ETV Bharat / city

గద్వాల జిల్లాలో డెంగీ రోగులతో కిక్కిరిసిన ఆసుపత్రులు.. ప్రత్యేక చర్యలేవీ..

author img

By

Published : Oct 14, 2022, 4:53 PM IST

Dengue fever
డెంగీ జ్వరాలు

Dengue fever in Gadwal: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నిలిచిన మురుగునీటిలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమకాటుకు గురైన జనాలు.. జ్వరాల బారిన పడుతున్నారు. పలు చోట్ల డెంగీ కేసులు నమోదవుతున్నాయి. జ్వరం, డెంగీతో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ దుస్థితి జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో కనిపిస్తోంది. జ్వరాలు విజృంభిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

గద్వాల్‌ రోజురోజుకు పెరుగుతున్న డెంగీ రోగులు

Dengue fever in Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రజలు దోమల స్వైర విహారంతో రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జనావాసాల్లో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. మురుగునీటిలో దోమలు ఆవాసాలను ఏర్పాటు చేసుకొని విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో దోమ కాటుతో గత రెండు నెలల నుంచి జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజుకు 700 నుంచి 900 వరకు జ్వర బాధితులు జిల్లా ఆస్పత్రికి వెళుతున్నారు. జిల్లాలోని గద్వాల, గట్టు, మల్దకల్, ధరూర్ ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. రోజురోజుకు పెరుగుతున్న జ్వరాలతో ఆస్పత్రులు అన్నీ కిటకిటలాడుతున్నాయి.

గద్వాలలోని ప్రధాన కూడలిలో ఉన్న మురుగు కాల్వల్లో నీరు నిలిచిపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి మురుగు కాల్వలను శుభ్రం చేయించాలని కోరుతున్నారు. ఎక్కువ మంది జ్వరాల బారిన పడుతున్నందున ఆరోగ్య సర్వే జరిపి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చిన్నారులు డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి జ్వరాలతో బాధ పడుతున్నారని స్థానికులు తెలిపారు.

ప్రతి జ్వరాన్ని డెంగీగా భావించాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెపుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో డెంగీ చికిత్సకు సంబంధించిన అన్ని సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పారు. ఇటీవల వాతావరణ మార్పులతో ఈ డెంగీ దోమ పెరిగే ఆస్కారం అధికంగా ఉందని వైద్యులు భావిస్తున్నారు. జ్వరాల వేళ ప్రజలు సైతం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, తరచుగా కాచి చల్లార్చిన నీటిని తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.