Gateway Hacking: బీటెక్ మధ్యలోనే వదిలేసి.. సర్వర్లు హ్యాక్ చేసి..!

author img

By

Published : May 13, 2022, 5:10 AM IST

Gateway Hacking:

Gateway Hacking: చిన్నప్పటి నుంచి కంప్యూటర్, అంతర్జాలంపై ఎంతో ఆసక్తి పెంచుకుని పెద్దయ్యాక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాడు. చదువుపై ఆసక్తి లేక బీటెక్‌ను మధ్యలోనే వదిలేసి అడ్డదారిలో డబ్బులు సంపాదించేందుకు తెలివితేటలను ఉపయోగించుకున్నాడు. పేమేంట్ గేట్ వే సర్వర్‌ను హ్యాక్ చేసిన యువకుడు చివరకు సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయాడు.

Gateway Hacking: వినియోగదారుల సౌకర్యార్థం ఎన్నో పేమెంట్ గేట్ వేలు అందుబాటులోకి వచ్చాయి. అదే కోవలో వ్యాపారం అందిపుచ్చుకునేందుకు ఎక్స్ సిలికా అనే సంస్థ పే జీ అనే పేరుతో పేమెంట్ గేట్ వేను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థకు చెందిన ఖాతాలో మార్చి 16న రూ.52.9లక్షలు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యాయి. మార్చి 17న హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సాయం తీసుకొని కీలక ఆధారాలు సేకరించారు.

విజయవాడకు చెందిన శ్రీరామ్ దినేష్ కుమార్ పే జీ పేమెంట్ గేట్ వే సర్వర్‌ను హ్యాక్ చేసి నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. బీటెక్ మధ్యలోనే వదిలేసిన శ్రీరామ్.. దూరవిద్య ద్వారా బీఎస్సీ కంప్యూటర్స్, ఆన్‌లైన్‌లో ఎథికల్ హ్యాకింగ్ కోర్సు పూర్తి చేశాడు. ఆ తర్వాత అప్లికేషన్ల ద్వారా విజయవాడలో 3 వ్యాపారాలు ప్రారంభించాడు. గెట్ క్యాబ్, నైట్ ఔట్ చెఫ్, డెయిలీ బాస్కెట్ పేరుతో వ్యాపారం నిర్వహించాడు. ఆశించిన లాభాలు లేకపోవడం శ్రీరామ్ దినేశ్‌ను నిరుత్సాహపరిచింది. జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో హ్యాకింగ్ ఎంచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
బ్యాంకులు రోజువారీ లెక్కలు సరి చూస్తాయనే ఉద్దేశంతో శ్రీరామ్ దినేష్ పేమెంట్ గేట్ వేలను హ్యాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. పేమెంట్ గేట్ వే లావాదేవీలైతే రోజు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. నగదు బదిలీ చేసినా అంత త్వరగా గుర్తుపట్టరనే ఉద్దేశంతో లక్ష్యంగా చేసుకున్నాడు. ఐసీఐసీఐ, యెస్ బ్యాంకు, ఈక్విటాస్ బ్యాంకులో శ్రీరామ్ దినేష్ ఖాతాలు తెరిచాడు. ధ్రువపత్రాలు సైతం నకిలీవి సమర్పించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మార్చి 16న హ్యాక్ చేసిన సర్వర్ నుంచి రూ.52.9 లక్షలను ఈ మూడు బ్యాంకుల్లోని ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత వాటిని క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు. కొన్ని రోజుల్లో తిరిగి తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. చదువుపై ఆసక్తిలేని శ్రీరామ్ దినేశ్ సాంకేతికతపై మాత్రం ఎంతో పట్టు సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పేమెంట్ గేట్ వే లలోని లోపాలను ఇట్టే పసిగట్టడంలో శ్రీరామ్ దినేష్ దిట్ట. ఓ విదేశీ కంపెనీకి చెందిన పేమెంట్ గేట్ వేలో లోపాలను ఎత్తి చూపి... ఆ సంస్థ నుంచి 100 డాలర్ల బహుమతిని సైతం గెలుచుకున్నాడు. అదే సంస్థలో దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం లభించలేదు. తనకున్న తెలివి తేటలను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగించి పలు పేమెంట్ గేట్ వేల సర్వర్లను హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పే జీ పేమెంట్ గేట్ వే సంస్థ నిర్వహణ లోపం వల్ల సర్వర్ హ్యాక్ అయిందన్న పోలీసులు సిలికా సంస్థకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీపీ తెలిపారు. పేమెంట్ గేట్ వేలపై ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు.

ఇవీ చూడండి:

Dalit Bandhu Scheme: దళితబంధు పథకంలో పరిశ్రమల ఏర్పాటు

'మూడోసారీ నేనే ప్రధాని'... క్లారిటీ ఇచ్చిన మోదీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.