ETV Bharat / city

Revanth Reddy: 'పేలవమైన వాదన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిలిపేయాలని తీర్పొచ్చింది'

author img

By

Published : Oct 29, 2021, 5:48 PM IST

Updated : Oct 29, 2021, 7:59 PM IST

జాతీయ హరిత ట్రైబ్యునల్​ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ పేలవమైన వాదనలు వినిపించడం వల్లే పాలమూరు-రంగారెడ్డిని నిలిపివేయాలని తీర్పు వచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఫలితంగా ఆ ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి చేశారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. దక్షిణ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఏపీ ముఖ్యమంత్రి జగన్​ వద్ద తాకట్టు పెట్టారని ఆరోపించారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy: 'పేలవమైన వాదన వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిలిపేయాలని తీర్పొచ్చింది'

రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదన వినిపించకపోవడం వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆపేయాలని ఎన్జీటీ తీర్పు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఓ సామాన్యుడి వాదన ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందన్నారు. ఫలితంగా దక్షిణ తెలంగాణ ప్రజలు అన్యాయానికి గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేవలం మూడేళ్లలో పూర్తిచేస్తామని గతంలో కేసీఆర్​ చెప్పారని రేవంత్​ గుర్తుచేశారు. కానీ ఆరేళ్లయినా ఈ ప్రాజెక్టు పూర్తికాలేదని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తికావాల్సి ఉంది.. ఇంకా ఈ పథకానికి రూ. 55 వేల కోట్లు కావాల్సి ఉందన్నారు.. రేవంత్​రెడ్డి.

2017లో కేంద్ర పర్యావరణ శాఖ వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు కోసం పెట్టిన దరఖాస్తును కేసీఆర్​ ప్రభుత్వం ఎందుకు ఉపసంహరించుకుందో చెప్పాలని రేవంత్​రెడ్డి డిమాండ్​ చేశారు. నాడే అనుమతులు తెచ్చుకొని ఉంటే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేది కాదుకదా అని నిలదీశారు. దక్షిణ తెలంగాణ ప్రయోజనాలను జగన్​ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని రేవంత్​రెడ్డి ఆరోపించారు.

పట్టిసీమపైనా..

ఏపీ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమకు కూడా అనుమతులు లేవని.. కానీ అనుమతులు వచ్చే లోపే ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం పూర్తిచేసిందని.. ఫలితంగా పట్టిసీమపై దాఖలైన కేసులో ఏపీ ప్రభుత్వానికి కేవలం జరిమానా వేసి ఎన్జీటీ వదిలిపెట్టిందని రేవంత్​రెడ్డి చెప్పారు.

'కిషన్​రెడ్డి, బండి సంజయ్​పైనా బాధ్యత ఉంది..'

పేలవమైన వాదనలు వినిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి చేశారని రేవంత్​రెడ్డి మండిపడ్డారు. రాజకీయ స్వార్థం కోసం కృష్ణా నీటి వివాదాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారని రేవంత్​ ఆరోపించారు. 10 రోజుల్లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల ఇప్పించాల్సిన బాధ్యత కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీద కూడా ఉందన్నారు... రేవంత్​రెడ్డి.

సచివాలయం కూల్చేవేతపైనా రేవంత్​ ఘాటు చేశారు. తాము ఎంతచెప్పినా వినకుండా సెంటిమెంట్​ కోసం ఎంతో ప్రాముఖ్యత ఉన్న భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు.

'పాత సచివాలయం నుంచి సేవలు అందించిన 16 మంది సీఎంల కుమారులెవరూ సీఎంలు కాలేదు. ఆ 16 మంది సీఎంలు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందారు కానీ కొడుకులు సీఎం కాలేదు. తన కొడుకును సీఎం చేయడానికి వాస్తు పేరుతో కేసీఆర్ పాత సచివాలయాన్ని కూల్చారు. ట్యాంక్ బండ్ శిఖంలో కొత్త సచివాలయం నిర్మాణం చేయొద్దని నేను ఎన్జీటీ, సుప్రీంకోర్టులో కేసు వేశాను. ఆ కేసులో కోట్లాది రూపాయలు ఇచ్చి తుషార్ మెహతా లాంటి ఉద్దండులైన న్యాయ కోవిదులతో వాదనలు వినిపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కేసులో కూడా ఎందుకు న్యాయ కోవిదులను పెట్టి వాదనలు వినిపించలేదు'

- రేవంత్​రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఇదీచూడండి: Chennai NGT News: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై స్టే విధించిన చెన్నైఎన్జీటీ

Last Updated : Oct 29, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.