No mask : నో మాస్క్​, నో శానిటైజర్​... మరో ముప్పు తప్పదా?

author img

By

Published : Nov 12, 2021, 4:45 PM IST

corona
corona ()

కరోనా (Corona pandemic) తగ్గిందన్న ఆలోచనతో ప్రజలు సాధారణ జీవనాన్ని ఇప్పుడిప్పుడే అలవరచుకుంటున్నారు. మహమ్మారి మాటేసిందన్న ఆలోచన మరిచి జనాలు ప్రవర్తిస్తున్నట్టే అనిపిస్తోంది. మాస్కు (No mask) మరిచారు. సానిటైజర్ ఊసేలేదు. కరోనా తగ్గుముఖం పట్టినా... పోస్ట్‌ కొవిడ్‌తో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. తగు చర్యలు తీసుకోకపోతే మరోసారి ముప్పు తప్పదన్న సంకేతాలు వస్తున్న తరుణంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

నో మాస్క్​, నో శానిటైజర్​... మరో ముప్పు తప్పదా?

2020 జనవరి ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్న వేళ పలు దేశాలు వైరస్‌ వ్యాప్తితో (Corona pandemic) వణికిపోయాయి. క్రమంగా ప్రపంచమంతా వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి దాదాపు ఏడాదిన్నరగా లక్షల మంది ప్రాణాలు తీసింది. కోట్లాది మందిని ఆస్పత్రులపాలు చేసింది. కుటుంబాలకు కుటుంబాలే చిన్నాభిన్నమయ్యాయి. అయినవారిని కోల్పోయిన వారి ఆక్రందనలు ఓ వైపు.. ఉన్నవారిని కాపాడుకోవాలన్న ఆతృత మరోవైపు.... దాదాపు ఏడాదిన్నరగా వైరస్‌తో యుద్ధం చేస్తోన్న పరిస్థితి. కొవిడ్ టీకాలు అందుబాటులోకి రావటంతో వైరస్‌ని జయించిన వారిలో ఉత్పన్నమైన యాంటీ బాడీలతో పరిస్థితి కొంత కుదుటపడింది. ఇప్పుడిప్పుడే సాధారణ జీవితం ప్రారంభిస్తున్నాం. అయితే ఇప్పుడే జాగ్రత్తగా వ్యవహరించకపోతే ముప్పు తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా సహా పలు దేశాల్లో మళ్లీ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మమ్మల్నేం చేస్తుందిలే అనే ధైర్యమా?

రాష్ట్రంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్న వేళ ప్రజల్లోనూ ఆ మేరకు నిర్లక్ష్యం కనిపిస్తోంది. వైరస్ సోకదన్న ధీమా, టీకా తీసుకున్నాంలే అనే భరోసా, కరోనా మమ్మల్నేం చేస్తుందిలే అనే ధైర్యమో తెలియదు కానీ... మాస్కు వేసుకోవటమే (No mask) మరుస్తున్నారు. వేసుకున్నా అలంకార ఆభరణంగా మారిన పరిస్థితి. ఇక సానిటైజర్ మాట చెప్పే పనిలేదు. పని ప్రదేశాల్లో, షాంపిగ్ మాల్స్‌లో రోడ్లపైనా ఎక్కడ చూసినా మాస్కు లేకుండానే దర్శమిస్తున్నారు. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే మరోసారి వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. రెండు డోసుల టీకా తీసుకున్నవారిలో సైతం కొందరు మహమ్మారి బారిన పడుతున్నట్టు చెబుతున్నారు. ఇక చిన్నారులకు ఇప్పటికీ టీకా అందుబాటులోకి రాని కారణంగా మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ గత అనుభవాల దృష్ట్యా అజాగ్రత్తగా ఉంటే ముప్పు తప్పదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి : 'టేబుల్ టేబుల్​కు తిరిగి దండం పెట్టినా పని కాలేదు.. అందుకే...'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.