హేమలత(30)తో 2016లో వివాహం జరగగా వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. పెద్దకొడుకు విశాల్‌ శివ(5) పుట్టుమూగ. పీహెచ్‌డీ, ఉన్నత చదువుల కోసం చిన్న వెంకట లింగయ్య కుటుంబంతో సహా హైదరాబాద్‌లోని తార్నాకలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న దసరా పండగకు హేమలత తన పుట్టినిల్లైన కొత్తపల్లికి పిల్లలను తీసుకుని వచ్చింది.

ఆదివారం తన భర్తకు ఫోన్‌ చేయగా సోమవారం హైదరాబాద్‌ వెళ్దామని అన్నాడని.. షాపింగ్‌ చేసి వస్తానని ఇంట్లో చెప్పి తన పెద్ద కొడుకుని వెంట తీసుకుని హాలియాకు వచ్చింది. తన కుమారుడి పరిస్థితికి మనస్తాపం చెంది.. హాలియాలోని ఎడమ కాల్వ గేట్ల వద్ద కొడుకుని చీరకొంగుతో నడుముకు కట్టుకుని కాల్వలోకి దూకింది(Woman tried to commit suicide). ఆదివారం సంత కావడంతో ఆ ప్రాంతంలో ఉన్న వారు గమనించి తాడు సహాయంతో వారి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తల్లీకుమారుడిని హాలియాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృత్యువాతపడగా.. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించారు.

భర్త ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కొంత కాలంగా కుమారుడి పరిస్థితికి ఆమె ఆందోళన చెందుతుందని.. ప్రభుత్వపరంగా వైద్య ఖర్చులకు ప్రయత్నం చేస్తున్నారని బంధువులు తెలిపారు. హేమలత సైతం పీజీ పూర్తిచేసిందని, సున్నిత స్వభావంతో మెదిలేదని, ఈ క్రమంలోనే కొడుకుపై మనోవేదనతో అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని వివరించారు. హాలియా ఎస్సై శివకుమార్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.