ETV Bharat / city

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో వర్షపు జోరు.. ప్రాజెక్టులకు వరద హోరు..

author img

By

Published : Jul 10, 2022, 5:40 PM IST

Nizamabad Heavy Rains: ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో వర్షపు జోరు కొనసాగుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు అలుగులు పారుతుండగా.. వాగుల ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం భారీగా వచ్చి చేరుతోంది. గోదావరి, మంజీర నదుల్లో ప్రవాహం కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

Heavy rains in nizamabad and kamareddy districts
Heavy rains in nizamabad and kamareddy districts

Nizamabad Heavy Rains: నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు కూడా ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని డిచ్​పల్లి, జక్రాన్​పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ, ఇంధల్వాయి మండలంలో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. చెరువులన్ని అలుగు పారుతున్నాయి. శ్రీరామ్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 4,92,000 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1085.3అడుగులకు చేరింది. పూర్తి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటినిల్వ 67.794 టీఎంసీలుగా ఉంది. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఉద్ధృతంగా గోదావరి..: ఎగువన ఉన్న కౌలాస్​నాలా గేట్లు ఎత్తడంతో బోధన్ మండలం సాలూర వద్ద గల మంజీర నదికి వరద తాకిడి ఎక్కువైంది. ఫలితంగా.. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. నిర్మాణానికి సంబందించిన సామాగ్రి వరద నీటిలో తేలియాడుతుంది. రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి ఊరకలేస్తుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరచివుండడంతో గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం పెరగడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

అన్నదాల హర్షం..: సీజన్ ప్రారంభం నుంచి కురిసిన ఏకైక వర్షానికి చెరువులు అలుగులు పారడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఇందల్వాయి మండలంలోని సిర్నపల్లి జానకి బాయి చెరువు అలుగు పోయడంతో చుట్టుపక్కల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. జక్రాన్​పల్లి మండలంలోని కేశ్​పల్లి గ్రామంలోని కొత్త కుంటకు గండి పడి.. పొలాల్లోకి వరద నీరు వెళ్తోంది.

ప్రమాద ఘంటికలు..: గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ట్రాన్స్​ఫార్మర్లు ఉన్న ప్రాంతాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. నిజామాబాద్​లోని సీతారాంనగర్ కాలనీలో ట్రాన్స్​ఫార్మర్​కు ఏర్పాటు చేసిన ఇనుపకంచెకు తగలటంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ వచ్చి ఒకదాని తర్వాత ఒకటిగా.. రెండు ఆవులు మరణించాయి. నిజామాబాద్ గ్రామీణ మండల పరిధిలో పశువులు మేపేందుకు వెళ్లిన.. లింగితండాకు చెందిన మక్కల నడిపి సాయిలు (45), దరంగుల రెడ్డి (38).. నిజాంసాగర్ కాలువలో జారిపడి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్థులు.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. బోధన్ మండలంలోని పెగడపల్లి, చిన్నమావంది గ్రామాల మధ్య నిర్మించిన చెక్ డ్యాం వద్దకు గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొని వచ్చింది. గమనించిన స్థానికులు బోధన్ గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు. ఏకధాటి వానకు కొన్ని ఇండ్లు పాక్షికంగా.. మరికొన్ని పూర్తిగా నేలమట్టమయ్యాయి.

కామారెడ్డి జిల్లాలో..: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి కామారెడ్డి జిల్లాలోని వాగులు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఫలితంగా.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జుక్కల్ మండలం కౌలస్​నాలా ప్రాజెక్ట్ మూడు గేట్లను ఎత్తి.. 1674 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 457.75 మీటర్లకు నీరు చేరింది. ఎగువ కర్ణాటక ప్రాంతం నుంచి 1620 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతుంది. నిజాం సాగర్ ప్రాజెక్ట్​లోకి 5980 క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గానూ.. 1392 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.474 టీఎంసీలకు చేరింది. ఇక మద్నూర్ మండలం గోజేగావ్ లెండి వాగుకు భారీగా వరద రావడంతో వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. నాగిరెడ్డిపేట్ మండలం పోచారం ప్రాజెక్టు అలుగు పారుతోంది. ప్రాజెక్టుకు గేట్లు లేకపోవటం వల్ల.. వంతెన పైనుంచి నీరు ప్రవహిస్తోంది.

బీర్కూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెరువును తలపిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. నసురుల్లాబాద్ మండలం నమిలి గ్రామంలో ట్రాక్టర్​తో వ్యవసాయ పనులు చేస్తుండగా.. ఒక్కసారిగా అలుగు పొంగటంతో పొలాల్లోకి భారీగా నీరు చేరింది. దీంతో.. ట్రాక్టర్ నీటి మునిగిపోయింది. బాన్సువాడలో రేకుల షెడ్డు కూలిపోవడంతో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. బాన్సువాడ- ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలు అంతరాయం కలిగింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.