ఆ మూడు జిల్లాల్లో కొనసాగుతోన్న వరద బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం..

author img

By

Published : Jul 14, 2022, 8:08 PM IST

Heavy Floods in Karimanagar and warangal and khammam

ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలో ఏకధాటి వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. గోదావరి మహోగ్రరూపానికి వాగులు, వంకలు నదులను తలపిస్తున్నాయి. రహదారులు తెగిపోవటంతో...రాకపోకలు నిలిచిపోయాయి. వరదల్లో చిక్కుకున్న వారికోసం అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఆ మూడు జిల్లాల్లో కొనసాగుతోన్న వరద బీభత్సం.. జనజీవనం అస్తవ్యస్తం..

రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలకు వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. కరీంనగర్‌లో పలు గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. నంగునూరు వద్ద ఇటుకబట్టీల వద్ద వరదల్లో చిక్కుకున్నతొమ్మది మందిని సురక్షితంగా తరలించారు. మంత్రి గంగుల కమలాకర్‌ స్వయంగా పర్యవేక్షించారు. జగిత్యాల జిల్లాలో రహదారులు తెగిపోయాయి. కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. కండ్లపల్లి చెరువు ప్రమాద స్థాయికి చేరుకోవడంతో హన్మాజీ పేటలోని 30 కుటుంబాలను పునారావాస ప్రాంతాలకు తరలించారు. వెంకటాద్రి నగర్‌, గోవింద్‌ పల్లి నీటమునిగాయి. బీర్‌పూర్‌లో రోళ్లవాగు ఉద్ధృతికి తుంగూరు-కండ్లపల్లి మధ్య రహదారి కొట్టుకుపోయింది. రాయికల్, గొల్లపెల్లి మార్గాల్లో వంతెన దగ్గరగా గోదావరి ప్రవహిస్తోంది.

పెద్దపల్లి జిల్లా మంథనిలో రెండ్రోజులుగా వ్యాపార వాణిజ్యసముదాయాలతో పాటు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గోదారమ్మ శాంతించాలంటూ పూజలు చేశారు. బొక్కలవాగు సమీపంలోని లైన్ గడ్డ, వాగు గడ్డ, మర్రివాడ, అంబేద్కర్ నగర్, బోయిన్ పేట, దొంతుల వాడ, సూరయ్యపల్లి ఎస్సీ కాలనీ నీట మునిగాయి. గోదావరిఖనిలో నది పరివాహక ప్రాంతాలైన గంగానగర్, సప్తగిరి కాలనీ, పవర్ హౌస్ కాలనీలు వరదలో చిక్కుకున్నాయి. బాధిత కుటుంబాలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మర్రివాడలో వరదల్లో బాలింత, రెండు నెలల బాలుడు చిక్కుకోగా.... చిన్నారి పెద్దనాన్న ఓ తట్టలో పెట్టుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చారు. బాలుడిని ఎత్తుకొని తీసుకువస్తున్న దృశ్యం బాహుబలి సినిమాను తలపించింది.

భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్, పలిమేల, కాటారం మండలంలో పరిస్థితి భయానకంగా మారింది. గోదావరి ఉగ్రరూపానికి పెద్దంపేట, అన్నారం, చండ్రుపల్లి, నాగపల్లి, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం , కన్నెపల్లి, బీరాసాగర్ ,పూస్కుపల్లి గ్రామాలు జలదిగ్భందంలో చిక్కున్నాయి. కాటారం మండలం దామెరకుంటలోకి వరద పోటెత్తడంతో... ఎడ్ల బండిలో పునరావాస కేంద్రానికి ప్రజలు తరలివెళ్లారు. పెద్దంపేట వాగు వంతెన వద్ద రహదారి ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హనుమకొండ జిల్లా పరకాలలో పంటలు నీటమునిగాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చలివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గణసముద్రం వరద ధాటికి ఉప్పొంగుతుంది.

ములుగు జిల్లా లంకలో దుక్కులు దున్నిన అనంతరం పొలాల్లో ఉంచిన ట్రాక్టర్‌ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. ఆల్బకలో విద్యుత్ స్తంభం నేలకు వంగిపోయింది. ఏటూరునాగారం మండలం కొయ్యగూడ, రాంనగర్, లంబాడి తండా గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి తల్లి శాంతించాలని మహిళలు పూజలుచేశారు. వెంకటాపురం మండలంలో పెరుగుతున్న గోదావరి వరద ఉధృతికి టేకులబోరు, వెంగళరావుపేట, చర్చిపేట, సురవీడుకాలనీ, గాండ్లబజార్ లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. బాధితులను పునరావస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి వరంగల్‌లో వరదల పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. పినపాక మండలంలోని చింతల బయ్యారం, రాయి గూడెం గ్రామాలు ద్వీపాన్ని తలపిస్తున్నాయి. అసాపురం మండలంలోని అమెర్ధ, నెల్లిపాక, మల్లెలమడుగు, బట్టీల గుంపు గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఇక భద్రాచలంలోని కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీలు నదలును తలపిస్తున్నాయి. అక్కడ నివసిస్తున్న కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.