ETV Bharat / city

షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. ఏసీబీ అధికారులకే మస్కా..

author img

By

Published : Jul 10, 2020, 9:26 AM IST

అనిశాకు చిక్కిన షేక్​పేట తహసీల్దార్​ కార్యాలయం ఆర్​ఐ, బంజారాహిల్స్​ ఎస్​ఐ ఘటన ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘటనను లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు.. సదరు ఘటనలో ఏకంగా అనినీతి నిరోధక శాఖనే బాధితుడు తప్పుపట్టించినట్లు గుర్తించారు.

twist in Shaikpet acb cas
షేక్​పేట ఘటనలో కొత్త కోణం.. అనిశానే తప్పుపట్టించిన ఫిర్యాదుదారుడు

బంజారాహిల్స్‌లో రూ.50 కోట్ల విలువైన స్థలానికి సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు లంచం అడుగుతున్నారంటూ అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేసిన బాధితుడు సయ్యద్‌ ఖాలిద్‌ అనిశా అధికారులకే మస్కా కొట్టిన విషయం తాజాగా వెలుగుచూసింది.

జూన్‌ 6న అనిశాకు షేక్‌పేట తహసీల్దారు కార్యాలయం ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌లు చిక్కారు. అదే సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులున్నాయంటూ అప్పటి షేక్‌పేట తహసీల్దార్‌ సీహెచ్‌ సుజాతనూ అరెస్టు చేశారు. అసలు ఆ స్థలం సర్వేకు రెవెన్యూ అధికారులు రూ.50 లక్షలు లంచం ఎందుకు అడిగారనే కోణంలో శోధిస్తూ బాధితుడు ఖాలిద్‌ కోర్టుకు సమర్పించిన దస్తావేజులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలను అనిశా అధికారులు పరిశీలించారు. అతడు తమకు సమర్పించింది తప్పుడు పత్రాలుగా గుర్తించారు. ఖాలిద్‌పైనా చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు.

తన తండ్రి కొన్నాడంటూ..

పాతబస్తీలో నివాసముంటున్న సయ్యద్‌ ఖాలీద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 14లో ఎకరా 20 గుంటల స్థలం తనదేనని.. తన తండ్రి 1969లో కొన్నాడని తప్పుడు పత్రం సృష్టించాడు. 1991లో ఒక ఎమ్మార్వో ధ్రువీకరించినట్టు మరో నకిలీ పత్రాన్ని తయారు చేశాడు. 1995లో భూమి తన పేరుతో రిజిస్ట్రేషన్‌ అయ్యిందంటూ నకిలీ దస్తావేజు రూపొందించాడు. 2007లో షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం సర్వే చేసినట్టుగా ఇంకో నకిలీ కాగితాన్ని తయారు చేశాడు. వాటన్నింటినీ జత చేసి 2018లో కోర్టులో ఫిర్యాదు చేశాడు.

ఆ స్థలం ఖాలిద్‌దేనని, తాజాగా సర్వే చేసి ఇవ్వాలంటూ గత ఏడాది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఖాలిద్‌ షేక్‌పేట తహసీల్దార్‌ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ స్థలం వందేళ్ల నుంచి ప్రభుత్వానికే చెందిందంటూ పక్కా రికార్డులున్నాయని రెవెన్యూ అధికారులు సర్వే చేసేందుకు నిరాకరించారు. ఎలాగైనా ఆ భూమిని సొంతం చేసుకోవాలనుకున్న ఖాలీద్‌.. ఆర్‌ఐ నాగార్జునరెడ్డితో మాట్లాడాడు. ఆర్‌ఐ రూ.50 లక్షలు లంచం అడగ్గా.. బయానా కింద రూ.3 లక్షలు ఇచ్చాడు. అనంతరం ఖాలిద్‌ తహసీల్దార్‌ సుజాతతోనూ మాట్లాడాడు.

ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా ఖాలిద్‌పై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌తో మూడు నెలలు మౌనంగా ఉన్నారు. మే చివరి వారంలో రూ.30లక్షలు ఇవ్వాలంటూ ఆర్‌ఐ ఒత్తిడి చేయడంతో ఖాలిద్‌ పథకం మార్చి అనిశా అధికారులను ఆశ్రయించాడు.

ఇవీచూడండి: రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఆర్​ఐ

షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.