ఖమ్మంలో 'డబుల్'​ దందా.. 200 మంది దగ్గర వసూళ్లు.. 4 కోట్ల టోకరా..!

author img

By

Published : Jul 6, 2022, 7:04 AM IST

Double bed room houses and bank loans fraud in khammam
Double bed room houses and bank loans fraud in khammam ()

Double Bed Room Houses Scam: ఖమ్మంలో 'డబుల్​' దందా వెలుగు చూసింది. డబుల్​ బెడ్​రూం ఇళ్లు మాత్రమే కాదు.. బ్యాంకు లోన్ల పేరుతోనూ.. అమాయకుల ఆశలను సొమ్ము చేసుకున్నారు. ఏకంగా 200 మందికి ఆశచూపి 4 కోట్లు వసూలు చేశారు. అడిగిన వాళ్లకు నకిలీ పట్టాలు చేతిలో పెట్టారు. తీరా మంత్రి దగ్గరికి వెళ్తే.. అసలు విషయం బయటపడింది.

Double Bed Room Houses Scam: సొంతింటి కల నేరవేరుతుందని ఆశపడిన నిరుపేదల నుంచి భారీగా డబ్బులు దోచుకుని మోసం చేసిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. దళారుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో డబుల్​ దందా బయటపడింది. ఖమ్మంలో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, బ్యాంకు లోన్లు ఇస్తామని ఆశ చూపి సుమారు 200 మంది వద్ద సుమారు 4 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇందులో పాత్రదారులు మెప్మా, ఆశా కార్యకర్తలు కాగా.. ప్రధాన సూత్రదారులు మాత్రం అధికార పార్టీకి చెందిన వారిగా బాధితులు వాపోతున్నారు.

ఖమ్మం శివారులోని పుట్టకోటకు చెందిన లక్ష్మీ అనే మెప్మా ఆర్పీ, ఖమ్మం ఖిల్లా బజార్‌కు చెందిన షాహీనా.. నగరంలోని పేదల కాలనీల్లో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని.. చెప్పి ఒకొక్కరి దగ్గర 50 వేల నుంచి 2 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారు. డబ్బులు కట్టినప్పటి నుంచి ఇప్పుడు అప్పుడు అంటూ పది నెలలుగా చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇన్ని నెలలైనా ఇళ్ల గురించి ఏం చెప్పకపోవటంతో.. వాళ్లపై బాధితులు ఒత్తిడి తీసుకొచ్చారు. ఎలాగోలా వాళ్లను మభ్యపెట్టేందుకు.. డబుల్‌ బెడ్‌ రూం ఇల్లు వచ్చినట్లు నకిలి పట్టా కాగితాలు చేతికిచ్చి చల్లబరిచారు. అవి నకిలీవని తెలుసుకున్న బాధితులు మంత్రి అజయ్​కుమార్​ దగ్గరికి వెళ్లి అడిగితే.. డబ్బులు తీసుకుని ఇవ్వటమనే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

వెంటనే బాధితులంతా కలిసి.. ఖానాపురం హవేలి పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని కోరుకుంటున్నారు. బాధితుల్లో కొంత మంది తాము కట్టడమే కాకుండా.. మంచి జరుగుతుందన్న నమ్మకంతో.. బంధువులు, స్నేహితులతో కూడా కట్టించారు. తీరా.. ఇదంతా మోసమని తెెలియటంతో.. బంధువులు, స్నేహితులంతా ఇంటి మీదకు వచ్చి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మరోవైపు.. బ్యాంకులోన్లు ఇప్పిస్తామని కూడా లక్షలు కట్టించుకోవటంతో ఉన్న డబ్బులు కూడా పోయి ఇప్పుడు తినడానికి ఇబ్బంది పడుతున్నామని లబోదిబోమంటున్నారు.

"నేను కూలి పనులు చేస్తుంటా. నా భర్త వికలాంగుడు. ఆయన పని చేయలేడు. పైగా ఆయన గుండెలో రంధ్రముంది. ఆపరేషన్​ కోసం దాచుకున్న డబ్బును.. వాళ్లు చెప్పిన మాటలు నమ్మి.. ఇల్లు వస్తుందనే ఆశతో మొత్తం ఇచ్చేశా. ఇప్పుడు.. తినడానికే ఇబ్బంది పడాల్సివస్తోంది. నా భర్త పింఛన్​ డబ్బులతోనే ఇల్లు గడపాల్సివస్తోంది. ఎలాగైనా మాకు న్యాయం చేయాలి." - షాహిన్‌, బాధితురాలు

"స్నేహితురాలని నమ్మితే లక్ష్మీ మమ్మల్ని నట్టేట ముంచింది. షాహీనాతో కలిసి వాళ్ల బావ పేరు చెప్పి.. డబుల్​బెడ్​రూం ఇళ్లు ఇప్పిస్తానని నమ్మించింది. వాళ్ల మాటలు నమ్మి.. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో నా స్నేహితులు, బంధువులందరు కలిపి మొత్తం 38 మందితో డబ్బులు కట్టించా. కానీ.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదంతా మోసం అని తెలిసి వాళ్లంతా నా ఇంటి మీదికొచ్చి గొడవలు చేస్తూ.. ఇబ్బందులు పెడుతున్నారు. మాకు న్యాయం చేయండి." -ఉష, బాధితురాలు

"శీలం లక్ష్మీ, షాహీనాకు మొత్తం 37 లక్షల 80 వేలు కట్టాం. డబుల్​ బెడ్​ రూం ఇళ్ల కోసం ఒక్కొక్కరి దగ్గర 50 వేలు వసూలు చేశారు. బినామీ లోన్లు ఇప్పిస్తామని 27 లక్షలు కట్టించుకున్నారు. స్నేహితులు, చుట్టాల ద్వారా నేను కట్టించా. ఇప్పటికి కూడా వస్తాయంటున్నారు. మాకు నమ్మకం లేక మంత్రిని కలిస్తే.. పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు." - అజయ్‌, బాధితుడు

"లోన్​ కోసం లక్ష్మీకి లక్ష రూపాయలు కట్టాను. బెడ్​ రూం కోసం నేను పది మందితో కట్టించాను. ఆమె షాహీనాకు అప్పజెప్పింది. తనేమో.. ఇప్పుడు అప్పుడు అంటూ ఇవ్వట్లేదు. మంత్రి దగ్గరికి పోతే.. లోన్లు ఎక్కడున్నాయి.. ఇళ్లకు డబ్బులెందుకు తీసుకుంటాం.. అదంతా ఫేక్​ అని తిట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయమన్నాడు. ఇప్పుడు పోలీసులకు కంప్లైంట్​ ఇచ్చాం. కేసు నమోదైంది." -పుష్ప, బాధితురాలు

ఇవీ చూడండి:

ఖమ్మంలో 'డబుల్'​ దందా.. 200 మంది దగ్గర వసూళ్లు.. 4 కోట్ల టోకరా..!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.