ETV Bharat / city

'కేంద్రం ధాన్యం కొనకపోతే మేమే కొని దిల్లీ గేటు ముందు పారబోస్తాం'

author img

By

Published : Dec 24, 2021, 5:25 PM IST

TRS Ministers and MPs on paddy procurement in telangana at Delhi
TRS Ministers and MPs on paddy procurement in telangana at Delhi

TRS Ministers and MPs comments: వారం రోజులుగా దిల్లీలోనే పడిగాపులు పడుతున్న తెరాస నేతల బృందం మరోసారి కేంద్రంపై విరుచుకుపడింది. రెండు రోజుల్లో స్పష్టత ఇస్తామని చెప్పి... ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం చెప్పట్లేదని మండిపడింది. కేంద్రం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై రకరకాల ఆరోపణలు చేస్తోందని నేతలు దుయ్యబట్టారు.

TRS Ministers and MPs comments: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని, ముందుచూపులేమిని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర సర్కారుపై నెపం మోపుతున్నారని తెరాస నేతల బృందం ఆరోపించింది. వారం రోజులుగా దిల్లీలో ఉన్నా.. ధాన్యం సేకరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవటంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి ధాన్యం తీసుకోవటం ఇష్టంలేక.. పలు కారణాలు చెప్తున్నారని విమర్శించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని.. ఇక నుంచి వచ్చే ధాన్యం పరిస్థితిపై లిఖితపూర్వక స్పష్టత ఇవ్వాలని డిమాండ్​ చేశారు. యాసంగిలో ధాన్యం కొనేది లేదని మరోసారి కేంద్రం స్పష్టం చేసింది కనుక.. ఇక రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవని మంత్రులు వెల్లడించారు.

గోదాముల్లో నిల్వలు అలాగే ఉన్నాయి..

minister gangula kamalakar comments: "కేంద్రమంత్రి పీయూష్​ గోయల్​ రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారు. కేంద్రానికి ఇస్తామన్న ధాన్యం ఇవ్వటం లేదన్నారు. ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఏడు లేఖలు రాశాం. రాష్ట్రంలోని గోదాముల్లో బియ్యం నిల్వలు నిండిపోయాయి.. తీసుకెళ్లండి అని లేఖలు రాశాం. అయినా.. ఒక్క దానికి కూడా స్పందన రాలేదు. మా గోదాములు నిండిపోయాయి... పక్కరాష్ట్రాల్లో ఉన్న ఖాళీ గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతివ్వండి అని అడిగినా.. ఎటువంటి సమాధానం రాలేదు. ఇప్పుడు కూడా సగం బియ్యమే తీసుకెళ్లారు. మిగతా సగం గోదాముల్లోనే ఉంది. ఇప్పుడు అవి ఖాళీ చేస్తేనే.. ఇప్పుడొచ్చే ధాన్యాన్ని నిలువ చేయగలం. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు." -గంగుల కమలాకర్​, మంత్రి

ఇప్పటికీ స్పష్టత ఇవ్వట్లేదు..

minister vemula Prashant comments: "బియ్యం సేకరణపై ఎఫ్‌సీఐ, కేంద్రం గోడౌన్లు పెంచలేదు. వానాకాలం పంట కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరేందుకు దిల్లీకి వచ్చాం. వడ్ల సేకరణపై మాట్లాడేందుకు వారం రోజుల క్రితం దిల్లీకి వచ్చాం. తెలంగాణలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు మాత్రమే కొంటామన్నారు. తెలంగాణలో 60 లక్షల మెట్రిక్‌ టన్నులకుపై ధాన్యం నిల్వలున్నాయి. ఇంకా వడ్లు వస్తున్నాయి.. కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. వానాకాలంలో రా రైస్‌ ఎంత పండితే అంత కొంటామని కేంద్ర పెద్దలన్నారు. రైతుల నుంచి పంట మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొంటుంది. కేంద్రం ధాన్యం కొనకపోతే మేమే కొని దిల్లీ గేటు ముందు పారబోస్తాం. 60 లక్షల మెట్రిక్‌ టన్నుల పైబడిన ధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందే." - వేముల ప్రశాంత్​రెడ్డి, మంత్రి

రాష్ట్ర రైతులను ఎగతాళి చేస్తున్నారు...

MP nama nageshwar rao comments: "పార్లమెంటులో 9 రోజుల పాటు రైతు సమస్యలపై పోరాడాం. పార్లమెంటు లోపల, బయట అనేక రూపాల్లో ఆందోళన చేశాం. రాష్ట్ర రైతులను కేంద్రం పెద్దలు అవమానిస్తున్నారు. తెలంగాణలో ఇంత ధాన్యం ఎక్కడి నుంచి వచ్చిందని ఎగతాళి చేశారు. కేంద్ర ప్రభుత్వం చలనం లేకుండా రైతులను ఆవేదనకు గురిచేస్తోంది. తెలంగాణలో పండిన పంటను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది లేదా..? ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కరించాలని కేంద్రాన్ని కోరుతున్నాం." - నామ నాగేశ్వరరావు, ఎంపీ

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.