ETV Bharat / crime

Cyber Frauds: 'నగ్న వీడియోలు, లాభాల గాలాలు..' వారంలో 10 సైబర్​ మోసాలు..

author img

By

Published : Jan 8, 2022, 4:43 AM IST

Cyber Frauds: సైబర్‌ మోసాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా... కొత్త కొత్త ఎత్తులతో నేరగాళ్లు అమాయకులను నిండా ముంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగటంతో.. వాడకంపై అవగాహన సరిగా లేని వాళ్లను ఆసరాగా చేసుకుంటూ కొత్త మార్గాల్లో గాలం వేస్తున్నారు. ఇప్పటి వరకు 'ఈ-మెయిల్‌', మెసేజ్‌ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగ్న వీడియోలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనే ప్రకటనలతో నిండా ముంచుతున్నారు.

10 Cyber Frauds in one week in hyderabad
10 Cyber Frauds in one week in hyderabad

'నగ్న వీడియోలు, లాభాల గాలాలు..' వారంలో 10 సైబర్​ మోసాలు..

Cyber Frauds: మీరు ఫేస్‌బుక్, ఇన్‌స్టాలను వాడుతున్నారా... అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలంటూ మధ్యమధ్యలో వచ్చే ప్రకటనలు... లేదంటే అమ్మాయిల నగ్న వీడియోలతో వల పన్ని.. తమ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తుంటారు కేటుగాళ్లు. వాట్సప్‌ నెంబరుకు ఫోన్‌ చేసి... కేవలం 4 నుంచి 5 సెకన్లలో నగ్నంగా కనిపించి మాయమవుతారు. వీడియో చూసే దృశ్యాలను రికార్డ్‌ చేసి మళ్లీ వారికే పంపి... డబ్బులివ్వమంటూ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంటారు. అడిగినంత ఇవ్వకుంటే అంతర్జాలంలో ఉంచుతామని బెదిరిస్తారు. ప్రముఖ కంపెనీల్లో షేర్లు కొంటే నాలుగైదు రెట్లు లాభాలు వస్తాయంటూ నమ్మించి.. నిలువునా దోపిడి చేస్తుంటారు. ముఖ్యంగా యువతీ యువకులు, గృహిణులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్నారు.

14 వేలకే ఐఫోన్​ అని 75 వేల టోకరా..

ఇటీవల ఎల్బీనగర్‌కు చెందిన ఓ విద్యార్థిని సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. ఇన్‌స్టాగ్రాం చూస్తుండగా... 'ఐ ఫోన్‌-13' కేవలం 14 వేల రూపాయలకే నంటూ ప్రకటన వచ్చింది. ఖరీదైన ఫోన్‌ తక్కువకే వస్తుందనే ఆశతో ఆన్‌లైన్‌ ద్వారా ఆమె నగదు చెల్లించింది. మరికొంత కావాలంటూ 75 వేల రూపాయల వరకు దండుకున్నారు. వనస్థలిపురానికి చెందిన ఓ గృహిణి... తక్కువ పెట్టుబడితో రోజువారీ ఆదాయం అనే ప్రకటన చూసి.. వాటికి ఆకర్షితురాలైంది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్స్‌లో డబ్బుపెడితే పెద్దఎత్తున లాభాలు వస్తాయంటూ దఫాలవారీగా లక్ష రూపాయలు తమ ఖాతాల్లో వేయించుకున్నారు. బాధితురాలు సకాలంలో పోలీసులను ఆశ్రయించటంతో మోసగాళ్ల బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఇలా కొత్త ఏడాదిలో వారం రోజుల వ్యవధిలోనే నగరంలో 10 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఆన్‌లైన్‌లో మోసాలకు గురై తంటాలు పడటం కంటే ముందుగానే అప్రమత్తంగా ఉంటే సైబర్‌ నేరగాళ్ల బారిన పడే అవకాశముండదని పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.