ETV Bharat / city

kishan reddy: 'అన్ని పర్యాటక ప్రదేశాల్లోను టూరిస్టు పోలీస్​ స్టేషన్ పెట్టాలని ​ఉంది'

author img

By

Published : Aug 23, 2021, 8:11 PM IST

Updated : Aug 23, 2021, 8:47 PM IST

అన్ని రాష్ట్రాల్లో ఉండే పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టు పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భద్రత ఉంటేనే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్​లో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీసు స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు.

kishan reddy
kishan reddy

హైదరాబాద్‌ ఫెస్టివల్‌ సిటీ అని... ఇక్కడి పోలీసులకు కీలక బాధ్యతలు ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి అన్నారు. హైదరాబాద్​లో నూతనంగా నిర్మించిన కాచిగూడ పోలీసు స్టేషన్ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిలతో కలిసి కేంద్రమంత్రి ప్రారంభించారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ, ఏపీ పోలీసుల పనితీరుపై హోంశాఖ అధికారులు చెప్పేవారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఉండే పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టు పోలీసు స్టేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భద్రత ఉంటేనే పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారని పేర్కొన్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక ఈశాన్య భారతదేశంలో అభివృద్ది జరిగిందన్నారు. దేశంలో ఎక్కడా కూడా బాంబుపేలుళ్లు, ఉగ్రవాద కార్యకలాపాలు, కర్ఫ్యూలు లేవని వెల్లడించారు. ప్రజల సహకారం పూర్తి స్థాయిలో ఉందని కేంద్రమంత్రి తెలిపారు.

కాచిగూడ పోలీసు స్టేషన్ భవన ప్రారంభ కార్యక్రమం

నేను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడు అనేక అంశాలు చర్చకు వచ్చినప్పుడు... కేంద్రస్థాయిలోని హోంశాఖ అధికారుల్లో మన రెండు రాష్ట్రాలకు మంచి పేరు ఉంది. ఈ రెండు రాష్ట్రాల పోలీస్​ శాఖల పనితీరుపై జాతీయ స్థాయిలో సదభిప్రాయం ఉంది. కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న సమయంలో సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలోగాని.. ఏదైనా కేటాయింపులు చేయాల్సి వచ్చినప్పుడు గానీ.. కచ్చితంగా అర్హతపొందే రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ ఉన్నాయి. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి.

సైబర్‌ క్రైమ్ పెద్ద ఛాలెంజ్‌గా మారిందని.. ప్రజల్లో చైతన్యం వస్తేనే అవి అదుపులోకి వస్తాయన్నారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ పటిష్ఠమైందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లే అయినా అత్యాధునిక సాంకేతికత ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. భవిష్యత్‌లో మరిన్ని పోలీసు స్టేషన్‌లకు నూతన భవనాలు ప్రారంభిస్తామని మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం, భద్రత కల్పించడమే పోలీసుల లక్ష్యమని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో అత్యాధునిక భవనాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. పోలీసు వ్యవస్థకు గుండెలాంటి కమాండ్‌ కంట్రోల్‌ దేశానికి ఆదర్శంగా నిలువనుందని డీజీపీ స్పష్టం చేశారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల చొరవతో సీసీ టీవీ ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నామని డీజీపీ వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న సీసీ కెమెరాల వల్ల అనేక నేరాలను అరికడుతున్నామన్నారు.

ప్రతి పోలీస్​ స్టేషన్​ కూడా ఆ ఠాణా పరిధిలో ఉన్న ప్రజలకు పోలీస్​ స్టేషన్​ మా వ్యవస్థ, మాకోసం పనిచేస్తుంది. అక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకాన్ని ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ వల్ల అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రేటర్​ పరిధిలో మూడు కమిషనరేట్​ ఏరియాలు కలుపుకుని దాదాపు 6.5 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాము. నేరం చేస్తే దొరికిపోతారనే భయాన్ని... ప్రజల్లో నమ్మకాన్ని ఇవ్వగలిగాం. హైదరాబాద్​లో నేరానికి పాల్పడి ఎక్కడికి వెళ్లినా గాని పోలీసులు పట్టుకుంటానే భయాన్ని నేరస్థుల్లో వచ్చేలా చేశాము. -మహేందర్​ రెడ్డి, డీజీపీ

ఇదీ చూడండి: Kishan Reddy: 'ప్రజలు అపోహలు వీడాలి... వ్యాక్సిన్​ వేయించుకునేందుకు రావాలి'

Last Updated : Aug 23, 2021, 8:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.