ETV Bharat / city

'సర్వ విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడికి విఘ్నాలు'

author img

By

Published : Jun 26, 2020, 9:53 AM IST

బొజ్జ గణపయ్యల తయారీకి ఆటంకాలు
బొజ్జ గణపయ్యల తయారీకి ఆటంకాలు

సర్వ విఘ్నాలను తొలిగించే విఘ్నేశ్వరుడికి.. విఘ్నాలు తప్పడం లేదు. ఈ ఏడాది భారీ విగ్రహాలు ఎట్టి పరిస్థితుల్లో తయారు చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాలను రూపొందించేందుకు సామగ్రి లభించక బొజ్జ గణపయ్యల తయారీకి ఆటంకం ఏర్పడింది. వందల కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి ఉండగా...ఆర్డర్లు రాకపోయేసరికి తయారీదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

బొజ్జ గణపయ్యల తయారీకి ఆటంకాలు

రాష్ట్రంలో హైదరాబాద్‌ తర్వాత కరీంనగర్, కోరుట్లలోనే అత్యధిక వినాయక విగ్రహాల తయారు చేస్తారు. కరీంనగర్‌లో దాదాపు 15 వరకు విగ్రహాల తయారీ కేంద్రాలుండగా.. కోరుట్ల పట్టణంలో 20 వరకూ కేంద్రాలున్నాయి. ఏటా 20 వేలకు పైగా విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తుంటారు. సుమారు 1000 మంది ప్రత్యక్షంగా.. మరో 500 మంది పరోక్షంగా విగ్రహాల తయారీ ద్వారా ఉపాధి పొందేవారు. కరోనా నేపథ్యంలో ముందుగానే భారీ విగ్రహాలు తయారు చేయవద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. చిన్నచిన్న విగ్రహాలు మాత్రమే తయారు చేయాలని సూచించారు. దీనికి తోడు లాక్‌డౌన్‌ వల్ల ముడి సరుకు లభించక విగ్రహాల తయారీదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. విగ్రహాల తయారీలో నైపుణ్యంగల కళాకారులు రాలేకపోవడం... వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోగా.. తయారీకి ఆటంకం ఏర్పడింది. పెట్టుబడి సైతం వచ్చేలా లేదంటూ తయారీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వడ్డీ కూడా కష్టమే...

వినాయకచవితి ముగిసిన అనంతరం రెండు నెలల తరువాత మళ్లీ విగ్రహాల తయారీ ప్రారంభమౌతుంది. విగ్రహాల తయారీకి ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ రాజస్థాన్‌ నుంచి, కొబ్బరిపీచు ఆంధ్ర, తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటారు. నైపుణ్యం గల కళాకారులు ఎక్కువగా మహారాష్ట్ర, రాజస్థాన్‌ల నుంచి వస్తుంటారు. ఏటా రెండు అడుగుల నుంచి 16 అడుగుల వరకు వినాయక విగ్రహాలను తయారు చేస్తుంటారు. పది వేల వరకూ విగ్రహాలను తయారీ చేయాల్సి ఉండగా... వైరస్‌ ప్రభావంతో కొద్ది మంది కార్మికులతో కేవలం మూడు వేల విగ్రహాలు మాత్రమే తయారు చేస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం విగ్రహాలు తయారు చేస్తే తమకు గిట్టుబాటు కాదని తయారీదారులు వాపోతున్నారు. గుడారాలకు చెల్లించాల్సిన అద్దెతో పాటు తీసుకువచ్చిన పెట్టుబడికి వడ్డీ కూడా కష్టమేనంటున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి.

ప్రస్తుతం చిన్నచిన్న వినాయక విగ్రహాలకు రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని తయారీదారులు విజ్ఞప్తి చేస్తున్నారు

ఇవీచూడండి: శానిటైజర్లా..శనిటైజర్లా..? మార్కెట్​లో నాసిరకం అమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.