ETV Bharat / city

ఫోన్​పే తరహలో 'కాంట్రాక్ట్​​ పే'.. రాజగోపాల్​రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్లు

author img

By

Published : Oct 11, 2022, 10:43 AM IST

మునుగోడు ఉపఎన్నిక వేళ పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై ఉండగా.. నియోజకవర్గపరిధిలో గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం సృష్టించాయి. ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల సంస్థ ఫోన్​పే తరహాలో.. 18వేల కోట్ల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేటాయించడం జరిగిందంటూ ఈ గోడ పత్రికల్లో ముద్రించారు. ఒకవైపు ఉపఎన్నిక నామినేషన్లు జరుగుతుండగా.. మరోవైపు పోస్టర్ల కలకలం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది.

wall posters in munugode
మునుగోడులో పోస్టర్ల కలకలం

నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమయ్యాయి. రాజకీయ పార్టీల విమర్శలు -ప్రతివిమర్శలు, సవాళ్లు - ప్రతిసవాళ్లతో మునుగోడు ఉపఎన్నిక పోరు వేడెక్కుతోంది. నామినేషన్ల వేళ భారీ ర్యాలీలు... ఊరూర విస్తృత ప్రచారాలు, చేరికలు, ప్రజాకర్షక ప్రసంగాలతో నేతలు ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉపఎన్నికలో... పైచేయి సాధించేందుకు తమదైన వ్యూహాలతో ఓటర్లకు గాలం వేస్తున్నారు.

wall posters in munugode
రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు

పార్టీలన్ని ప్రచారంలో తలమునకలై ఉండగా.. తాజాగా గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా... ఈ గోడపత్రికలు వెలిశాయి. నియోజకవర్గపరిధిలోని చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన కూడలి, హోటళ్లు, మద్యం దుకాణాల వద్ద గోడపత్రికలు అతికించారు. ప్రముఖ డిజిటల్​ చెల్లింపుల సంస్థ ఫోన్​పే తరహాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రూ.18వేల కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడుబోయారంటూ... పోస్టర్లలో ముద్రించారు. గమనించిన పోలీసులు వాటిని తెల్లవారుజామున తొలిగించారు.

wall posters in munugode
రాజగోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా వెలసిన గోడపత్రికలు

నిన్ననే భాజపా అభ్యర్థి రాజగోపాల్​రెడ్డి భారీ హంగామా నడుమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్‌తో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. విజయం తమదేనని కమలనాథులు ధీమా వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఇలా భాజపా అభ్యర్థికి వ్యతిరేకంగా గోడ పత్రికలు వెలువడం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. పోస్టర్లు ఎవరంటించారన్న ఆసక్తి ప్రజల్లో కనిపిస్తోంది.

wall posters in munugode
మునుగోడులో పోస్టర్ల కలకలం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.