ETV Bharat / crime

కిలేడి: పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా చేసిందిలా...!

author img

By

Published : Feb 24, 2021, 8:11 PM IST

Updated : Feb 24, 2021, 11:56 PM IST

విలాసాలకు అలవాటు పడిన ఓ మహిళ ఏకంగా 11 కోట్లకు టోకరా వేసింది. భారీగా ఆస్తులున్నాయని నమ్మించి హైదరాబాద్‌ బాచుపల్లికి చెందిన ఓ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆ సొమ్ముతో కార్లు, బంగ్లాలు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడిపింది. చివరకు బాధితుడి ఫిర్యాదుతో...అసలు విషయం వెలుగుచూడగా... కటకటాల్లోకి వెళ్లింది.

పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా చేసిందిలా...!
పెళ్లి పేరుతో రూ.11 కోట్లు స్వాహా చేసిందిలా...!

హైదరాబాద్‌ బాచుపల్లిలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ మహిళ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దక్షిణ భారత ఛైర్‌ పర్సన్‌గా చెలామని అవుతూ తనకు భారీగా ఆస్తులున్నాయని నమ్మించి ఓ వ్యక్తి నుంచి 11 కోట్ల రూపాయలు కాజేసింది. బాచుపల్లిలో పక్కనే ఉండే విల్లాలో నివాసముంటున్న వీరారెడ్డి నుంచి వివిధ దశల్లో డబ్బు వసూలు చేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు....నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో ముగ్గురుని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నగదు, బంగారంతో పాటు సుమారు 46 డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

నమ్మించి మోసం

కడప జిల్లాకు చెందిన శిరీష అలియాస్‌ స్మృతి సిన్హా... విలాసాలకు అలవాటు పడి మోసాలకు పాల్పడింది. ఇందుకోసం ఆమెతో సహజీవనం చేస్తున్న అదే జిల్లాకు చెందిన విజయ్‌కుమార్‌ రెడ్డి సహకారం తీసుకుంది. ఇద్దరు కలిసి పథకం ప్రకారం బాచుపల్లికి చెందిన వీరారెడ్డిని ట్రాప్‌ చేశారు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్​ శిక్షణ తీసుకుంటున్నానంటూ విజయ్‌కుమార్‌....అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం దక్షిణ భారత ఛైర్‌పర్సన్‌ అని స్మృతి సింహా... వీరా రెడ్డిని పరిచయం చేసుకున్నారు. తమకు భారీగా ఆస్థులు ఉన్నాయని నమ్మించారు. అనంతరం వీరారెడ్డి నుంచి పలు దఫాలుగా సొమ్ము కాజేసినట్లు డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.

పరువుపోతుందని ఆత్మహత్య

ఈ మోసానికి విజయ్‌కుమార్‌ రెడ్డి తండ్రి రాఘవరెడ్డితో పాటు సమీప బంధువులు మరో ఇద్దరు ఆమెకు సహకరించారు. అయితే... కొన్ని రోజులకు అనుమానం వచ్చిన వీరారెడ్డి.... డెహ్రాడూన్‌లో శిక్షణ తీసుకుంటున్నట్లు నమ్మిస్తున్న విజయ్ కుమార్ రెడ్డి లైవ్ లొకేషన్ పంపాలని కోరాడు. అతడు పంపించకపోవటంతో... మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు...అసలు విషయం బయటకు లాగారు. వీరారెడ్డి నుంచి తీసుకున్న డబ్బులను విలాసాలకు ఖర్చు చేసినట్లు గుర్తించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో 40 రోజులు ఉంటే దాదాపు రోజుకు లక్ష రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. మోసం బయటకు వస్తే పరువుపోతుందని విజయ్‌కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించిన పోలీసులు... నిందితులకు సంబంధించిన ఆస్తులు సీజ్‌ చేసినట్లు వివరించారు.

బీకేర్​ఫుల్​

మహానగరంలో ఇలాంటి మోసాలు వెలుగుచూస్తున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న పోలీసులు ...ఎలాంటి అనుమానాలు ఉన్నా... ఫిర్యాదు చేయాలని సూచించారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​లో కిలాడీ లేడీ.. పెళ్లి పేరుతో రూ.11కోట్లు లూటీ

Last Updated : Feb 24, 2021, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.