ETV Bharat / city

బస్తీ మే సవాల్​: పట్టునిలుపుకోనేనా?.. పాగా వేసేనా?

author img

By

Published : Nov 18, 2020, 7:47 AM IST

Updated : Nov 18, 2020, 9:03 AM IST

హైదరాబాద్‌ నగరపాలక సంస్థ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. పట్టు నిలుపుకోవాలని తెరాస.. పాగా వెయ్యాలని భాజపా.. ప్రభావం చూపాలని కాంగ్రెస్‌.. వ్యూహాలకు పదును పెట్టాయి. గత ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతను సాధించిన తెరాస మళ్లీ అలాంటి విజయం సాధించాలనే లక్ష్యంతో పని చేయనుంది. దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన భాజపా, ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. దుబ్బాకలో మూడో స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్‌ గ్రేటర్‌లో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంది.

political parties strategies for ghmc elections 2020
బస్తీ మే సవాల్​: పట్టునిలుపుకునేనా?.. పాగా వేసేనా?

కేటీఆర్‌ విస్తృత పర్యటనలు

2016 గ్రేటర్‌ ఎన్నికల్లో భారీ ఆధిక్యతను సాధించడంతోపాటు శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలుచుకున్న తెరాస ఈ ఎన్నికల్లో కూడా పూర్తి ఆధిక్యతను సాధించేందుకు గట్టి ప్రయత్నం చేస్తోంది. కొన్నినెలలుగా మంత్రి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. వరదల సమయంలోనూ, ఆ తర్వాత రోజూ 20కి పైగా ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. కొత్త పరిశ్రమలు వచ్చేలా చూడటం, ఐటీపై దృష్టి సారించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరానికి ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్న అభిప్రాయాన్ని తెరాసవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దుబ్బాక ఫలితంతో అప్రమత్తమైన తెరాస ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలందరినీ పూర్తి స్థాయిలో రంగంలోకి దింపనుంది.

గత ఎన్నికల్లో ఎవరెక్కడ?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు మొత్తం 150 డివిజన్లుండగా గత ఎన్నికల్లో అధికార తెరాస 99 స్థానాలను గెలుచుకొని భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం 44 స్థానాలను గెలుచుకొంది. భాజపాకు 4, కాంగ్రెస్‌కు 2, తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం దక్కాయి. గత ఎన్నికల్లో భాజపా-తెలుగుదేశం కలిసి పోటీ చేయగా, తెదేపాకు 45 చోట్ల, భాజపాకు 35 చోట్ల రెండోస్థానం దక్కాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అనేక రాజకీయ పరిణామాల కారణంగా తెదేపా బలహీనపడింది. 2018 శాసనసభ ఎన్నికల్లో నగరంలో భాజపా, కాంగ్రెస్‌ చెరోస్థానంలో గెలిచాయి. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని కొంతభాగం నగరపాలక సంస్థలో ఉండగా.. అక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన సబితా ఇంద్రారెడ్డి తర్వాత తెరాసలో చేరి ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్నారు. ఎల్‌.బి.నగర్‌ నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచిన సుధీర్‌రెడ్డి తెరాసలో చేరారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిధిలో ఒక భాజపా ఎమ్మెల్యే మినహా మిగిలినవారంతా తెరాసనే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి భాజపా, మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ గెలుపొందాయి.

కాంగ్రెస్‌ ప్రభావం ఎంత?

కాంగ్రెస్‌ 2016 ఎన్నికల్లోనూ నామమాత్రపు ప్రభావాన్నే చూపింది. రెండు స్థానాలను గెల్చుకోగా, పదిలోపు డివిజన్లలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. దుబ్బాకలో ప్రతి మండలానికి ఓ ముఖ్య నాయకుడిని ఇన్‌ఛార్జిగా పెట్టినా మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌, ఇప్పుడు నగర పాలక సంస్థలో కూడా ఒక్కో లోక్‌సభ పరిధిలో ముఖ్యనాయకులతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఎన్నిచోట్ల ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల్లో ఏ మేరకు ఆధిపత్యం నిలబెట్టుకుంటారో చూడాల్సి ఉంది. పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలోని జనసేన ఈ ఎన్నికల్లో పోటీచేయనున్నట్లు ప్రకటించగా, వామపక్షాలు కలిసి మూడో వంతు సీట్లలో పోటీ చేయనున్నాయి. అయితే ఆ పార్టీల ప్రభావం నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది.

భాజపా గట్టి యత్నాలు

దుబ్బాక విజయంతో హుషారుగా ఉన్న భాజపా గ్రేటర్‌లో కూడా మెరుగైన పలితాలు సాధించడం ద్వారా రాష్ట్రంలో అధికార తెరాసకు తామే ప్రత్యామ్నాయం అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఈ ఫలితాల ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుందని భావిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి గెలిచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో స్థానికంగా జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండటం వల్ల భాజపా అభ్యర్థులను గెలిపించుకోవడానికి ఈయన గట్టి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. భాజపా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకైక స్థానం గెలుచుకున్నది నగరంలోనే. తెలంగాణలో పాగాకు ఈ ఎన్నికలు ఓ అవకాశంగా ఆ పార్టీ భావిస్తోంది. కొన్ని స్థానాల్లో భాజపా, తెరాస మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ఇవీ చూడండి: కేసీఆర్​ అధ్యక్షతన నేడు తెరాస శాసనసభాపక్ష, పార్లమెంటరీ పార్టీ సమావేశం

Last Updated :Nov 18, 2020, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.