ETV Bharat / city

Revanth Reddy: 'ఎంతమందిని అరెస్టు చేసినా ర్యాలీ చేసి తీరతాం'

author img

By

Published : Jul 16, 2021, 11:52 AM IST

Updated : Jul 16, 2021, 12:03 PM IST

చలో రాజ్​భవన్​ కార్యక్రమానికి తనదే బాధ్యత అని... శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని టీపీసీసీ రేవంత్​రెడ్డి హామీ ఇచ్చారు. ర్యాలీ కోసం వస్తున్న శ్రేణులను అరెస్టులు చేయటం... నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

tpcc chief revanth reddy about chalo raj bhavan rally
tpcc chief revanth reddy about chalo raj bhavan rally

'ఎంతమందిని అరెస్టు చేసినా ర్యాలీ చేసి తీరతాం'

ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు ఈ దేశ పౌరులుగా తమకు హక్కు లేదా అని ప్రభుత్వాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. పోలీసులు ఎంత మందిని అరెస్టు చేసినా నిరసన కార్యక్రమం చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు. ఇందిరాపార్కుకు చేరిన రేవంత్​... నాయకులు, కార్యకర్తల అరెస్టులు, నిర్బంధాలపై మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిర్బంధిస్తే ఊరుకోం...

"పీసీసీ అధ్యక్షుడిగా నేను హామీ ఇస్తున్నా... శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిరసన ప్రదర్శన చేస్తాం. ఏఐసీసీ పిలుపుమేరకు చేస్తున్న ఈ కార్యక్రమం కొవిడ్ నిబంధనలకు అనుగుణంగానే నిర్వహిస్తాం. ధర్నా చౌక్ దగ్గర నుంచి రాజ్​భవన్ వరకు ప్రదర్శనగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించాలి. మా సంయమనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షించవద్దు. ముందస్తు అరెస్టులు నిర్బంధాలు చేస్తే... చూస్తూ ఊరుకోం. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి. గృహనిర్బంధం చేసిన వారిని వదిలిపెట్టాలి. 40 రూపాయల పెట్రోల్​ను 105 రూపాయలకు విక్రయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి. పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తే లక్షలాదిమంది కార్యకర్తలు రోడ్డుపైకి వస్తారు. పోలీసులు తమ విచక్షణ అధికారాల మేరకు విధులు నిర్వహించాలి." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు.

ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు...

పార్టీ పిలుపు మేరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్​కు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. ఉదయం నుంచే కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది రాజ్​భవన్ దగ్గరకు వచ్చేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఇందిరా పార్కు నుంచి రాజ్​భవన్​కు ర్యాలీగా వెళ్లి గవర్నర్​కు వినతిపత్రం ఇవ్వాలని కాంగ్రెస్ భావించినప్పటికీ.. పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ధర్నా చౌక్ వద్ద మధ్యాహ్నం రెండు గంటల వరకు కేవలం 200 మందితో సమావేశానికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్‌కు వెళ్లకుండా ఇందిరా పార్కు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు.

కాంగ్రెస్​ నాయకులను, కార్యకర్తలను గృహనిర్బంధం చేస్తున్నారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో పటాన్​చెరు నుంచి వచ్చిన ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు... రాజ్​భవన్​ వైపు దూసుకొచ్చారు. పోలీసులను తప్పించుకుని ఆటోలో వచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్​ జెండాలతో రాజ్​భవన్​ గేటు వద్దకు చేరుకున్నారు. తమతో పాటు తెచ్చుకున్న కాంగ్రెస్​ పార్టీ జెండాలను రాజ్​భవన్​ గేటుకు కట్టి... నినాదాలు చేశారు. రాజ్​భవన్​ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా... అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. అనంతరం ఆ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు.

ఇదీ చూడండి: Chalo Raj bhavan: ఎక్కడికక్కడ ముళ్లకంచెలు.. రాజ్​భవన్​ గేటుకు కాంగ్రెస్​ జెండాలు!

Last Updated : Jul 16, 2021, 12:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.