ETV Bharat / crime

Boy Suicide in Jagtial : 'బీమ్లా నాయక్' సినిమా టికెట్​కు డబ్బులివ్వలేదని బాలుడి ఆత్మహత్య

author img

By

Published : Feb 15, 2022, 8:51 AM IST

Boy Suicide For Cinema Ticket : 11 ఏళ్ల బాలుడు.. ఆడుతూ పాడుతూ తోటివాళ్లతో హాయిగా తిరుగుతూ.. లైఫ్​ను ఎంజాయ్​ చేయాల్సిన వాడు. పవర్​స్టార్ పవన్‌ కల్యాణ్​కు వీరాభిమాని. ఆయన సినిమా వచ్చిందంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. అలా ఈ నెల 25న రిలీజ్ అవ్వనున్న బీమ్లా నాయక్ సినిమా కూడా చూడాలనుకున్నాడు. తన స్నేహితులంతా ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటున్నారని తనకు కూడా డబ్బు కావాలని తండ్రిని అడిగాడు. ఇప్పటికిప్పుడంటే కష్టం ఓ రెండ్రోజులు ఆగమని తండ్రి చెప్పాడు. అంతే.. క్షణికావేశంలో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు. ఆ కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు.

Boy Suicide in Jagtial
Boy Suicide in Jagtial

Boy Suicide For Cinema Ticket : సూసైడ్ ఈజ్ నాట్‌ ఎ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ టెంపరరీ ప్రాబ్లెం అని ఓ సినిమాలో చెప్పినట్లు చిన్నచిన్న తాత్కాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారంగా చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎనిమిదేళ్ల పిల్లల నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు రకరకాల కారణాలతో క్షణికావేశంలో ఉసురు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు.. అమ్మానాన్న ఆడుకోనివ్వడం లేదనో.. ఫోన్​ కొనివ్వడం లేదనో.. కాస్త మందలించారనో ఇలా చాలా చిన్న కారణాలతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లకు గర్భశోకం మిగులుస్తున్నారు. ఇలాంటి ఘటనే జగిత్యాల పట్టణంలో చోటుచేసుకుంది.

బీమ్లా నాయక్ సినిమా ప్రీ బుకింగ్ కోసం..

Boy Suicide For Money : జగిత్యాలలోని పురానీపేటలో 8వ తరగతి చదువుతున్నాడు పాండులోజి నవదీప్​. 11 ఏళ్ల ఈ బాలుడు పవర్​స్టార్ పవన్ కల్యాణ్​కు వీరాభిమాని. ఆయన సినిమాలంటే ఎంతో ఇష్టపడే నవదీప్.. ఈనెల 25న విడుదలవుతోన్న బీమ్లా నాయక్ సినిమాకు టికెట్​ను ముందుగానే బుక్ చేసుకుందామనుకున్నాడు. తన స్నేహితులంతా కూడా ప్రీ బుకింగ్ చేసుకుంటున్నారని.. తనకీ టికెట్​కు రూ.300 కావాలని తండ్రి నర్సయ్యను అడిగాడు.

అప్పటికే అంతా అయిపోయింది..

Boy Suicide For RS.300 : రెక్కాడితేగానీ డొక్కాడనీ కుటుంబం వాళ్లది. కూలీ పని చేసుకుని ఏరోజు తిండి ఆ రోజు సంపాదించుకుని బతికే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటిది కుమారుడు ఒకేసారి రూ.300 అడిగేసరికి తండ్రికి ఏం చేయాలో అర్థంకాలేదు. అలాగని కొడుకు సరదాను కాదనదలుచుకోలేదు. ఇప్పటికిప్పుడు రూ.300 సర్దుబాటు కావడం కష్టమని.. కాస్త సమయం ఇవ్వమని కుమారుడని ప్రాధేయపడ్డాడు నర్సయ్య. తండ్రి మాట వినని నవదీప్.. మీరెప్పుడూ ఇంతే అంటూ కోపంతో గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు. ఎంతకీ బయటకు రాకపోయేసరికి నర్సయ్య, తన భార్యకు అనుమానం వచ్చింది. తలుపులు బద్ధలుకొట్టి వెళ్లి చూడగా.. బాల్కనీలో లుంగీతో ఉరివేసుకుని వేలాడుతున్న నవదీప్ కనిపించాడు.

కన్నవాళ్లకు గర్భశోకం..

Boy suicide in Jagtial : ఆ దృశ్యం చూసిన వారికి కాళ్లూచేతులు ఆడలేదు. ఏం జరిగిందో ఓ క్షణం అర్థంకాలేదు. రూ.300 కోసం ఇంత పనిచేస్తాడనుకోలేదనుకుంటూ ఆ తండ్రి గుండెలవిసేలా రోదించాడు. తన కంటిపాప ఈ లోకాన్ని విడిచివెళ్లిందని అర్థమైన ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వారి రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇలా చేస్తాడనుకోలేదు..

'బీమ్లా నాయక్ సినిమా అంట. ఆ సినిమా టికెట్ కోసం రూ.300 అడిగాడు. టికెట్‌కు రూ.300 ఏంటని గట్టిగా అడిగేసరికి రూ.150 వేరే ఎవరికో ఇవ్వాలని.. మరో రూ.150 టికెట్ కోసం అని చెప్పాడు. ఇప్పటికిప్పుడంటే కష్టం. కాస్త సమయం ఇవ్వు మెల్లగా సర్దుబాటు చేస్తానని చెప్పాను. అంతే.. నువ్వెప్పుడు పైసలియ్యవ్ నాకు అనుకుంటూ కోపంతో గదిలోకి వెళ్లి తలుపు పెట్టుకున్నాడు. ఎంతసేపు డోర్ కొట్టినా చప్పుడు లేదు. ఇగ మాకు భయమై తలుపులు బద్ధలు కొట్టి పోయి చూసేసరికి అంతా అయిపోయింది. నా కొడుకు గిట్ల చేస్తడనుకోలేదు.'

- నర్సయ్య, మృతుడి తండ్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.